Andhra Transfers: అధికార యంత్రాంగం మొత్తాన్ని ప్రక్షాళన చేస్తున్న చంద్రబాబు - ఏ క్షణమైనా ఆలిండియా సర్వీసెస్ అధికారుల సమగ్ర బదిలీలు
AP Bureaucracy: ఏపీలో అధికార యంత్రాంగం మొత్తాన్ని సమగ్ర ప్రక్షాళన చేసేందుకు సీఎం చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారు. ఏ క్షణమైనా బదిలీల ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఆలిండియా సర్వీసెస్ అధికారుల బదిలీలపై కసరత్తు చివరి దశకు చేరింది. సిఎస్, డీజీపీ, సీఎంవో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం సుదీర్ఘ కసరత్తు జరిపారు. సిఎం క్యాంప్ కార్యాలయంలో నేడు కూడా బదిలీలపై చర్చించనున్నారు. జెసిల నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీల వరకు మార్పులు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఎస్పీల నుంచి DIG, IG వరకు కీలక పోస్టుల్లో కొత్త అధికారులు రానున్నారు. ముందుగా పలువురు ముఖ్య కార్యదర్శుల బదిలీలపై ఎప్పుడైనా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. సమూల మార్పులు ద్వారా పాలనలో వేగాన్ని పెంచాలనే ఆలోచనలో సిఎం ఉన్నారు. 15 నెలల కాలంలో అధికారుల పనితీరుపై స్పష్టమైన సమాచారం, అవగాహనతో ఉన్న ప్రభుత్వం .. బాగా పనిచేసిన వారిని ప్రోత్సహించేలా....ఆశించిన స్థాయిలో పనితీరు కనబర్చని వారిని మార్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తన ఆలోచనలను, వేగాన్ని అందుకునేలా అధికారుల, శాఖాధిపతుల పనితీరు ఉండాలని సీఎం కోరుకుంటున్నారు. సరైన స్థానంలో సరైన అధికారి అనే కాన్సెప్ట్ కోసం సుదీర్ఘ కసరత్తు చేస్తున్న సిఎం.. క్షేత్ర స్థాయి నుంచి పాలనలో వేగాన్ని పెంచేలా....ప్రభుత్వ ప్రాధామ్యాలను గుర్తించి పని చేసేలా నియామకాలు ఉండనున్నాయి. ఆయా అధికారుల గత రికార్డు మాత్రమే ప్రాతిపదికగా పోస్టింగులు ఉంటాయంటున్న ప్రభుత్వ వర్గాలు.. వైసీపీ హయాంలో కీలకంగా పని చేసి.. ఇప్పటికీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని దూరం పెట్టే అవకాశం ఉంది.
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని బదిలీలు చేపట్టారు. వైసీపీ హయాంలో ఆరోపణలు ఎదుర్కొని.. వైసీపీ పెద్దలతో అంట కాగిన అధికారులందర్నీ అప్రాధాన్య పోస్టులకు పంపించారు. కొంత మందికి పోస్టింగులు ఇవ్వలేదు. ఇలాంటి వారిలో చాలా మందిపై విచారణలు జరుగుతున్నాయి. వైసీపీ హయాంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో దుర్వినియోగం అయిందని చట్ట విరుద్ధంగా.. రాజ్యాంగ విరుద్ధమైన పనులు చేయించడానికి పలువురికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు .. పలువురిపై విచారణల పేరుతో బెదిరించి తమ పనులు చేయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో పనితీరు ఆధారంగానే అధికారుల్ని బదిలీ చేయాలని అనుకుంటున్నారు. అవకాశాలు కల్పించినప్పటికీ.. సమర్థత చూపించని వారిని నిస్సంకోచంగా దూరం పెట్టాలని చంద్రబాబు అనుకుంటున్నారు.
మంచి పోస్టింగుల కోసం పలువురు తమదైన ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సెక్రటేరియట్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కీలకమైన అధికారుల బదిలీల గురించి సెక్రటేరియట్ లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. దాదాపుగా ప్రతి శాఖ ఉన్నతాధికారిని బదిలీ చేస్తారన్న అభిప్రాయం వినిపిస్తూండటంతో.. తమ డిపార్టుమెంట్ కు ఎవర్ని నియమిస్తారోనని.. అ శాఖల్లోనూ చర్చ ప్రారంభమయింది.





















