Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే - సీపీఐ జాతీయ మహాసభల్లో తీర్మానం
Andhra Pradesh: ఏపీకి ఏకైక రాజధాని అమరావతి ఒక్కటే అని సీపీఐ జాతీయ మహాసభల్లో తీర్మానం చేశారు. అమరావతిపై సీఎం జగన్ మాట మార్చారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
![Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే - సీపీఐ జాతీయ మహాసభల్లో తీర్మానం CPI National Congress Decided to Amaravati The Only Capital of Andhra Pradesh Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే - సీపీఐ జాతీయ మహాసభల్లో తీర్మానం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/16/2d4a4f0e5adce54818a94962190f4c331665930329524519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Andhra Pradesh: ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి ఒక్కటే రాజధాని అని సీపీఐ 24వ జాతీయ మహా సభల్లో తీర్మానం చేసింది. ఈ విషయాన్ని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. విజయవాడ రాజధానిగా ఉండాలని సీపీఐ ముందే కోరిందని స్పష్టం చేశారు. చంద్రబాబు 2014లో అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే, సీఎం జగన్ కూడా ఆమోదం తెలిపారన్నారు. అమరావతి నేడు మాట మార్చిన జగన్ మూడు రాజధానులను చేస్తామని విమర్శించారు. మూడేళ్ల బిడ్డ అమరావతి త తల్లి, ఎవరో చెప్పలేని పరిస్థితిలో ఉందని అన్నారు. తెలుగు ప్రజలు ఎక్కడికి వెళ్లినా మీ రాజధాని ఏది అంటే చెప్పలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు రాజధానుల ఉద్యమం ప్రభుత్వం కృత్రిమ ఉద్యమం అని నారాయణ విమర్శించారు. విశాఖలో అనవసరంగా ఉద్రిక్తత పరిస్థితి తీసుకొస్తున్నారని తెలిపారు. విశాఖలో భూ కుంభకోణంపై సీబీఐతో విచారణ చేయించాలన్నారు. అమరావతికి జాతీయ సీపీఐ అండగా ఉంటుందని అన్నారు. మోదీ ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామని నారాయణ వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ప్రశాంతంగా ఉన్న విశాఖలో ఉద్రిక్తత పరిస్థితులు తీసుకు వచ్చారని వైకాపాపై మండి పడ్డారు. పవన్ కల్యాణ్ పర్యటనను అడ్డుకోవడం సరికాదన్నారు.
జనసేన నాయకులపై 307 సెక్షన్ కింద కేసులు పెట్టడం అన్యాయం అని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలను చూస్తే జగన్ కు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. విశాఖ గర్జన పూర్తిగా విఫలం అయిందని.. అందుకే పిచ్చి పట్టిన వారిలా వైకాపా నాయకులు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు, మంత్రులు తప్ప ఆ గర్జనలో ఎవరూ లేరన్నారు. రాష్ట్రంలో ఒక్క పార్టీ అయినా మూడు రాజధానులకు మద్దతుగా వచ్చారా అని ప్రశ్నించారు. అమరావతి రాజధానిగా వద్దని ప్రకటించిన రోజే ఎందుకు చెప్పలేదన్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అమరావతి రాజధాని అంశాన్ని దేశ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తామని రామకృష్ణ అన్నారు.
ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు..
విభజన హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాల్సింది పోయి.. వారితో లాలూచీ పడి ప్రత్యేక హోదా హామీలను తుంగలో తొక్కారని రామకృష్ణ ధ్వజమెత్తారు. 3 రాజధానుల పేరుతో ప్రాంతీయ వాదాన్ని సీఎం జగన్ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఒక్క రాజధానిని అభివృద్ధి చేయలేనివారు.. ఇంకా 3 రాజధానులు ఏం కడతారని ఎద్దేవా చేశారు. అమరావతి పరిరక్షణ కోసం రైతులు చేస్తున్న యాత్రకు సీపీఐ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీని వైయస్సార్ వర్సిటీగా పేరు మార్చడం తగదన్నారు. రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టారా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో మెజార్టీ ఉంది కదా అని ఎలా పడితే అలా పాలన చేస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
Also Read : Visakha Tension : విశాఖ నోవాటెల్ వద్ద టెన్షన్ టెన్షన్, రాత్రికి నగరంలోనే పవన్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)