TDP : లోకేష్ యువగళం పూర్తి - చంద్రబాబు ప్రజాగళం ప్రారంభం ! ప్రచార జోరులో టీడీపీ
Prajagalam : ప్రజాగళం పేరుతో కొత్త ప్రచార కార్యక్రమన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే దీన్ని పూర్తి చేయనున్నారు.
Chandrababu will start a new campaign called Prajagalam : ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేళ టీడీపీ దూకుడు పెంచింది. ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే టీడీపీ చేపట్టిన ‘రా.. కదలిరా’ సభలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. రా కదలి రా చివరి సభ మార్చి 4న రాప్తాడులో ముగియనుంది. మరో కొత్త కార్యక్రమాన్ని చేపట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు చేసుకున్నారు. మార్చి 6 నుంచి 5రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ‘ప్రజాగళం’ అనే పేరు పెట్టారు. మార్చి 6న నంద్యాల, మైదుకూరులో ప్రజాగళం నిర్వహించాలని యోచిస్తున్నారు.
మరోవైపు టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఇప్పటికే తాడేపల్లిగూడెంలో తొలి సభ విజయవంతంగా నిర్వహించారు. ఈ వేదికపై జనసేన జెండాతో చంద్రబాబు, టీడీపీ జెండాతో పవన్ కల్యాణ్ ఇరు పార్టీల శ్రేణులకు సందేశమిచ్చారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఉత్సాహంగా ఈ సభలో పాల్గొన్నారు. త్వరలో మరిన్ని సభలు నిర్వహించేందుకు టీడీపీ-జనసేన నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో సభ ప్రత్తిపాడులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పూర్తి చేసుకున్న తర్వాత మరో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. శంఖారావం సభలు నిర్వహించారు. లోకేశ్ సభలకు టీడీపీ-జనసేన కార్యకర్తలు తరలివచ్చారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు.ఇలా లోకేశ్ జనంలోకి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు.
మరోవైపు నారా భువనేశ్వరి రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రజల వద్దకు వెళుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మరణించిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటున్నారు. ఆయా కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తున్నారు. ఇలా నారా ఫ్యామిలీ మొత్తం ప్రజల మధ్య ఉంటున్నారు. రాష్ట్రం మొత్తంలో అన్ని నియోజకవర్గాలను ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే ఓ సారి పూర్తి చేయాలని అనుకుంటున్నారు. టీడీపీ జోరుతో పోలిస్తే వైసీపీ వెనుకబడింది. ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు లేకపోవడంతో ప్రచార భారం మొత్తం సీఎం జగన్ పై పడింది. పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ ఆయన ప్రచారాలను నిర్వహించాల్సి ఉంది. సిద్ధం సభలను నిర్వహిస్తున్నా... తరచూ వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి.
ఎన్నికల షెడ్యూల్ రాగానే మరింత జోరుగా .. ప్రచార బరిలోకి దిగేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అభ్యర్థులు ఖరారు చేసిన చోట.. పూర్తి స్థాయిలో ప్రచారం ప్రారంభించారు. ఖరారు చేయాల్సిన చోట.. ఇంచార్జులు ఆశావహులు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.