(Source: ECI/ABP News/ABP Majha)
East Godavari News : శృతిమించిన అనుచరుల అభిమానం, నోట్ల కట్టలు రోడ్డుపై వెదజల్లుతూ మంత్రికి స్వాగతం
East Godavari News : తమ అభిమాన నేతకు రెండో సారి మంత్రి పదవి దక్కడంతో అనుచరులు శృతిమించారు. మంత్రికి స్వాగతం పలికేందుకు నోట్ల కట్టలు రోడ్డుపై జల్లుతూ, బైక్ లతో ప్రమాదకర స్టంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచారు.
East Godavari News : ఏపీలో కొత్త కేబినెట్ కొలువుదీరింది. కొత్త కేబినెట్ కొందరు పాత మంత్రులకు రెండో సారి అవకాశం లభించింది. వీరిలో పినిపే విశ్వరూప్ ఒకరు. పినిపే విశ్వరూప్ కు రెండో సారి మంత్రి పదవి దక్కడంతో ఆయన అనుచరుల అభిమానం హద్దులు దాటింది. గతంలో రికార్డింగ్ డ్యాన్సుల సమయంలో కరెన్సీ నోట్లు జల్లే ఘటనలు చూసే ఉంటారు. అయితే తమ అభిమాన మంత్రికి స్వాగతం చెప్పడానికి ఆయన అనుచరులు చేసన హడావుడి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సీన్ మొత్తం కోనసీమ జిల్లాలో జరిగింది. పినిపే విశ్వరూప్ మంత్రిగా ఎన్నికై తొలిసారి జిల్లాకు రావడంతో ఆయన అభిమానులు రెచ్చిపోయారు. మంత్రిపై నోట్ల కట్టలు జల్లడమే కాకుండా, రోడ్డుపై బైక్ స్టంట్స్ చేస్తూ స్థానికులను కాస్త ఎక్కువగానే భయపెట్టారు.
కరెన్సీ నోట్లతో అనుచరుల హడావుడి
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కు సీఎం జగన్ కేబినెట్ లో చోటుదక్కించుకున్నారు. ఆయనకు మంత్రి పదవి దక్కడంతో అనుచరులు కరెన్సీ నోట్లు జల్లుతూ స్వాగతం పలికారు. మామిడికుదురు మండల వైసీపీ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ కొమ్ముల కొండలరావు భారీగా కరెన్సీ నోట్లు తెచ్చి రోడ్డుపై జల్లుతూ మంత్రికి స్వాగతం పలికారు. మంత్రి విశ్వరూప్ స్వాగత ర్యాలీలో వైసీపీ కార్యకర్తలు బైక్ లతో హడావిడి చేశారు. రవాణా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతా తొలసారి అమలాపురం వచ్చిన విశ్వరూప్ కు ఇలా నోట్ల కట్టలతో స్వాగతం తెలిపారు.
తండ్రి, తనయుడి కేబినెట్ లో స్థానం
మంత్రి విశ్వరూప్ స్వగ్రామం అమలాపురం. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామానికి వచ్చిన తమ అభిమాన నేతకు స్వాగతం పలికేందుకు వైసీపీ కార్యకర్తలు పోటీపడ్డారు. కానీ అభిమానుల హడావుడి హద్దులు దాటిందని కొందరు విమర్శిస్తు్న్నారు. 2019లో అమలాపురం నుంచి గెలిచిన పినిపే విశ్వరూప్ సీఎం జగన్ తొలి కేబినెట్ లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మళ్లీ రెండో సారి అవకాశం పొందిన 11 మంది సీనియర్లలో పినిపే ఒకరు. ఈసారి విశ్వరూప్ కు రవాణా శాఖ కేటాయించారు సీఎం జగన్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన పినిపే, తాజాగా సీఎం జగన్ కేబినెట్ లో స్థానం దక్కించుకుని తండ్రి, తనడయుడు ఇద్దరి కేబినెట్ ల్లోనూ మంత్రిగా పని చేసిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. సాధారణంగా పినిపే విశ్వరూప్ వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి. కానీ తాజాగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే వార్తల్లో నిలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.