CPI Ramakrishna: వైసీపీ నేతల బ్లాక్ మెయిల్ కు పవన్ కల్యాణ్ భయపడుతున్నారు -సీపీఐ రామకృష్ణ
CPI Ramakrishna: వైసీపీ నేతల బ్లాక్ మెయిల్ కు జనసేనాని పవన్ కల్యాణ్ భయపడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అన్నీ తెలిసే నటిస్తున్నారా అని ప్రశ్నించారు.
CPI Ramakrishna: వైసీపీ మంత్రులకు బ్లాక్ మెయిల్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ భయపడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గురువారం రోజు మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి వైసీపీ పూర్తి స్థాయిలో సహకరిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ బీజేపీని రోడ్ మ్యాప్ అడుగుతున్నారంటే ఆయన గురించి ఏమనుకోవాలని ప్రశ్నించారు. ఆయన అమాయకుడా లేక కావాలనే అలా నటిస్తున్నారా అంటూ వ్యాఖ్యానించారు. అప్పులు చేయడంలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడం సిగ్గుచేటన్నారు. ఏడాదికి రూ.41 వేల కోట్లు అప్పులు తెస్తామని చెబుతూ... ఆరు నెలల్లోనే ప్రభుత్వం 49 వేల కోట్లు అప్పు తెచ్చిందని విమర్శించారు. వైసీపీని ఓడించాలంటే ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాలని చెప్పిన పవన్... నేడు జనసేన సెపరేట్ అని ఎలా అంటున్నారని అడిగారు.
బీజేపీ, వైసీపీ సహజీవనం చేస్తున్నాయి!
బీజేపీ, వైసీపీలు కలిసిపోవడం వల్లే పవన్ కల్యాణ్ ఇలా ప్రవర్తిస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. కేంద్రానికి ప్రతీ విషయంలో వైసీపీ ఎంపీలు సహకరిస్తున్నారని, బీజేపీ, వైసీపీ పెళ్లి చేసుకోలేదు కానీ కలిసి కాపురం చేస్తున్నారన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ ను ఓడించేందుకు ఎవరితోనైనా కలిసి నడుస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీలో పోలీస్ రాజ్యం నడుస్తోందని చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు పోరాటానికి కలిసి రావాలని పవన్, చంద్రబాబు పిలుపు నిచ్చారని, అయితే జగన్‌కు ప్రజాస్వామ్యం పట్టదని.. రాజ్యాంగం పై అవగాహన లేదని రామకృష్ణ కామెంట్ చేశారు. నాకు అధికారం ఉంది..నా ఇష్టం వచ్చిన విధంగా అన్నీ జరగాలని భావిస్తున్నారని, దేశంలో అపరిపక్వత ఉన్న ఏకైక సిఎం జగన్ అని మండిపడ్డారు. ప్రతిపక్షాల నుంచి అర్జీలు తీసుకోకుండా, కనీసం ప్రజాసమస్యలు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఇంత మూర్ఖత్వంతో పాలన చేయడానికి వంద శాతం బీజేపీ సహకారం ఉందని ఆరోపించారు. మోడీ, షా సపోర్ట్ లేకపోతే జగన్ నెల రోజులు కూడా ఆ కుర్చీలో ఉండలేరని, అన్ని కేసులు ఉన్నా...అవినీతి రుజువైనా జగన్ మీద చర్యలు ఉండవని పేర్కొన్నారు.
వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో సిబిఐ విచారణను జగన్ అడ్డుకున్నారని, కోర్టులో పక్క రాష్ట్రానికి బదిలీ చేయడం అంటే జగన్ చేతకాని తనం వల్లే కదా అని ప్రశ్నించారు రామకృష్ణ. విజయసాయి రెడ్డి విశాఖను దోచుకుంటున్నారని, ఢిల్లీలో విసా రెడ్డికి ఉన్న పవర్ ఎవరికి లేదని తెలిపారు. ఆయనకు ఇచ్చిన పదవులు కూడా ఎవరికీ ఇవ్వలేదని, ఇవన్నీ బీజేపీ సహకారం లేకుండా ఎవరిస్తారని ప్రశ్నించారు. స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా విజయసాయి రెడ్డిని చేసింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు రామకృష్ణ. వైసీపీ, బీజేపీ పెళ్లి చేసుకోలేదు కానీ, కలిసి కాపురం చేస్తున్నారని, వారి సహకారంతోనే జగన్, విజయసాయి రెడ్డి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని అన్నారు. ఇవన్నీ చంద్రబాబుకు తెలియవా... ఏ2కు సపోర్ట్ ఉన్న బిజెపికి దూరంగా ఉండలేరా అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌కు బీజేపీ కుట్రలు అర్ధం అయ్యాయని, రూట్ మ్యాప్ విషయంలో వాళ్లు మోసం చేసినట్లు తెలుసుకున్నారని అన్నారు. ఇప్పుడు అయినా పవన్ కల్యాణ్ బీజేపీతో తెగ తెంపులు చేసుకోవాలని, సీనియర్ అయిన చంద్రబాబుకు అన్నీ తెలుసని వ్యాఖ్యానించారు.