Viveka CBI : కొలిక్కి వస్తున్న వివేకా హత్య కేసు.. ఆయుధాలు కూడా స్వాధీనం..! త్వరలో మరిన్ని అరెస్టులు...?
వివేకా హత్య కేసులో అనుమానితుల ఇళ్లలోనే ఆయుధాలను సీబీఐ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. త్వరలో వివేకా కేసు అసలు నిందితుల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
వైఎస్ వినేకానందరెడ్డి హత్య కేసు ఓ కొలిక్కి వస్తోందా..? . సునీల్ కుమార్ యాదవ్‌ను అరెస్ట్ చేసిన తర్వాత సీబీఐ చాలా వేగంగా హత్యకు ఉపయోగించిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకుంది. సునీల్ యాదవ్ కస్టడీలో ఓ చెరువులో ఆయుధాలను పడేశారని చెప్పడంతో మొదటగా ఆ చెరువులో వెదికారు సీబీఐ అధికారులు . కానీ ఎక్కడా దొరకలేదు. దీంతో అనుమానితుల ఇళ్లలోనే సోదాలు చేసినట్లుగా తెలు్సతోంది. పులివెందులలోని సునీల్ యాదవ్, తోండూరులోని ఎర్రగంగిరెడ్డి, ప్రోద్దుటూరులోని సుబ్బారెడ్డి, సింహాద్రిపురంలోని ఉమాశంకర్ ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వారి ఇళ్లలోనే సీబీఐ.. ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సునీల్ యాదవ్ సోదరుడు స్టేట్‌మెంట్‌ను కూడా సీబీఐ అధికారులు నమోదు చేశారు. మరో వైపు రెండో సీబీఐ బృందం కూడా చురుకుగా దర్యాప్తు జరుపుతోంది.
ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య జరిగిందన్న కోణంలో ప్రస్తుతం విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కర్ణాటక నంచి 20 మందికిపైగా బ్యాంక్ రెవిన్యూ అధికారులు పులివెందులకు వచ్చి పూర్తి స్థాయిలో సీబీఐ కి వివరాలు అందించారు. వివేకానందరెడ్డికి సంబంధించిన ఆస్తులు... ఆర్థిక లావాదేవీలు.. భూముల వ్యవహారాలు ఇలా మొత్తం ప్రతీ అంశంపైనా సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. డాక్యుమెంట్ల సహితంగా ఆధారాలు రెడీ చేస్తున్నారు. రెండు నెలలకుపైగా సాగుతున్న విచారణకు వీలైనంత త్వరగా ముగింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో సీబీఐ ఉన్నట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల కిందట సాక్ష్యాలు మాయం చేయాలని ప్రయత్నించిన వారితో పాటు.. అంత పక్కాగా హత్య అని తెలుస్తున్నప్పటికీ.. గుండె పోటు అని ప్రచారం చేసిన వారిని సీబీఐ అధికారులు పిలిపించి విచారణ జరిపారు.
మరో వైపు నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ కుటుంబసభ్యులు సీబీఐ పై ఆరోపణలు చేస్తున్నారు. వివేకాను చంపేంత పెద్ద వాళ్లం కాదని... ఆయనను ఎవరు చంపారో అందరికీ తెలుసని అంటున్నారు. తమను బలి పశువుల్ని చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరో వైపు సీబీఐకి సహకరించేందుకు వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఎక్కువగా పులివెందులలోనే ఉంటున్నారు. సీబీఐ అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వారి ముందు హాజరై కావాల్సిన వివరాలు ఇస్తున్నారు. గతంలో వివేకా హత్య కేసు విచారణ నిర్లప్తింగా ఉండేది .. కానీ ఇప్పుడు మాత్రం విమర్శలున్నా.. దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. వైఎస్ వివేకాను ఆయన ఇంట్లో హత్య చేసి ఇతరులెవ్వరూ పులివెందులలో ఉండగలరా అని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు కానీ.. సీబీఐ విచారణ సాగుతూండగానే కామెంట్లు చేయడం సరి కాదన్న అభిప్రాయం దర్యాప్తు వర్గాల నుంచి వినిపిస్తోంది.