(Source: ECI/ABP News/ABP Majha)
Dharmana Resign issue : విశాఖ రాజధాని కోసం రాజీనామాకు సిద్ధమన్న ధర్మాన - సీఎం జగన్ ఏమన్నారంటే ?
విశాఖ రాజధాని కోసం రాజీనామా చేస్తానని ధర్మాన సీఎం జగన్‌కు చెప్పారు. అయితే జగన్ మాత్రం వద్దని వారించారు.
Dharmana Resign issue : విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం అవసరమైతే రాజీనామా చేస్తానని ప్రకటించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ... విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాకుండా కొంత మంది అడ్డుకుంటున్నారని అందుకు నిరసనగా తన పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించాలని కోరారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో ధర్మానను వారించారు అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని.. ఆ దిశగా ప్రయత్నిద్దామని రాజీననామాలు అవసరం లేదని సర్ది చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో రాజీనామా చేయాలనుకున్న ధర్మాన వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.
రైతుల పాదాయత్ర ఉత్తరాంధ్రపై దండయాత్ర అంటున్న ధర్మాన
అమరావతి రైతుల పాదాయాత్ర శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి వరకూ జరగనుంది. రైతుల పాదయాత్రను ఉత్తరాంధ్రపై దండయాత్రగా మంత్రి ధర్మాన ప్రసాదరావు చెబుతున్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా కాకుండా అమరావతి రైతులు కుట్ర చేస్తున్నారని ఆయన అంటున్నారు. అసలు వారు రైతులు కాదని రియల్ ఎస్టేట్ వ్యాపారులు,పెయిడ్ ఆర్టిస్టులని అంటున్నారు. అందుకే రాజీనామా చేసి..తమ ప్రాంతం కోసం పోరాడాలని ఆయన అనుకున్నారు. ముఖ్యమంత్రి ఆమోదిస్తే రాజీనామా చేసి పోరాడాలనుకున్నారు. ఈ ప్రకటన ధర్మాన చేసిన వెంటనే పలువురు నేతలు.. తాము కూడా రాజీనామాలు చేస్తామని చెప్పారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అయితే తన రాజీనామా లేఖను నాన్ పొలిటికల్ జేఏసీకి ఇచ్చారు.
రాజీనామా ఆలోచన వద్దని చెప్పిన జగన్
అయితే ధర్మాన రాజీనామా ఆలోచనను సీఎం జగన్ ముందుగానే తుంచేశారు. అలా చేస్తే.. ఇతర ప్రాంతాల నేతలపై కూడా ఒత్తిడి పెరుగుతుందని వైఎస్ఆర్‌సీపీ పెద్దలు భావించినట్లుగా తెలుస్తోంది. రాయలసీమ ప్రాంత వాసులు కూడా తమకు న్యాయరాజధాని కాకుండా గతంలో మాదిరిగా అసలైన రాజధానినే కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాజీనామాలు చేస్తే సమస్య మరింత జఠిలం అవుతుంది. రెండు ప్రాంతాల నేతలూ రాజీనామాలు చేస్తే కోస్తా ...నేతలు సైలెంట్‌గా ఉండే అవకాశం ఉండదు. ఓ రకంగా ఇది రాజకీయంగా క్లిష్ట పరిస్థితిని తెచ్చుకోవడమేనని అందుకే ఈ సమస్యను రాజీనామాల వరకూ వెళ్లకుండా చూసుకోవాలని వ్యూహం మార్చినట్లుగా భావిస్తున్నారు.
మూడు రాజధానులు తెరపైకి రావడంతో ప్రాంతీయ ఉద్యమాలు ప్రారంభం
అమరావతి అంశంపై విపక్ష పార్టీలు, ప్రజాసంఘాలన్నీ ఏకతాటిపైకి ఉన్నాయి. ఒక్కఏపీ ప్రభుత్వం, వైఎస్ఆర్‌సీపీ మాత్రమే అమరావతి వద్దని.. మూడు రాజధానులతోనే అభివృద్ధి సాధ్యమని చెబుతోంది. అయితే రాజధాని పేరుతో తమ వద్ద భూములు తీసుకున్నారని వాటిని అభివృద్ధి చేసి..ఒప్పందం ప్రకారం రాజధాని పెట్టాల్సిందేనని రైతులు అంటున్నారు. ప్రభుత్వం తమను మోసం చేస్తోందని..వారు పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల విధానం తేవడంతో మూడు ప్రాంతాల్లోనూ ప్రాంతీయ ఆకాంక్షల మేరకు రాజకీయం ప్రారంభమయింది.
రాజకీయం మార్చేస్తున్న కేసీఆర్ - మాజీలంతా బ్యాక్ టు టీఆర్‌ఎస్! తెర వెనుక ఏం జరుగుతోంది ?