Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - కేంద్ర మంత్రులు ఏమన్నారంటే?
Andhra News: వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న వివాదంపై కేంద్ర మంత్రులు స్పందించారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి ఆరా తీశారు.
Central Minister Comments On Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనే అంశం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ అంశంపై కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, ప్రహ్లాద్ జోషి, శోభాకరంద్లాజే స్పందించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా (JP Nadda) సీఎం చంద్రబాబును (CM Chandrababu) అడిగి వివరాలు తెలుసుకున్నారు. దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలని కోరారు. మరోవైపు, కల్తీ నెయ్యి అంశంపై కార్మిక శాఖ సహాయ మంత్రి శోభాకరంద్లాజే తీవ్రంగా స్పందించారు. తిరుమలకు చెందిన కళాశాలల్లో పద్మావతీ శ్రీనివాసుల ఫోటోలను తొలగించాలని.. హిందూయేతర గుర్తులను సప్తగిరులపై ఏర్పాటు చేయాలని జగన్ అండ్ కో చూసిందని మండిపడ్డారు. 'హిందువులు కాని వారిని బోర్డు ఛైర్మన్‌గా నియమించింది. పవిత్ర ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపింది. మా చుట్టూ జరుగుతున్న ఈ హిందూ వ్యతిరేక రాజకీయాలకు మమ్మల్ని క్షమించు స్వామీ' అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారన్న ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తు అవసరమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఈ అంశం చాలా తీవ్రమైందని.. దోషులుగా తేలిన వారిని శిక్షించాలని ఓ ఇంగ్లీష్ మీడియా సంస్థ వద్ద పేర్కొన్నారు.
Jagan & Co tried to remove Lord Srinivasa and Padmavati's photos from Tirumala colleges, tried placing non-Hindu symbols in the hills, appointed a non-Hindu as board chair, and added animal fat to the holy prasadam. Sorry, Lord Venkateswara-for this anti Hindu politics around us! pic.twitter.com/4aFpQ4qUgM
— Shobha Karandlaje (@ShobhaBJP) September 20, 2024
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
అటు, ఈ అంశంపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వ సమయంలో లడ్డూ తయారీలో నాణ్యత లోపాలు, అపవిత్ర పదార్థాల వాడకంపై సీఎం చంద్రబాబు శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు ఆనం, నిమ్మల రామనాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథితో సమీక్ష చేశారు. గతంలో లడ్డూ తయారీలో జరిగిన తప్పిదాలపై శుక్రవారం సాయంత్రంలోగా పూర్తి నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను సీఎం ఆదేశించారు. తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్‌లతో చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆలయ సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాలు కాపాడతామని అన్నారు.
స్పందించిన ఈవో
ఈ అంశంపై టీటీడీ ఈవో శ్యామలరావు తాజాగా స్పందించారు. శ్రీవారి లడ్డూ నాణ్యతపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. నెయ్యి నాసిరకంగా ఉందని గుత్తేదారుకు చెప్పామని.. నెయ్యిలో నాణ్యతా లోపాన్ని తాను కూడా గమనించినట్లు చెప్పారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ కోసం సొంతంగా ప్రయోగశాల లేదని.. బయట ల్యాబ్స్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నారు. నెయ్యి నాణ్యతపై గతంలో అధికారులు పరీక్షలు చేయలేదని వెల్లడించారు. రూ.411కే కిలో నెయ్యి సరఫరా చేశారని.. నాణ్యమైన నెయ్యిని అంత తక్కువ ధరకు సరఫరా చేయరని తెలిపారు. తాము హెచ్చరించిన అనంతరం గుత్తేదారులు నాణ్యత పెంచారని వివరించారు.
Also Read: Tirupati Laddu: బూందీగా ప్రారంభమైన తిరుపతి లడ్డూ చరిత్ర తెలుసా? మొదట్లో 8 నాణేలకే అమ్మకం!