Cyclone Jawad: ఏపీ వైపు దూసుకొస్తున్న జవాద్ తుపాను.. ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ.. రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బలగాలు
జవాద్ తుపాను నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఉత్తరాంధ్రకు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. నేడు జవాదు తుపాను ఏర్పడనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంట సగటున 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు, జవాద్ తుపాను నేపథ్యంలో వంద మేర రైలు సర్వీసులు రద్దయ్యాయి. మత్స్యకారులు వేటకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు అతి భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తూర్పుగోదావరిలో తుపాను కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసి అధికారులను అప్రమత్తం చేశారు.
అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారి పశ్చిమ వాయవ్య దిశలో ప్రయాణించి ఆగ్నేయ బంగాళాఖాతం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడి మరో 12 గంటల్లో మరింత బలపడి తుపానుగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబర్ 4వ తేదీలోగా ఉత్తర కోస్తాంధ్ర - దక్షిణ ఒడిశాలో జవాదు తుపాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. వీటి ఫలితంగా ఏపీలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచనను జారీ చేసింది.
విశాఖకు 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడి శుక్రవారం మధ్య బంగాఖాళాతంలో జవాద్ తుపానుగా మారుతుందని అంచనా వేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో తీవ్రంగా కనిపిస్తుంది. ఇప్పటికే సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడటంతో మత్స్యకారులు పడవలు, వలలు రక్షించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా వేటకు వెళ్లడం సాధ్యం కావడం లేదని, తమకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి సహకారం అందించాలని కోరుతున్నారు.
Also Read: Kadapa Floods: ఓవైపు వరదలు, వర్షం.. ప్రాణం లెక్కచేయని వ్యక్తి.. వందల మందిని కాపాడి..
ఏపీ నుంచి వెళ్లే రైళ్లు రద్దు..
జవాద్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో గురువారం, శుక్రవారం, శనివారాల్లో మొత్తం 100 వరకు రైలు సర్వీసులను నిలిపివేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ అధికారులు ప్రకటించారు. రద్దయిన రైళ్లలో విజయవాడ మీదుగా ప్రయాణించే 41 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉండటంతో ఏపీలోని వారికి ప్రయాణానికి కష్టతరం కానుంది. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల కలెక్టర్లు తుపాను నేపథ్యంలో చర్యలు వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
విద్యా సంస్థలు బంద్..
జవాద్ సైక్లోన్ నేపథ్యంలో ఏపీలో పలు జిల్లాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. పర్యాటక ప్రాంతాలను మూసివేయడంతో పాటు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ఇచ్చి ముందస్తు చర్యలు చేపట్టారు. సహాయ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం శ్రీకాకుళం జిల్లాకు హెచ్.అరుణ్‌కుమార్, విజయనగరం జిల్లాకు కాంతిలాల్‌దండే, విశాఖ జిల్లాకు శ్యామలరావును ఏపీ ప్రభుత్వం నియమించింది.
Also Read: Weather Updates: రెయిన్ అలర్ట్.. ఏపీకి మరో తుపాను ముప్పు.. మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు.. పలు రైళ్లు రద్దు