Wedding at the police station: పారిపోతూ పోలీసులకు దొరికారు- అంతే పెళ్లి చేసేశారు - అలాంటి పెళ్లి కాదు..నిజమైన పెళ్లే !
Annamayya district : అన్నమయ్య జిల్లాలో ఓ ప్రేమజంటకు పోలీస్ స్టేషన్‌లోనే పోలీసులు పెళ్లి చేశారు. ఇంటి నుంచి పారిపోతున్న వాళ్లను గుర్తించి సమస్య కనుక్కుని పెళ్లి చేశారు.

Couple gets married at police station: మన ప్రేమ నిజమైతే విధే మన పెళ్లి జరిపిస్తుంది ప్రియా అనే గాఢమైన డైలాగులు ఆ ఇద్దరు చెప్పుకున్నారో లేదో కానీ నిజంగానే వారి పెళ్లిని విధి చేయించేసింది. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోవడం లేదని ఇక ఎవరి కోసం ఎదురు చూడాల్సిన పని లేదని.. మన జీవితం మనం బతుకుదామని డిసైడైపోయి.. వారిద్దరూ పారిపోవాలని నిర్ణయించుకున్నారు. అన్నట్లుగానే వారు బైక్ మీద ఎక్కడికో గమ్యం తెలియని ప్రాంతానికి బయలుదేరారు. కానీ మధ్యలో పోలీసులు వారిని ఆపారు. లైసెన్స్ చూపించమని అడిగితే.. ఇంకేదో అనుకుని వారిద్దరూ కంగారుపడిపోయారు. దాంతో పోలీసులు అసలు విషయం తెలుసుకున్నారు.
బైక్ పై పారిపోయేందుకు ప్రయత్నించిన ఆ జంట అన్నమయ్య జిల్లా కె.వి పల్లి మండలం మహాల్ రాజు పల్లి కు చెందిన వంశీ , స్వాతి, వంశీకి 24 ఏళ్లు, నందినికి 19 ఏళ్లు ఉంటాయి. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదుద. అందుకే వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. బైక్ పై వెళ్తున్న సమయంలో రొంపిచర్ల దగ్గర పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా వీరిద్దరూ కంగారు పడిపోయారు. దాంతో పోలీసులు పూర్తి వివరాలు తీసుకున్నారు. పారిపోతున్నట్లుగా గుర్తించారు. అంతే వారు.. వారిద్దరికి భయం లేకుండా చేయాలనుకున్నారు.
నేరుగా వారిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. దండలు కూడా తెప్పించారు. అయితే తల్లిదండ్రులు లేకుండా పెళ్లి చేయడం భావ్యం కాదని. అటు అమ్మాయి.. ఇటు అబ్బాయి తల్లిదండ్రులను కూడా పిలిపించారు. ముందుగానే వారికి అసలు విషయం చెప్పారు. మీరు పంతం పట్టుకుని పెళ్లి చేయమని భీష్మించుకుని కూర్చుకుంటే వాళ్ల దారి వాళ్లు చూసుకోబోయారని.. పరువు పోతుందని చెప్పారు. అందుకే ఇద్దరూ మేజర్లే కాబట్టి .. వారిద్దరూ తమకు రక్షణ కావాలని అడుగుతున్నారు కాబట్టి.. పోలీస్ స్టేషన్ లోనే వారికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. పోలీసులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. తాము వేరేగా పెళ్లి చేస్తామని వారు పోలీసులకు చెప్పారు.
అయితే పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్లి అసలు పెళ్లి కాకుండా.. తన్నడం లాంటి పెళ్లిళ్లు చేస్తారన్న ఉద్దేశంతో పోలీసులు పోలీస్ స్టేషన్ లోనే లాంచనగా దండలు మార్పించారు. వారికి అధికారికంగా పెళ్లి అయిందనిపించారు. వారికి రక్షణగా పోలీసులు ఉంటారని.. ఎలాంటి సమస్య వచ్చినా ఫోన్ చేయాలని సూచించారు. తల్లిదండ్రులకు కూడా వారికి ఎలాంటి హాని కల్పించవద్దని హెచ్చరించారు.
వారిద్దరూ పారిపోయే ఎక్కడో ఉండి.. పెళ్లి చేసుకోవడానికి కూడా తంటాలు పడాల్సి వచ్చేది. కానీ వారి ప్రేమ విషయం పోలీసులకు తెలియడంతో పెళ్లి అయిపోయింది. దాంతో వారు కూడా హ్యాపీగా ఇళ్లకు వెళ్లారు.





















