Brother Anil Meets Undavalli : ఉండవల్లితో బ్రదర్ అనిల్ భేటీ ! ఎందుకంటే ?
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో బ్రదర్ అనిల్ కుమార్ భేటీ అయ్యారు. రాజకీయ అంశాలపైనా చర్చలు జరిపినట్లుగా బ్రదర్ అనిల్ తెలిపారు.
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో ( Undavalli Arun Kumar ) రాజమండ్రిలోని ఆయన నివాసంలో వైఎస్ షర్మల ( YS Sharmila ) భర్త బ్రదర్ అనిల్ కుమార్ సమావేశమయ్యారు. దాదాపుగా గంట పాటు చర్చలు జరిపారు. షర్మిల వైఎస్ జగన్‌తో ( YS Jagan ) విభేదించి తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్నారు. ఇటీవల ఏపీలో కూడా పార్టీ పెట్టకూడదన్న రూలేమీ లేదు కదా అని వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఆ తర్వాత తన రాజకీయ జీవితం తెలంగాణతోనే ముడిపడి ఉందని ప్రకటించి క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలు డైనమిక్‌గా మారుతున్న సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంటికి బ్రదర్ అనిల్ ( Brother Anil kumar ) రావడం ఆసక్తి రేపుతోంది. తాను ఉండవల్లితో కుటుంబ, రాజకీయ అంశాలను చర్చించానని బ్రదర్ అనిల్ తెలిపారు.
రాజకీయ అంశాలు కూడా చర్చించానని ప్రత్యేకంగా చెప్పడంతో భేటీ యాధృచ్చికంగా నిర్వహించినది కాదని తేలిపోయింది. త్వరలో అన్ని విషయాలు చెబుతానని బ్రదర్ అనిల్ ప్రకటించారు. వైఎస్ కుటుంబానికి ఉండవల్లి అరుణ్ కుమార్ సన్నిహితులు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన వైఎస్ సంస్మరణ సభకు ఏపీ నుంచి ఎవరూ హాజరు కాలేదు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ హాజరయ్యారు. ఇటీవల సీఎం జగన్ ( CM Jagan ) పరిపాలనా తీరుపైనా విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉండవల్లితో బ్రదర్ అనిల్ ఏ అంశాలు చర్చించి ఉంటారన్నదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలంగాణలో షర్మిల పార్టీకి అనుకున్న విధంగా మైలేజీ రావడం లేదన్న అభిప్రాయం ఉంది.
ఈ విషయంలో ముందడుగు వేయడానికి ఉండవల్లి సలహాలు తీసుకోవడానికి బ్రదర్ అనిల్ వచ్చి ఉంటారని చెబుతున్నారు. అలాగే వైఎస్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా జగన్ - షర్మిల మధ్య విభేదాల పరిష్కారం కోసం ఉండవల్లి తన వంతు ప్రయత్నాలు చేయాలని కోరేందుకు కూడా వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. భేటీలో కీలకమైన అంశాలు చర్చించాం కానీ తర్వాత చెబుతామని బ్రదర్ అనిల్ చెప్పడంతో ... అసలు ఎజెండా ఏమిటన్నది మాత్రం స్పష్టత లేకుండా పోయింది. త్వరలో బ్రదర్ అనిల్ ఈ అంశాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
బ్రదర్ అనిల్ తమ ఇంటికి వచ్చి నిర్వహించిన భేటీపై ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఈ సారి ఆయన నిర్వహించే ప్రెస్‌మీట్‌లో ఈ వివరాలు వెల్లడిస్తారని భావిస్తున్నారు.