Chandrababu : ‘హెల్తీ-వెల్తీ-హ్యాపీ’నే మన నినాదం - కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు
Andhra : రాష్ట్ర పరిపాలనా దృక్పథంపై కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ‘పీపుల్ ఫస్ట్’ అనేది మన విధానమని స్పష్టం చేశారు.
Chandrababu Collectors Conference : రాష్ట్రంలో ప్రతి అధికారి పెత్తందారులా కాకుండా ప్రజాసేవకుడిలా పనిచేయాలని, ‘పీపుల్ ఫస్ట్’ అనేది మన విధానమని, ‘హెల్తీ-వెల్తీ-హ్యాపీ’ మన నినాదం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాల కలెక్లర్లతో అన్నారు. ప్రజా సమస్యలను ఒక అధికారిలా కాకుండా.. మానవతా కోణంలో చూడాలని చెప్పారు. ప్రజలతో మన ప్రవర్తన మర్యాద పూర్వకంగా ఉండాలని, మనం మంచి పనులు చేస్తే ప్రజలు కచ్చితంగా అభినందిస్తారని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా సమస్యలు తెలుసుకోవడం, ప్రజల వినతుల వేగంగా పరిష్కరించడం అధికారుల ప్రథమ ప్రాధామ్యాలుగా ఉండాలన్నారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, 26 జిల్లాలకు చెందిన కలెక్టర్లతో రెండవ జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి గడిచిన 6 నెలల పాలనపైనా, భవిష్యత్ ప్రణాళికలపైనా చర్చించారు.
మార్పు మొదలైంది.. వెలుగులు చూస్తున్నాం
ఆరు నెలల్లో మనమంతా రెండోసారి సమావేశం అయ్యామని అయితే మొదటి సమావేశానికి రెండవ సమావేశానికి స్పష్టమైన పురోగతి కనిపిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. మొదటి సమావేశం నాటికి రాష్ట్రంలో చీకట్లు నెలకొనగా, అవి మెల్లిగా పోయి రెండో సమావేశం కల్లా వెలుగు రావడం మొదలైందని చెప్పారు. సాధారణ పరిస్థితులు నెలకొన్న రాష్ట్రాన్ని నడిపించడం సులభంగానే ఉంటుందని, విధ్వంసం జరిగిన రాష్ట్రంలో పాలన సాగించాలంటే ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. గత ప్రభుత్వం రూ. పది లక్షల కోట్ల పైనే అప్పులు-బకాయిలు మిగిల్చి వెళ్లడమే కాదు, రెండేళ్ల పాటు రాష్ట్రానికి వచ్చే నిధులను ముందుగానే వాడేసిందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వ యంత్రాంగానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించామని, సంక్షేమం-అభివృద్ధి వైపు వడిగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. గత పాలకులు పోర్టులు, సెజ్‌లు కూడా కబ్జా చేశారని.. ఇలా అన్నింటినీ ఒకొక్కటిగా సరిదిద్దుతున్నామని.. ఇందులో జిల్లాల కలెక్టర్లు చురుకైన పాత్ర పోషించాలని చెప్పారు. పీ 4 పాలసీ, జీరో పావర్టీ, ఉద్యోగాలకల్పన, జనాభావృద్ధి, జల సంరక్షణ, వ్యవసాయంలో పెట్టుబడి తగ్గించడం – రైతులకు లాభాలు పెంచడం.. తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని సూచించారు.
గంజాయిని కూకటి వేళ్లతో సహా తొలగించండి
గత ప్రభుత్వంలో భూ అక్రమాలు, లిక్కర్ మాఫియా, ఇసుక దోపిడీ, గంజాయి సాగు, డ్రగ్స్ సరఫరా, ఎర్రచందనం స్మగ్లింగ్, రేషన్ బియ్యం విదేశాలకు అక్రమ రవాణా.. ఇలా అన్ని మూలాల్లోకి మాఫియా వెళ్లిపోయిందని.., ఇప్పుడు వాటిని కూకటి వేళ్లతో సహా తొలిగించాల్సిన బాధ్యత జిల్లాల కలెక్టర్లపైనే ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఎక్కడా గత ప్రభుత్వ పాలనకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించకూడదని, ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీసిన వారిని క్షమించొద్దని, విశ్వసనీయతను - నమ్మకాన్ని తిరిగి నిలబెట్టి రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని ముఖ్యమంత్రి మార్గదర్శనం చేశారు.
నిరూపించుకునే అవకాశమిస్తున్నాం !
పాలనలో కూడా ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ రావాలని, ప్రభుత్వ నిర్ణయాలను వేగంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. జిల్లాల కలెక్టర్లు ఒకరితో ఒకరు పోటీ పడితేనే ఫలితాలు ఆశించినట్టుగా వస్తాయన్నారు. మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు అందరికీ అవకాశం ఇస్తున్నానని ముఖ్యమంత్రి చెప్పారు. జిల్లాకు ఏడు నియోజకవర్గాలే ఉన్నందున పాలన సులభతరమేనని, మానవ వనరుల అభివృద్ధి నుంచి శాంతి భద్రతల అమలు వరకు అన్నింటా సమర్ధత చూపాలన్నారు. డబ్బులు లేవని అభివృద్ధి పనులు ఆపొద్దని, వినూత్నంగా ఆలోచించి ముందుకు సాగాలని, వచ్చే కలెక్టర్ల సమావేశం నాటికి పరిపూర్ణత రావాలన్నారు. పనిచేయని వాళ్లతో పనిచేయించాలని.. అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు చెప్పారు.
ఫలితాలు ఆలస్యమైనా కర్తవ్యం మరవొద్దు !
