Ballari Chandrababu : బళ్లారిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు - ఏపీ కన్నా ఎక్కువ హంగామా చేసేశారుగా
బళ్లారిలో చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరని అన్నారు.
Ballari Chandrababu : కర్ణాటకలోని బళ్లారిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. బళ్ళారి కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఈ విగ్రహ ఏర్పాటు జరిగింది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజల మధ్య ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు జిందాల్ విమానాశ్రయానికి చేరుకోగానే అనంతపురం జిల్లా టీడీపీ నేతలు చంద్రబాబుకు స్వాగతం పలికారు. కమ్మ సంఘం నేతలు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబు కాన్వాయి వెంట వందలాది వాహనాలతో వెళ్లారు.
విగ్రహావిష్కరణ తర్వాత చంద్రబాబు మాట్లాడారు. ఎన్టీఆర్ భారతదేశ సంపద అని కొనియాడారు. ఎన్టీఆర్ ఒక మహాశక్తి, గొప్ప వ్యవస్థ అని అభివర్ణించారు. "ఇక్కడ మీ ఉత్సాహం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నానా... బళ్లారిలో ఉన్నానా అన్న సందేహం కలుగుతోంది. నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందించాల్సిన విషయం. ఎన్.టి.రామారావు భారతదేశ కీర్తి, తెలుగువారి సంపద. ఇప్పుడు చెప్పుకునే ఆహార భద్రత పథకాన్ని నాడే తీసుకొచ్చిన మహానుభావుడు. అదీ ఆయన ఆలోచన... విశిష్టత. ఒక్కసారి ఎన్టీఆర్ విగ్రహం చూసి ఏ సంకల్పం చేసినా అది కచ్చితంగా జయప్రదం అవుతుంది. సినీ రంగంలో ఆయన పోషించిన పాత్రలు ఎవరూ చేయలేరు. మరలా ఆయనే పుడితే తప్ప, అది సాధ్యం కాదు. రాముడు, భీముడు, కృష్ణుడు ఇలా ఏ పాత్ర అయినా దానిలో జీవించి, ప్రజల హృదయాల్లో నిలిచారని గుర్తు చేసుకున్నారు.
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనుకొని ఆయన రాలేదు. తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు మనసు చలించి, తెలుగువాళ్లకు జరిగిన అగౌరవం, అవమానంపై కలత చెంది రాజకీయాల్లో అడుగుపెట్టారు. తెలుగుజాతి ఉన్నంతవరకు తెలుగువారి గుండెల్లో నిలిచే ఏకైక నాయకుడు నందమూరి తారకరామారావు. అలాంటి మహానీయుని విగ్రహం ఏర్పాటు చేసిన వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక నేతలు, అభిమానులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను" అని చంద్రబాబు పేర్కొన్నారు.
"బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ" కార్యక్రమంలో భాగంగా బళ్ళారిలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు గారు స్థానిక తెలుగు ప్రజలు ఏర్పాటు చేసిన NTR విగ్రహాన్ని ఆవిష్కరించారు#NTRLivesOn #CBNinAnantapur#TDPforDevelopment #AndhraPradesh #BhavishyathukuGuarantee… pic.twitter.com/zSJPgU0e6Q
— Telugu Desam Party (@JaiTDP) September 5, 2023
సినీ రంగంలో ఆయన చేసిన పాత్రలు.. ఒక వేంకటేశ్వరుడు, కృష్ణుడు, రాముడు, భీముడు, దుర్యోధనుడు ఇలా ఏదీ చూసినా ఆది ఆయనకే చెల్లుబాటని వేరే ఎవరూ చేయలేరని.. అదే ఎన్టీ రామారావు ప్రత్యేకతని కొనియాడారు. భవిష్యత్‌లో కూడా ఇలాంటి వ్యక్తి మళ్లీ పుట్టరని.. ఎవరైనా అలాంటివారు రావాలంటే మళ్లీ ఎన్టీఆరే పుడితే తప్ప ఎవరూ చేయలేరని అన్నారు. చివరిగా జై ఎన్టీఆర్.. జై కర్ణాటక అంటూ చంద్రబాబు అభివాదం చేశారు.
బళ్లారిలో NTR గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు నాయుడు గారు.. pic.twitter.com/yWQI6m9HLR
— మన ప్రకాశం (@mana_Prakasam) September 5, 2023