Competitive Exams Training: మూడో తరగతి నుంచే పోటీ పరీక్షల శిక్షణ- అధికారులకు సీఎం సూచన
Competitive Exams Training: ఏపీ ప్రభుత్వ బడుల్లో మూడో తరగతి నుంచే పోటీ పరీక్షల కోసం శిక్షణ ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది.
Competitive Exams Training: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు పాఠశాల విద్యలో అనేక సంస్కరణలు చేపడుతోంది. అందులో భాగంగా.. ప్రభుత్వ పాఠశాలల్లో 3వ తరగతి నుంచే విద్యార్థులకు పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయాలని నిర్ణయించింది. టోఫెల్ సహా ఇతర పోటీ పరీక్షలకు ప్రాథమిక శిక్షణ అందించడం మొదలు పెట్టింది. విద్యాశాఖ అధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంపై మాట్లాడారు. 3వ తరగతి పిల్లలకు టోఫెల్ పై శిక్షణ ఇస్తున్నందున, ఇకపై 2వ తరగతి విద్యార్థుల భాషా నైపుణ్యాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచనలిచ్చారు.
ప్రాథమిక పాఠశాలల్లోని PP 1, PP 2 పిల్లలకు ఆంగ్ల ఉచ్చారణ, ఫొనెటిక్స్ ను మెరుగుపరచడానికి ప్రత్యామ్నాయ బోధనా పద్ధతులను పాటించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మాంటిస్సోరి పాఠశాలల్లో అవలంభిస్తున్న టీచింగ్ పద్ధతులపై ఆ పాఠశాలల ప్రతినిధులు ముఖ్యమంత్రి సమక్షంలో వివరించారు. ఆయా బడుల్లో అవలంభిస్తున్న పద్ధతులను రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయవచ్చో లేదో తెలుసుకోవడానికి మాంటిస్సోరి లాంటి పాఠశాలలను సందర్శించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఉన్నత విద్యను బలోపేతం చేయడానికి, విశ్వవిద్యాలయాలు, ట్రిపుల్ ఐటీల్లోని అన్ని ఖాళీలను రెగ్యులర్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేయడాన్ని సీఎం జగన్ ఆమోదించారు.
ట్రిపుల్ ఐటీలలో 660 ఖాళీలతో పాటు విశ్వవిద్యాలయాల్లోని 2,635 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులను విద్యా శాఖ భర్తీ చేయనుంది. వైద్య, ఆరోగ్య శాఖలో ఇప్పటికే 51 వేల పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నవంబర్ 15 నాటికి ఆన్ లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూలతో సహా నియామక ప్రక్రియను నిర్వహిస్తుంది. వైద్య, ఆరోగ్య శాఖలో 51 వేల పోస్టులను భర్తీ చేశామని, అలాగే వర్సిటీల్లో ఉన్న ఖాళీలను కూడా రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలిచ్చారు. పూర్తి స్థాయి ఫ్యాకల్టీతో విశ్వవిద్యాలయాలు అత్యుత్తమ పనితీరు కనబరుస్తాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యను అందించడం కోసం ఫ్యాకల్టీ ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారితంగా ఉండాలన్నారు.
Also Read: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నేటి నుంచి ట్యాబ్‌ల పంపిణీ
ఆగస్టు 23న నోటిఫికేషన్ విడుదల
విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీకి ఆగష్టు 23 న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఒకేసారి 3295 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. సెప్టెంబరు 3, 4 వారాల్లో ఏపీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌లో పరీక్షలు జరగనున్నాయి. అక్టోబరు 10 వ తేదీకల్లా పరీక్షా ఫలితాలు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆన్ లైన్‌లో పరీక్షల ఫలితాలు విడుదల తర్వాత నెల రోజుల్లో ఇంటర్వ్యూలు జరుపనున్నారు. మొత్తం ప్రక్రియను నవంబరు 15 నాటికి పూర్తి చేసి అదే రోజు ఎంపికైన అభ్యర్ధుల జాబితాను యూనివర్సిటీల వారీగా ప్రకటించనున్నారు. విశ్వ విద్యాలయాల్లో చాలా కాలంగా పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. ఈ ప్రభావం యూనివర్శిటీలపై పడుతోంది. సరైన విద్యాబోధన జరగక ప్రమాణాలు పడిపోతున్నాయి. ఇటీవల వీసీలతో సమావేశం అయినప్పుడు.. ఎక్కువ మంది పోస్టుల భర్తీ గురించి విజ్ఞప్తి చేయడంతో సీఎం జగన్ వెంటనే.. వాటిని భర్త చేయాలని ఆదేశించారు. వాటి ప్రక్రియ ఇప్పుడు ప్రారంభం కానుంది.