(Source: ECI/ABP News/ABP Majha)
MP Mithun Reddy On Lokesh : చిత్తూరు జిల్లా బిడ్డవైతే నాతో పోటీకి దిగు, లోకేశ్ కు ఎంపీ మిథున్ రెడ్డి సవాల్
MP Mithun Reddy On Lokesh : నారా లోకేశ్ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లా బిడ్డవైతే నాతో పోటీకి దిగుతావా అంటూ సవాల్ చేశారు.
MP Mithun Reddy On Lokesh : టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చిత్తూరు బిడ్డవైతే తనతో పోటీ చేయాలని సవాల్ చేశారు. ఈ నెల 12వ తేదీన తంబళ్లపల్లెలో చిత్తూరు జిల్లా అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్నారు. లోకేశ్ చర్చకు వస్తే, పోటీకి సైతం సిద్ధ పడినట్లు లెక్కలోకి తీసుకుంటామన్నారు. చర్చకు రాకపోతే నారా లోకేశ్ భయపడినట్లు అనుకుంటామన్నారు.
చర్చకు వస్తావా?
చిత్తూరు జిల్లా బిడ్డవైతే నాతో పోటీకి దిగుతావా అంటూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు సవాల్ విసిరారు. శుక్రవారం సాయంత్రం తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసంలో ఏర్పాటు మీడియా సమావేశంలో మిథున్ రెడ్డి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా సమాధానం ఇస్తూ సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లా అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ లోకేశ్ కు సవాల్ విసిరారు. పాపాల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పాపాల మిథున్ రెడ్డి అంటూ సంబోధించడం నారా లోకేశ్ కు సరికాదన్నారు. ఇన్నాళ్లు హద్దు మీరకుండా మాట్లాడానని, లోకేశ్ వ్యాఖ్యలు చూసి ఆయన స్టైల్ లోనే సవాల్ విసురుతున్నట్లు మిధున్ రెడ్డి చెప్పారు. వెన్నుపోటు చంద్రబాబు నాయుడు కుమారుడు పప్పుకు నేను ప్రతి సవాల్ చేస్తున్నా, ఈ నెల 12వ తేదీ తంబళ్లపల్లెలో లోకేశ్ తో బహిరంగ చర్చకు నేను సిద్ధం ఉన్నానని, చిత్తూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో అయినా నీతో పోటీకి సిద్ధంగా ఉన్నట్లు సవాల్ చేశారు. నువ్వు చిత్తూరు జిల్లా బిడ్డవైతే నాతో పోటీకి దిగుతావా, చర్చకు వస్తావా అంటూ ప్రశ్నించారు. చర్చకు వస్తే పోటీకి సైతం సిద్ధం అయ్యి లోకేశ్ రావాలని, ఒకవేళ చర్చకు రాకుంటే, రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్తున్నాడని అనుకుంటామన్నారు. భయ పడ్డాడని అనుకోని వదిలేస్తామన్నారు. ఏకవచనంతో సంబోధించడం నారా లోకేశ్ కి సరికాదన్నారు.
లోకేశ్ పై మోపిదేవి ఫైర్
తిరుమల శ్రీవారిని వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఎంపీ మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో సంక్షేమ రథసారధిగా సీఎం జగన్ గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. ప్రతి పౌరుడు సుఖసంతోషాలతో ఉండాలని సీఎం కోరుకుంటున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు ఉనికిని కాపాడుకోడానికి పాకులాడుతున్నాయన్నారు. ఉనికిని చాటుకునేందుకే చంద్రబాబు తనయుడు లోకేశ్ పాదయాత్ర చేపట్టారని అన్నారు. లోకేశ్ ది పాదయాత్ర కాదు విహార యాత్ర అంటూ ఎద్దేవా చేశారు. సిద్ధాంతపరమైన యాత్ర లోకేశ్ చేయడం లేదన్నారు. గతంలో చంద్రబాబు పాదయాత్ర చేసినా ఏ ఒక్క సమస్య పరిస్కారం చేయలేకపోయాడని ఆరోపించారు.
మళ్లీ వైసీపీదే అధికారం
పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు సీఎం జగన్ అమలు చేశారని ఎంపీ మోపిదేవి వెంకట రమణ స్పష్టం చేశారు. లక్షలాది మంది ప్రజలకు ఉద్యోగ అవకాశాలు సీఎం జగన్ కల్పించామన్నారు. హామీలు తుంగలో తొక్కిన ఘనత టీడీపీదని విమర్శించారు. టీడీపీ ఎన్ని పొర్లు దండాలు పెట్టినా, ఏం చేసిన 2024లో అధికారం చేపట్టబోయేది వైసీపీనే అని మోపిదేవి ధీమా వ్యక్తం చేశారు.