(Source: ECI/ABP News/ABP Majha)
Amaravati White Paper : అమరావతిలో ఐదేళ్ల విధ్వంసం ప్రజల ముందు - బుధవారం శ్వేతపత్రం ప్రకటించనున్న చంద్రబాబు
Chandrababu : అమరావతిలో ఐదేళ్లు జరిగిన విధ్వంసాన్ని చంద్రబాబు శ్వేతపత్రం రూపంలో బుధవారం ప్రకటించనున్నారు. అమరావతిపై తమ ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణను కూడా వెల్లడించనున్నారు.
Chandrababu will announce white paper On Amaravati : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిలో జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించుకున్నారు. బుధవారం మొత్తం అమరావతి అంశంపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.అమరావతిపై తమ ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణను కూడా వెల్లడించనున్నారు.
దీనికి సంబంధించి అధికారులతో ఇప్పటికే చంద్రబాబు రివ్యూ చేశారు. ఇప్పటివరకు జరిగిన పనులకు సంబంధించి వ్యవహారాలను శ్వేతపత్రంలో ప్రకటించే అవకాశం ఉంది. గతంలో జరిగిన నిర్మాణాలు, పెండింగ్ లో ఉన్న పనులు, ఏయే పనులు ప్రధానంగా డ్యామేజ్ అయ్యాయి.. ఇలాంటి అంశాలను వైట్ పేపర్ లో ఉంటాయి. అమరావతిని నిర్వీర్యం చేసేందుకు జగన్ ప్రభుత్వం చేసిన కుట్రలు, తప్పుడు కేసులు వంటి వివరాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది.
అమరావతే ఏకైక రాజధాని అని టీడీపీ నినాదం. ఆ నినాదంతోనే ఎన్నికలకు వెళ్లి భారీ విజయం సాధించారు. గెలిచిన వెంటనే జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. ఇప్పటికే చంద్రబాబు అమరావతి ప్రాంతంలో ఓ సారి పర్యటించి రైతులతో మాట్లాడారు. సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి అవసరమైన భూమి ఇంకా కొంత మంది రైతులు ఇవ్వలేదు. వారితో అధికారులు మాట్లాడుతున్నారు. గతంలో నిర్మాణాలకు కాంట్రాక్టులు పొందిన కంపెనీలతో ఒప్పందాలు తీరిపోయాయి. మళ్లీ ఒప్పందాలు చేసుకోవాలా లేకపోతే మళ్లీ టెండర్లు పిలవాలా అన్నదానిపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. నిర్మాణ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు.
అమరావతిలో మళ్లీ నిర్మాణాలను మరో నెలలో ప్రారంభించాలని గట్టి పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే 70 నుంచి 90 శాతం వరకూ పూర్తయిన భవనాలను అందుబాటులోకి తీసుకు వస్తే చాలా వరకూ వసతి సమస్య పరిష్కారం అవుతుందని ఉద్యోగులంతా ఒకే చోట నిర్వాసం ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అదే సమయంలో గతంలో భూములు కేటాయించిన సంస్థలు వెంటనే పనులు ప్రారంభించేలా సంప్రదింపులు జరుపుతున్నారు. చాలా వరకూ భూ కేటాయింపులను జగన్ ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ ఆసక్తి చూపించే సంస్థలకు మళ్లీ కేటాయించే అవకాశం ఉంది. దాదాపుగా అన్ని కంపెనీలు మళ్లీ అమరావతిలో నిర్మాణాలు, కార్యాలయాలు, విద్యాసంస్థలు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటికే ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్ ల కోసం భూమిని నోటిపై చేశారు. రెండున్నర లేదా మూడేళ్లలో అమరావతి ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్‌లను పూర్తి చేయాలనుకుంటున్నారు. అభివృద్ధి పనులు కొనసాగుతూండగా.. భూములు వేలం వేసి. నిధులు సమీకరించుకోవాలని అనుకుంటున్నారు. ఇలాంటి ప్రణాళికలు మొత్తాన్ని చంద్రబాబు వివరించే అవకాశం ఉంది.