AP స్కిల్ డెవలప్ మెంట్ లో స్కాం జరగలేదు, డీజీ టెక్ కంపెనీ ఎండీ కీలక విషయాలు వెల్లడి
AP Skill Development Scam: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‍తో ఒప్పందంలో ఎలాంటి స్కాం జరగలేదని డిజిటెక్ కంపెనీ ఎండీ ఖన్వెల్కర్ స్పష్టం చేశారు.
Digitech MD Khanvilkar:
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‍తో ఒప్పందంలో ఎలాంటి స్కాం జరగలేదని డిజిటెక్ కంపెనీ ఎండీ ఖన్వెల్కర్ స్పష్టం చేశారు. ఏపీలో స్కిల్ స్కామ్ జరిగిందని చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరం అన్నారు. ఒప్పందానికి సంబంధించి మొత్తం వ్యవహారాన్ని వివరిస్తూ కంపెనీ తరపున వీడియో విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం మేరకు రూ. 371 కోట్ల విలువైన మొత్తం సామగ్రిని సరఫరా చేశామని తెలిపారు. ఆ సరఫరా చేసిన మొత్తం ఎక్విప్‍మెంట్‍కు సంబంధించిన డేటాను వీడియోలో వివరించారు. ఒకవేళ ఆ పరికరాలు నాసిరకంగా ఉన్నా, రిపేరు చేయాల్సి వచ్చినా పూచీ తీసుకున్నామని, దానిపై ఒప్పందంలో ఉందన్నారు.
జీఎస్టీ స్కాం ఉందన్న ఆరోపణలు నిజం కాదని స్పష్టం చేశారు. ఏపీ దర్యాప్తు సంస్థలు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్‍కు సంబంధించి తమను సంప్రదించలేదని డిజిటెక్ ఎండీ ఖాన్వెల్కర్ తెలిపారు. ఆడిటర్లను పంపితే ఒప్పందానికి సంబంధించి పూర్తి లక్కలు చూపుతామని చెప్పారు.
చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పేరుతో వందల కోట్ల అవినీతి జరిగిందని ఏపీ సీఐడీ ఆరోపించింది. 2021లోనే కేసు నమోదు కాగా, దర్యాప్తు వేగవంతం చేసిన సీఐడీ పోలీసులు చంద్రబాబును నంద్యాలలో అదుపులోకి తీసుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఏసీబీ కోర్టులో చంద్రబాబును ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో మంగళవారం చంద్రబాబు తరపున లాయర్లు వేసిన హౌస్ రిమాండ్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.
రిమాండ్ రిపోర్టులో ఏముందంటే..
చంద్రబాబును A - 37 గా రిమాండ్ కోర్టులో సీఐడీ పేర్కొంది. నేరపూరిత కుట్ర, నిధుల దుర్వినియోగంపై అభియోగాలు మోపింది. ప్రజా సేవకుడిగా చంద్రబాబు తన స్థానాన్ని దుర్వినియోగం చేశారని సీఐడీ ఆరోపించింది. ప్రజాప్రతినిధిగా ఉండి చంద్రబాబు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సీఐడీ ఆరోపించింది. 2021లో పేర్కొన్న ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు. తాజాగా ఆయన పేరును చేర్చారు. డిజైన్ టెక్, సీమన్స్ ఎండీలతో కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ అభియోగాలు చేసింది. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరుమీద రిమాండ్ ఈ రిపోర్టు సమర్పించారు. సీఐడీ చీఫ్ నిన్న చెప్పిన అంశాలు, ఆరోపణలనే ప్రధానంగా రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారి పేర్కొన్నారు.
తాడేపల్లి కేంద్రంగా అక్రమాలు
2021 డిసెంబర్ 9 కంటే ముందు నేరం జరిగిందని సీఐడీ వివరించింది. తాడేపల్లిలోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ కేంద్రంగా అక్రమాలు జరిగాయని వెల్లడించింది. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి సీమెన్స్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ వాటాగా రూ.371 కోట్ల రూపాయలను చెల్లించారని సీఐడీ వివరించింది. వీటిలో దాదాపు రూ.279 కోట్ల మేర నిధుల దుర్వినియోగమైనట్లుగా సీఐడీ నివేదికలో వెల్లడించింది. దీనివల్ల ఏపీ ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని సీఐడీ రిమాండ్ రిపోర్ట్ లో తెలిపింది. డిజైన్ టెక్ సంస్థ కొన్ని సంస్థలకు నిధులు బదిలీ చేసిన సమయంలో జీఎస్టీ ఎగవేసిందని రిమాండ్ రిపోర్టులో సీఐడీ పేర్కొంది.
లోకేశ్, అచ్చెన్నాయుడు పేర్లు సైతం..
చంద్రబాబుతో పాటు రిమాండ్ రిపోర్టులో నారా లోకేష్ పేరును కూడా సీఐడీ ప్రస్తావించింది. చంద్రబాబు సన్నిహితుడు కిలారి రాజేశ్ ద్వారా లోకేష్‌కు డబ్బులు అందాయని పేర్కొంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరును కూడా సీఐడీ చేర్చింది.