CM Jagan Review On Income : ఏపీ వాణిజ్య పన్నుల శాఖలోనూ ఓటీఎస్ స్కీమ్ - అధికారులకు సీఎం జగన్ ఆదేశం
ఏపీలో వాణిజ్య పన్నులు బకాయిలు ఉన్న వారి కోసం వన్ టైం సెటిల్‌మెంట్ స్కీం పెట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఆదాయార్జన శాఖలపై జగన్ రివ్యూ చేశారు.
CM Jagan Review On Income : ఆదాయార్జన శాఖల్లో మరింత ప్రొఫెషనలిజం పెరగాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ సూచించారు. ప్రభుత్వానికి రెవెన్యూ అందించే శాఖలపై వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఓటీఎస్ పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తిచేయాలని ..అలాగే టిడ్కోకు సంబంధించి కూడా రిజిస్ట్రేషన్లను పూర్తిచేయాలని అధికారులనుజగన్ ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోకి రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చాక సిబ్బందికి, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కేవలం ఆస్తుల రిజిస్ట్రేషనే కాకుండా.. రిజిస్ట్రేషన్ పరంగా అందించే ఇతర సేవలపైన కూడా పూర్తిస్థాయి సమాచారం, అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ స్పష్టం చేశారు.
అక్టోబర్ 2 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు
అక్టోబరు 2న తొలివిడతగా గ్రామాల్లో శాశ్వత భూ హక్కు, భూ రక్ష పత్రాలతో పాటు సంబంధిత సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే 650 గ్రామాల్లో జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పత్రాలతో పాటు రిజిస్ట్రేషన్ సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఈ గ్రామాల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. 14వేలమంది గ్రామ, వార్డు సెక్రటరీలకు రిజిస్ట్రేషన్‌పై శిక్షణ కూడా అందిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. అక్టోబరు 2న తొలివిడత కింద రిజిస్ట్రేషన్ సేవలు, భూ హక్కు–భూ రక్ష కింద పత్రాలు అందించే గ్రామాల సంఖ్యను పెంచడానికి ప్రయత్నించాలని సీఎం సూచించారు.
మైనింగ్ జరగని క్వారీల్లో మళ్లీ కార్యకలాపాలు
మైనర్ మినరల్‌కు సంబంధించి కార్యకలాపాలు నిర్వహించని క్వారీలు 2,700కుపైగా ఉన్నాయని తె వీటిలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వీటిలో కార్యకలాపాలు ప్రారంభం కావడంపై దృష్టిపెట్టాలని .. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయాలు పెరుగుతాయన్నారు. ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి ప్రారంభమైందని.. జెన్‌కో సహా.. రాష్ట్రంలోని పలు పరిశ్రమలకు దీని నుంచి బొగ్గు సరఫరా అయ్యేలా చూసుకోవాలని సీఎం జగన్ సూచించారు. దీనివల్ల జెన్‌కో ఆధ్వర్యంలోని విద్యుత్ ప్రాజెక్టులకు మేలు జరుగుతుందన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా ఈబొగ్గును మన అవసరాలకు వినియోగించుకునేలా చూడాలన్నారు. తదుపరి కూడా బొగ్గుగనుల వేలం ప్రక్రియలో పాల్గొనడంపై దృష్టిపెట్టాలని ఆదేశించారు.
వాణిజ్య పన్నుల శాఖలో ఓటీఎస్ స్కీమ్
వాణిజ్య పన్నుల శాఖ పునర్‌నిర్మాణం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. శాఖలో ప్రతి ఒక్కరి పాత్ర, బాధ్యతలపై స్పష్టత ఇవ్వనున్నారు. అలాగే డాటా అనలిటిక్స్ విభాగం ఏర్పాటుర చేస్తారు. లీగల్‌సెల్‌కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాణిజ్య పన్నుల శాఖలోనూ బకాయిల వసూలుకు ఓటీఎస్ సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. జూన్‌కల్లా వాణిజ్య పన్నుల శాఖలో ఈ విభాగాల ఏర్పాటు పూర్తవుతుందని అధికారులు తెలిపారు.