TDP News : కేశినేని నానికి బుద్దా వెంకన్న కౌంటర్ - చంద్రబాబుకు మాటిచ్చారట !
కేశినేని నాని వ్యాఖ్యలకు బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుకు మాటిచ్చానని.. ఘాటు వ్యాఖ్యలు చేయబోనన్నారు.
TDP News : తొందరపడబోనని చంద్రబాబు తాను మాటిచ్చానని అందుకే కేశినేని నాని తమపై చేసిన విమర్శలకు స్పందించబోవడం లేదని విజయవాడ టీడీపీ నేత బుద్దా వెంకన్న ప్రకటించారు. తనను ఎవరేం విమర్శించినా తొందరపడనిని చంద్రబాబుకు మాటిచ్చానన్నారు. కాబట్టే కేశినేని నాని వ్యాఖ్యలపై ఇప్పుడేం స్పందించబోనన్నారు. తన మాటలు పార్టీకి నష్టం చేకూర్చకూడదనే తాను మాట్లాడటం లేదన్నారు. కేశినేని నాని వ్యాఖ్యలను అధిష్ఠానం చూసుకుంటుందని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ఈ సారి వైఎస్సార్ పైనుంచి వచ్చి ప్రచారం చేసినా గుడివాడ గొట్టంగాడు గెలవలేడని కొడాలి నాని ఉద్దేశించి బుద్దా వెంకన్న అన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇది అర్ధమవటంతో ఇక గుడివాడ పర్యటన అనవసరం అనుకున్నారన్నారు. అ వైసీపీ గొట్టంగాళ్లంతా టీడీపీ చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టాలని చూస్తున్నారన్నారు. సునీతా రెడ్డి పులివెందుల పులి అని... జగన్మోహన్ రెడ్డి పిల్లి మాత్రమేనని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు.
విజయవాడ టీడీపీలో కేశినేని నానికి ఇతర నేతల మధ్య సరిపడటం లేదు. గురువారం మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడుకు ఆహ్వానం కూడా అందలేదన్నారు నాని. విజయవాడ ఆఫీస్ ఓపెనింగ్‌కి కూడా పిలవలేదన్నారు. ఇలాంటి చర్యల ద్వారా ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని ఆయన పార్టీ హైకమాండ్ ను ప్రశ్నించారు. అదే సమయంలో పార్టీ నేతలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఇంచార్జులను గొట్టం గాళ్లన్నారు. వేరే పార్టీ నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. తాను ఏ లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానో తనకు తెలుసు అన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా తాను మాత్రం ప్రజల కోసం పని చేస్తున్నానని అన్నారు కేశినేని నాని. ప్రజలకు కోరుకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుస్తారనని ధీమా వ్యక్తం చేశారు. నీళ్ల ట్యాంకర్లను ప్రారంభించిన సందర్భంగా విజయవాడలోని తన ఆఫీస్ వద్ద కీలక వ్యాఖ్యలు చేశారు.
గత కార్పొరేషన్ ఎన్నికల్లో తనను పార్టీ వాళ్లే గొట్టంగాడని, చెప్పుతో కొడతానని తిట్టిన విషయాన్ని నాని గుర్తు చేశారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకుంటే చాలన్నారు. లేకపోయినా నష్టం లేదని అభిప్రాయపడ్డారు. విజయవాడ ప్రజలు తనతో చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉన్నారని చెప్పుకొచ్చారు. మహానాడులో తన కంట్రీబ్యూషన్ ఏమీ లేదన్నారు కేశినేని నాని. రాష్ట్రంలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నప్పటికీ రామ్మోహన్ నాయుడికి ఉన్న ప్రయార్టీ ఎవరికీ లేదన్నారు. వేరే వాళ్ల పాత్ర అక్కడ ఏమీ కనిపించలేదని అసహనం వ్యక్తం చేశారు. ఎందుకని విలేకర్లు ప్రశ్నిస్తే ఈ విషయాన్ని చంద్రబాబునో అచ్చెన్నాయుడినో అడగాలని సూచించారు నాని.
సెంట్రల్ నియోజకవర్గంలో ఇన్‌ఛార్జ్‌గా ఉన్న వ్యక్తి ఆఫీస్ ఓపెన్ చేస్తే తనకు ఆహ్వానం లేదన్నారు. సిట్టింగ్ ఎంపీగా తనకు ఆహ్వానం అందలేదని... అచ్చెన్న మాత్రం ఓపెనింగ్ వచ్చారన్నారు. దీని వల్ల ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చారని ప్రశ్నించారు. దీనిపై కూడా ఎవర్నీ తాను ఏమీ అడగలేదన్నారు. తన వెంట ప్రజలు ఉన్నారని ప్రజల కోసం పని చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. పొమ్మనలేక పొగబెడుతున్నారా అంటే దానికి కూడా అడగాల్సిన వాళ్లను అడగాలన్నారు. ప్రజలు అనుకుంటే ఇండిపెండెంట్‌గా గెలుస్తానన్నారు.
బెజవాడ తెలుగు దేశం పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ వ్యవహరం తీవ్ర స్థాయిలో చర్చనీయాశంగా మారుతోంది. వరుసగా ఆయన చేస్తున్న కామెంట్స్‌తో ఆయన పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాసుకొని తిరగడంతో పార్టీ మార్పుపై పుకార్లు మొదలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బెజవాడ పార్లమెంట్ స్దానం నుంచి నాని పోటీ చేస్తారని అంటున్నారు. అయితే ఆయన వ్యవహారంపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించడానికి నిరాకరిస్తున్నారు.