TDP Janasena: అట్టర్ ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ఉంటుందా ? - తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబు
Chandrababu : అట్టర్ ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం సభలో ఆయన ప్రసంగించారు.
Chandrababu clarified that there will be no sequel to Utter Flop : వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసమే టీడీపీ - జనసేన పార్టీలు కలిశాయని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన ఆ పార్టీని ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘తెలుగు జన విజయకేతనం’ ఉమ్మడి సభలో ఆయన ప్రసంగించారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకమని, వైకాపా దొంగలపై పోరాడాలని పిలుపునిచ్చారు.
ప్రజలు కుదిర్చిన పొత్తు
రాష్ట్ర ప్రజల కోసం కుదిర్చిన పొత్తు తమదని.. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలు మాతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు. 2029కి విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. హైదరాబాద్ కంటే మిన్నగా రాజధాని ఉండాలని అమరావతికి రూపకల్పన చేశాం. పోలవరం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే సంకల్పంతో ముందుకెళ్లాం. కానీ, రాష్ట్రంలో ఇప్పుడు సైకో పాలన ఉంది. ఏ సీఎం అయినా అభివృద్ధి పనులతో పాలన సాగిస్తారు.. జగన్ సీఎం అయ్యాక అరాచకాలతో పాలన సాగిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ అపహాస్యం చేశారు. వైకాపా వేధింపులు తట్టుకోలేక క్రికెటర్ హనుమ విహారి పారిపోయే పరిస్థితి వచ్చింది. సొంత చెల్లి మరో పార్టీలో చేరితే సోషల్‌మీడియాలో వేధించారు. జగన్ మానసిక స్థితికి ఈ ఘటనలే నిదర్శనం. అందుకే, వైకాపాను చిత్తుగా ఓడించి సైకో నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలని పిలుపునిచ్చారు.
అట్టర్‌ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ ఉండదు !
జగన్.. 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు? తెచ్చారా? కుప్పం ప్రాంతానికి నీళ్ల పేరిట జగన్ నాటకాలు వేశారు. ఒక్క రోజులోనే అంతా సర్దుకొని పోయారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజార్టీ వస్తుంది. జగన్ పాలన ఒక అట్టర్‌ఫ్లాప్ సినిమా. అలాంటి సినిమాకి సీక్వెల్ ఉంటుందా? టీడీపీ -జనసేన కూటమి సూపర్‌హిట్. వైకాపా గూండాలకు మా సినిమా చూపిస్తాం. తెదేపా-జనసేన విన్నింగ్ టీమ్ అని ధీమా వ్యక్తం చేశారు. అవసరమైతే ఏ త్యాగాలకైనా మేం సిద్ధమని.. తన పాలన కోసం రాష్ట్రాన్ని, కులాలు, మతాలు, ప్రాంతాలుగా విభజిస్తున్నారని ఆరోపించారు. ఏపీని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలనేదే మా సంకల్పం.. అవసరమైతే ఏ త్యాగాలకైనా మేం సిద్ధమన్నారు. తెలుగు జాతిని ప్రపంచంలోనే నెం.1 స్థానంలో నిలబెట్టడమే మా లక్ష్యమన్నారు. జగన్ ఒక బ్లఫ్ మాస్టర్.. అంటే పదేపదే అబద్ధాలు చెప్పడం.. చేయని పనులు చేసినట్లు చెప్పుకునే వ్యక్తి జగన్‌రెడ్డి అని విమర్శించారు. హూ కిల్డ్ బాబాయ్.. జగన్‌రెడ్డి జవాబు చెప్పాలన్నారు. జగన్ తన పాలనలో అందరినీ బాధపెట్టాడు, అవమానించాడు .. సినిమా టికెట్ల పేరుతో చిరంజీవి, రాజమౌళిని అవమానించారు ..వై నాట్ 175 అని జగన్ అంటున్నాడన్నారు. వైసీపీ దొంగలపై మనం పోరాడుతున్నామని తెలిపారు. కొండనైనా బద్ధలు చేస్తామనే ధైర్యం టీడీపీ-జనసేన కూటమి ఇస్తుందన్నారు.
రాష్ట్రాభివృద్ధికి మా వద్ద బ్లూప్రింట్ ఉంది
తెదేపా అగ్నికి పవన్ కల్యాణ్ వాయువులా తోడయ్యారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తెదేపా-జనసేన కలిసింది. ఈ సభ చూశాక మా గెలుపును ఎవరూ ఆపలేరని అర్థమైంది. రాష్ట్రంలో విధ్వంసానికి ఫుల్‌స్టాప్ పడుతుంది. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో మా వద్ద బ్లూప్రింట్ ఉంది. పెట్టుబడులు తెచ్చి రాష్ట్రంలో సంపద సృష్టించి పేదలకు పంచుతాం. ఇక ఏపీ అన్‌స్టాపబుల్. కూటమి వల్ల కొందరు నేతలు ఇబ్బంది పడి ఉండొచ్చు.. కానీ, పార్టీ కోసం పనిచేసిన అందరికీ న్యాయం చేస్తాం’’అని చంద్రబాబు అన్నారు.