Officers Dayout : ఈ సారి మహిళా డిప్యూటీ కలెక్టర్..! మారు వేషంలో వార్డు సచివాలయం తనిఖీ..!
చిత్తూరులోని 36వ వార్డు సచివాలయాన్ని డిప్యూటీ కలెక్టర్ పల్లవి ఆకస్మిక తనిఖీ చేశారు. నిరుపేదలా వెళ్లి ఇంటిస్థలం కావాలని వాకబు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశాలు పెట్టిన ప్రతీ సారి చెబుతూ ఉంటారు. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాయాలను తనిఖీలు చేయాలని.. అక్కడ అందుతున్న సేవలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని కోరుతూ ఉంటారు. అయితే ఎక్కడా పెద్దగా తనిఖీలు చేసినట్లుగా లేదు. అందుకే ఇటీవల తనిఖీలు చేయని అధికారులకు నోటీసులు ఇవ్వాలని ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ ఎఫెక్టో.. లేక నిజంగానే అధికారులు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుతున్న సేవల గురించి పరిశీలించాలనుకున్నారో కానీ.. తనిఖీలు ప్రారంభించారు.
నేరుగా ఉన్నతాధికారుల హోదాలో వెళ్తే అక్కడ సేవలు అద్భుతంగా అందుతున్నాయన్నట్లుగా సీన్ క్రియేట్ చేసి పెడతారు. ఎవరికీ తెలియకుండా వెళ్తేనే అసలు సీన్ అర్థమవుతుంది. అందుకే.. చిత్తూరు జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న పల్లవి .. సామాన్యురాలిగా చిత్తూరులోని 36వ వార్డు సచివాలయానికి వెళ్లారు. ఆమె డ్రెసింగ్ కూడా అధికారిలాగా కాకుండా నిరుపేదలా రెడీ అయ్యారు. తనకు ఇల్లు లేదని.. ఇల్లు మంజూరు చేయాలని సచివాలయ సిబ్బందిని అడిగారు. వారు కూడా ఇంటి మంజూరుకు ఏం చేయాలో వివరించారు. అయితే ఈ తనిఖీల ప్రక్రియ పూర్తి కాక ముందే ఇద్దరు ఉన్నాతాధికారులు గ్రామసచివాలయానికి రావడంతో సీన్ కట్ అయిపోయింది. వచ్చిన వారు డిప్యూటీ కలెక్టర్ పల్లవి గుర్తించడంతో అక్కడితో తనిఖీ పూర్తయిపోయింది.
డిప్యూటీ కలెక్టర్‌గా పల్లవికి ఇళ్ల నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం ఇచ్చింది. అందుకే ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్లుగా తన బాధ్యతలకు సంబంధించి వార్డు సచివాలయంలో ఏం జరుగుతుందో.. ప్రత్యేకంగా తెలుసుకోవాలని వెళ్లారు. రెండు రోజుల కింట.. కృష్ణా జిల్లాసబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ ఇలాగే మారు వేషంలో వెళ్లి ఎరువుల షాపులు నడిపే యజమానులకు షాకిచ్చాడు. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు ఎరువులను విక్రయిస్తున్న వైనాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లుంగీ కట్టుకుని ఆయన చేసిన ప్రయత్నానికి మీడియాలో, సోషల్ మీడియాలో చాలా పబ్లిసిటీ వచ్చింది.
ముఖ్యమంత్రి జగన్ ఇటీవలి కాలంలో గ్రామ, వార్డు సచివాలయాలను ఆకస్మిక తనిఖీలు చేయాలని.. ఆదేశిస్తూ వస్తున్నారు. అయితే పెద్దగా అధికారులు దృష్టి పెట్టడం లేదు. అయితే ఇప్పుడు కొంత మంది యువ కలెక్టర్లు.. సామాన్యులుగా... మారు వేషాల్లోనూ వెళ్లి తమకు అప్పగించిన విషయాలపై తనిఖీలు చేస్తున్నారు. మరికొంత మంది అధికారులు కూడా.. గ్రామ, వార్డు సచివాయాలను ఆక్మసిక తనిఖీలను అది కూడా సామాన్యుల మాదిరిగా వెళ్లి చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో మరికొంత మంది అధికారుల మారు వేషాలను కూడా మనం చూడాల్సి రావొచ్చు.