Delhi Election Results: ఢిల్లీలో ఫలించిన చంద్రబాబు మ్యాజిక్ - రేవంత్ రెడ్డికి మరో రాష్ట్రంలో చేదు అనుభవం!
Delhi Election Results 2025 | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున చంద్రబాబు మ్యాజిక్ పనిచేసి 32 ఏళ్లకు బీజేపీ విజయం సాధించగా, సీఎం రేవంత్ రెడ్డికి మరో రాష్ట్రంలో చేదు అనుభవం ఎదురైంది.

Delhi Assembly Election Results | న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎన్నికల ప్రక్రియ ముగిసి, ఫలితాలు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దింపి బీజేపీ అధికారం సొంతం చేసుకుంది. దాదాపు రెండున్నర దశాబ్దాల తరువాత హస్తినలో బీజేపీ అధికారం కైవసం చేసుకుంది. బీజేపీ 48, ఆప్ 22 స్థానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీకి ఏపీ ఫలితాలే రిపీట్ అయ్యాయి. వరుసగా మూడో ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ ప్రజలు ‘సున్నా’లేశారు. అయితే ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ప్రచారం చేసిన చోట ఫలితాలు ఎలా ఉన్నాయని తెలుగు ప్రజలు సెర్చ్ చేస్తున్నారు.
ఢిల్లీలో చంద్రబాబు మ్యాజిక్
ఈనెల 2న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు బీజేపీ తరఫున ప్రచారం చేశారు. ఢిల్లీలోని షహదరా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని, బీజేపీని గెలిపించాలని ఓటర్లను కోరారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ఏరియా కావడంతో చంద్రబాబుతో బీజేపీ అక్కడ ప్రచారం చేపించి ఫలితాన్ని రాబట్టింది. చంద్రబాబు ప్రచారం చేసిన షహదరాలో ఏకంగా 32 ఏళ్ల తర్వాత బీజేపీ గెలుపొందింది.
‘ప్యాలెస్‌లు కట్టుకున్న వాళ్లను కాదు ప్రజల కోసం పనిచేసే వారిని గెలిపించండి. ఆస్తులు కూడబెట్టుకునే వారిని కాదు, ప్రజల మధ్య తిరుగుతూ వారి సమస్యలు తీర్చే వారిని ఎన్నుకోండి. అవినీతికి పెద్దపీట వేసి అభివృద్ధిని పక్కనపెట్టిన వారిని ఇంటికి సాగనంపాలి. ఢిల్లీ డెవలప్ కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని’ షహదరాలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. శనివారం ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రాగా, ఇక్కడ బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయల్ విజయం సాధించారు.
షహదరాలో 1993లో తొలిసారి బీజేపీ నుంచి రామ్‌నివాస్ గోయల్ గెలిచారు. తర్వాత వరుస ఎన్నికల్లో 1998, 2003, 2008 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2013లో శిరోమణి అకాళీదళ్ అభ్యర్థి నెగ్గగా, తరువాత ఆప్ ప్రభంజనంలో బీజేపీ కొట్టుకుపోయింది. 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ నెగ్గింది. తాజా ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలోకి దిగిన సంజయ్ గోయల్ గెలుపొందారు. అంటే చంద్రబాబు ప్రచారం చేసిన చోట ఏకంగా 32 ఏళ్ల తరువాత బీజేపీ అభ్యర్థి విజయం సాధించడంపై ఏపీ కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్చ్ రేవంత్.. ఢిల్లీలోనే అదే సీన్ రిపీట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ రాష్ట్రంలో ప్రచారం చేసినా అక్కడ కాంగ్రెస్ పార్టీకి అంత ప్రయోజనం కలగడం లేదు. మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో రేవంత్ ప్రచారం చేసిన నాందేడ్ నార్త్, షోలాపూర్ సిటీ నార్త్, షోలాపూర్ సౌత్, చంద్రాపూర్, భోకార్, నాయగావ్ లలో ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధించారు. తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. రెండు దఫాలుగా ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా లాభం లేకపోయింది. కాంగ్రెస్ గ్యారెంటీలను సీఎం రేవంత్ రెడ్డి లాంఛ్ చేయడంతో పాటు ఢిల్లీలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ప్రచారం చేసినా ఎక్కడా కాంగ్రెస్ అభ్యర్థి నెగ్గలేదు. ఢిల్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో రేవంత్ పై బీఆర్ఎస్, బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.
Also Read: Delhi Election Result 2025 :ఢిల్లీలో 70 సీట్లలో ఎవరు ఎక్కడ గెలిచారో పూర్తి జాబితా ఇదే






















