AP CM Chandrababu: ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కొత్త ముహూర్తం ఖరారు !
Chandrababu To Take Oath As Andhra Pradesh CM: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు జూన్ 9న ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే మోదీ ప్రమాణ స్వీకారం ఉండటంతో చంద్రబాబు కార్యక్రమం వాయిదా వేశారు.
AP New CM Chandrababu | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం వాయిదా పడిందా అంటే అవుననే అనిపిస్తోంది. వాస్తవానికి జూన్ 9న అమరావతి వేదికగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉండటంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం కాస్త వెనక్కి వెళ్లింది. జూన్ 12న అమరావతి వేదికగా ఏపీ నూతన సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారని సమాచారం. చంద్రబాబు ప్రమాణం కార్యక్రమానికి మోదీ హాజరయ్యే అవకాశం ఉంది.
మోదీ ప్రమాణ స్వీకారం తరువాతే చంద్రబాబు ఈవెంట్
కేంద్రంలో ఈ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ రాకపోవడంతో ఎన్డీయే మిత్రపక్షాలతో నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఢిల్లీలో బుధవారం నాడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్ సహా మొత్తం ఎన్డీఏ నేతలతో నరేంద్ర మోదీ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఎన్డీయే పక్షనేతగా మోదీని ఎన్నుకున్నారు. ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నట్లు చంద్రబాబు, నితీష్ కుమార్ లేఖలు ఇచ్చారు. అయితే చంద్రబాబు 9న ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా, అదే రోజు ప్రధానిగా మోదీ ప్రమాణం చేయనున్నారు. ద్రౌపది ముర్ము మోదీతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. దాంతో మోదీ ప్రమాణ స్వీకారం తరువాతే ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయాలని భావిస్తున్నారు. మరోవైపు ఇండి కూటమి చంద్రబాబు, నితీష్ కుమార్ లను తమవైపు లాగేసుకుంటే కేంద్రంలో అధికారం చేపట్టాలని యోచించింది. వారికి ఉన్న మార్గం కూడా అదే చెప్పవచ్చు. అయితే బుధవారం ఎన్డీఏ మీటింగ్ కు వెళ్లిన ఈ ఇద్దరు నేతలు కూటమికి పూర్తి మద్దతు ప్రకటించారు.
బుధవారం ఎన్డీఏ నేతలు ఓసారి సమావేశం కాగా, జూన్ 7న మరోసారి సమావేశం కావాలని నేడు నిర్ణయించారు. ఈ కీలక భేటీకి ఎన్డీయే కూటమిలోని ఎంపీలు అందరూ హాజరు కానున్నారు. మంత్రివర్గంపై చర్చించిన అనంతరం అదేరోజు సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
ఏపీ అసెంబ్లీలో మొత్తం 175 స్థానాలు ఉండగా, అతిపెద్ద పార్టీగా అవతరించిన టీడీపీకి 135 సీట్లు రాగా, 21 స్థానాల్లో నెగ్గిన జనసేన రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. అన్ని స్థానాల్లో పోటీ చేసిన వైఎస్సార్ సీపీ కేవలం 8 స్థానాలకు పరిమితం కాగా, బీజేపీ నుంచి 8 మంది అభ్యర్థులు విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఓవరాల్ గా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 164 సీట్లతో ప్రజలు అధికారం అప్పగించారు.