CPI Narayana: ఈ బుక్ నాలుక గీసుకోడానిక్కూడా పనికిరాదు, చంద్రబాబుకు థ్యాంక్స్ - నారాయణ
Narayana Comments: ఓ పొలంలో జగనన్న భూరక్ష పథకం అని వేసిన ఓ సరిహద్దు రాయి దగ్గర కూర్చొని ఓ వీడియోను విడుదల చేశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ జగన్ ప్రభుత్వం కూలిపోయేలా చేసిందని అన్నారు.
K Narayana on AP Land Titling Act 2023: జగనన్న భూరక్షణ పథకానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాతరేశారని, ఈ పని చేసినందుకు ఆయనకు అభినందనలు అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఆయన ఓ పొలంలో జగనన్న భూరక్ష పథకం అని వేసిన ఓ సరిహద్దు రాయి దగ్గర కూర్చొని ఓ వీడియోను విడుదల చేశారు. రూ.వందల కోట్లతో తీసుకొచ్చిన భూచట్టం ఎందుకు పనికి రానిదని విమర్శలు చేశారు.
‘‘నా భూమిపై నీఫొటో ఏంటని రాష్ట్ర రైతులంతా నిరసన చేసినా జగన్ ఖాతరు చేయలేదు. చివరికి నారావారి చేతులతోనే జగన్ జీవో నరకబడింది. తెలంగాణలో ధరణి భూపథకంతో కేసీఆర్ పతనం లాగానే జగన్ భూరక్షణ పథకం వల్ల జగన్ ప్రభుత్వం కూలిపోతుందని గత సంవత్సరం డిసెంబరులోనే ఓ వీడియోలో చెప్పా.
ఈ భూరక్షణ చట్టం కింద ఇచ్చిన కొత్త పుస్తకాలు నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావు. రూ.వందల కోట్లతో ముద్ర వేయించిన ఈ పుస్తకాలు ఎందుకు పనికి రావు. బ్యాంకులోన్ తీసుకునే సమయంలో, భూమి రిజిస్ట్రేషన్ చేయించుకునే సమయంలో గానీ, భూమి హక్కు పత్రం, పట్టాదారు పాసు పుస్తకం అధికారికి చూపించనవసరం లేదు. అంటే ఇది బోగస్ పత్రం’’ అని అన్నారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వ హాయాంలో ఇచ్చిన పట్టాదారు పుస్తకాలతో అన్ని హక్కులు భూ యజమానులకు కల్పించబడ్డాయని గుర్తు చేశారు.
రెండో సంతకంతోనే భూయాజమాన్య హక్కు చట్టం రద్దు
ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్) రద్దు కోసం చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే రెండో సంతకం చేసిన సంగతి తెలిసిందే. తొలి సంతకం మెగా డీఎస్సీ నిర్వహణ ఫైలుపై చేశారు. ప్రజల్ని అత్యంత భయకంపితుల్ని చేసిన భూ యాజమాన్య హక్కు చట్టాన్ని తన రెండో సంతకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తుదముట్టించారు. ప్రజలకు తమ సొంత స్థిరాస్తులపై హక్కు లేదన్నట్లుగా ఈ చట్టాన్ని 2023 అక్టోబర్ 31న వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది.
ఈ చట్టం ముసుగులో ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల భూ భక్షణకు ఆస్కారం ఇచ్చేలా వివిధ సెక్షన్లను వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం పొందుపరిచిందని టీడీపీ నేతలు ఆరోపించారు. కబ్జా చేసిన ఆస్తులను చట్టబద్ధత తెచ్చుకునేందుకు వైసీపీ పెద్దలు పావులు కదిపారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేసి ప్రజా ఆస్తులకు రక్షణగా ఉంటామని ప్రతిపక్షనేతగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అన్నమాట ప్రకారం.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడానికి వీలుకల్పించే ఫైలుపై సంతకం చేశారు.