కొన్నిసార్లు ఫలితాలు వెంటనే రాకపోవచ్చని, అలా అని నిరుత్సాహ పడకుండా పనిచేస్తే ఎప్పటికైనా అనుకున్నది సాధిస్తామని... ఇటీవల ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనను ముఖ్యమంత్రి ఇందుకు ఉదహరించారు. లోకేష్ అమెరికా పర్యటన ఫలితంగా ఇప్పుడు రాష్ట్రానికి గూగుల్ వంటి సంస్థ విశాఖపట్నం రావాలని నిర్ణయించిందని చెప్పారు. ఇందుకు సంబంధించి బుధవారం గూగుల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ చేసుకుందన్నారు. రాష్ట్రంలోని యువతతో సహా అందరికీ డిసెంబర్ 11 ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు. గూగుల్‌తో ఎంవోయూ ద్వారా విశాఖపట్నం రూపురేఖలు మారి, రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందన్నారు. డేటా సెంటర్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, సీ కేబుల్ వంటివి వస్తే ప్రపంచం చూపు విశాఖ వైపు ఉంటుందన్నారు. నాలెడ్జ్ సొసైటీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలి అనుకుంటున్నామని, ఆర్టీజీఎస్‌తో గూగుల్‌ని అనుసంధానం చేస్తున్నట్టు, ఇది ప్రభుత్వంలో పెద్ద మార్పు తీసుకువస్తుందని అన్నారు.
మారిన పరిస్థితులతో భారీగా పెట్టుబడులు !
అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై 7 శ్వేత పత్రాలు విడుదల చేశామని, 20 పాలసీలు తీసుకువచ్చామని.. ఇవన్నీ చూసి రూ. 4 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, వీటి ద్వారా 4 లక్షల ఉద్యోగావకాశాలు కలుగుతాయని వివరించారు. అమరావతి అభివృద్ధికి రూ. 31 వేల కోట్లు సమకూర్చామని, పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకేరోజు గ్రామ సభలు నిర్వహించడం ద్వారా గ్రామాల్లో తలపెట్టిన వివిధ అభివృద్ధి పనులను వచ్చే సంక్రాంతి నాటికి పూర్తయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు.
పింఛన్ల పంపిణీలో మనదే రికార్డు !
దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతగా 64 లక్షల మంది పేదలకు పింఛన్లు ఇస్తున్నామని, ప్రతీ ఏడాది 33 వేల కోట్లు ఇందుకోసం ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. దీపం -2 కింద ఇప్పటికే 40 లక్షల సిలండర్లు పేద కుటుంబాలకు అందించామని అన్నారు. రాష్ట్రంలో 199 అన్న కేంటిన్లు ఏర్పాటు చేశామన్నారు. 43 వేల పాఠశాలల్లో కోటి 20 లక్షల మందితో నిర్వహించిన పేరెంట్స్ – టీచ్చర్స్ మీటింగ్ విజయవంతమైందని, 16 వేలకు పైగా ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి త్వరలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
రెవెన్యూ సదస్సులతో శాశ్వత పరిష్కారం !
ప్రజల నుంచి మనకు వచ్చే వినతుల్లో అత్యధికంగా 60 శాతం భూసంబంధితమైనవే ఉంటున్నాయని అందుకే భూ సమస్యలు పరిష్కరించేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని, ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్టును తీసుకువచ్చామని ముఖ్యమంత్రి చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లాల కలెక్టర్లు రెవెన్యూ సదస్సులను నామమాత్రంగా కాకుండా, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలు పదే పదే అర్జీలు పట్టుకుని తిరిగే పరిస్థితి పోవాలని, బాధిత వర్గాలకు ఎలా న్యాయం చేయాలనేది అధికారులు ఆలోచించి పనిచేయాలని ముఖ్యమంత్రి అన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ప్రస్తుతం పని చేస్తున్న విధానంతో మార్పు రాదని, తనకు వచ్చిన అర్జీని ఆర్డీవో తాసీల్దార్‌కు పంపితే సమస్య పరిష్కరించినట్లు కాదన్నారు. సంతృప్తికరమైన పరిష్కారం చూపితేనే ప్రజల నుంచి సానుకూలత వస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఎన్నిసార్లు తిరిగినా సమస్య పరిష్కారం కాకపోతే ప్రజల్లో వ్యతిరేకత మొదలు అవుతుందన్నారు.
సంక్రాంతి కల్లా రహదారుల మరమ్మతులు !
ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోందని, 48 గంటల్లో డబ్బులు జమ చేస్తున్నామని, ఐదేళ్లలో పాడైన రోడ్లన్నింటికీ మరమ్మతులు చేస్తున్నామని.. సంక్రాంతి కల్లా గుంతలు పూడుస్తామని ముఖ్యమంత్రి అన్నారు. గూగుల్ సాయంతో విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగును కనుగొన్నామని, సాయిల్ టెస్టింగ్, సాయిల్ హెల్త్ వంటి వాటికి కూడా టెక్నాలజీ సాయం తీసుకుంటామన్నారు.
స్వర్ణాంధ్ర – 2047 విజన్‌తో పాలన !
స్వర్ణాంధ్ర విజన్ – 2047ను ఈనెల 13న ఆవిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రం, జిల్లా, మండలం, పంచాయతీ స్థాయిలో విజన్ రూపొందించామని దాని ఆధారంగా పాలన సాగాలన్నారు. 15 శాతం వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకుని జిల్లాల కలెక్టర్లు ఫలితాలు రాబట్టాల్సి ఉంటుందన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా, మంత్రులు హాజరయ్యారు.