Ayesha Meera case : ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు - ఎవరెవరిని ప్రశ్నిస్తోందంటే ?
ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ విచారణ జరుపుతోంది. అప్పటి హాస్టల్ వార్డెన్, కేసు విచారణ జరిపిన పోలీసులను ప్రశ్నిస్తోంది.
Ayesha Meera case : పదిహేనేళ్ల తర్వాత కూడా ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసు విచారణ జరుగుతోంది. చాలాకాలం విరామం తర్వాత సీబీఐ అధికారులు మళ్లీ ఆరా తీయడం ప్రారంభించారు. బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ అధికారులు మరోసారి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసులో కొన్నేళ్లపాటు జైలు జీవితం గడిపిన సత్యంబాబును నిర్దోషిగా కోర్టు తేల్చింది. తర్వాత కేసును సీబీఐకి అప్పగించింది. నాలుగేళ్ల కిందట సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఆయేషా మీరా హత్య జరిగిన సమయంలో.. నందిగామ డీఎస్‌పీగా పని చేసి.. ప్రస్తుతం తెలంగాణలో జాయింట్ సీపీగా పనిచేస్తున్న ఎం.శ్రీనివాస్ నుంచి సీబీఐ మరోసారి సమాచారం సేకరిస్తోంది.
ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు హైదరాబాద్ సిబీఐ కేంద్రంగా జరుగుతుంది. విచారణలో భాగంగా ఆయేషామీరా ఉన్న హాస్టల్ వార్డెన్‌ను సీబీఐ పిలిచి ప్రశ్నించింది. 2007 డిసెంబర్ 27 వ తారీఖున విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఆయేషామీరా హత్యాచారానికి గురైంది. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం కాగా, పోలీసులపై తీవ్ర ఒత్తిడి నెలకున్న నేపథ్యంలో సత్యంబాబును అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం దిగువ కోర్టు అతడికి యావజ్జీవ శిక్ష విధించగా.. 2017లో హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించింది. దీంతో అసలు నిందితులను తేల్చే పనిలో సీబీఐ విచారణ కొనసాగుతుంది.
ఆయేషా హత్య కేసులో సాక్షులుగా వున్న వారిని.. మరోసారి స్క్రూటినీ చేస్తోంది.ఆయేషామీరా హత్య కేసు ను ఐపీఎస్ అధికారులు ఆనంద్, ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తప్పు దోవ పట్టించారని అయేషా మీరా తల్లి శంషాద్ బేగం ఆరోపిస్తున్నారు. 2018 డిసెంబరులో కేసు సీబీఐ స్వీకరించింది. తర్వాత ఆయేషా మీరా తల్లిదండ్రులను సికింద్రాబాద్ తీసుకెళ్లి డీఎన్‌ఏ టెస్ట్ కూడా చేయించారు. వారి వద్ద ఉన్న వివరాలు సీబీఐ తీసుకుంది. రీ పోస్టుమార్టం కూడా చేయాలని సూచించడంతో కోర్టు ఆదేశాలతో రీ పోస్ట్‌మార్టం చేశారు. అసలైన దోషులకు శిక్ష పడి.. న్యాయం జరిగే వరకూ ముందుకు సాగుతామని ఆయేషా మీరా తల్లిదండ్రులు అంటున్నారు.
2007 డిసెంబరు 7 విజయవాడలోని దుర్గా లేడీస్ హాస్టల్‌లో ఆయేషా మీరా హత్య జరిగింది. అప్పుడుఆయేషా విజయవాడలోని నిమ్రా కాలేజ్‌లో ఫస్టియర్ బీఫార్మసీ చదువుతోంది. ఆమె హత్య తర్వాత హాస్టల్‌లో ఉంటున్నవారిని, వార్డెన్‌ను, స్నేహితులను పోలీసులు ప్రశ్నించారు. దాదాపు 56 మంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ తర్వాత సత్యంబాబును పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు 2017లో ఆయన్ను నిర్థోషిగా ప్రకటించింది. సత్యంబాబును నిర్దోషిగా ప్రకటించడంతో అసలు అనుమానితులు ఎవరు అన్నదానిపై కూడా స్పష్టత లేకపోవడంతో సీబీఐ ఈ కేసును చేధించడం సవాల్‌గా ామారింది.