Heavy Rains: సరిహద్దు వద్ద తెగిన వంతెన - తెలుగు రాష్ట్రాల మధ్య నిలిచిన రాకపోకలు
Andhra News: ఏపీలో భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఇరు రాష్ట్రాల సరిహద్దు వద్ద పాలేరు నది ఉద్ధృతికి జాతీయ రహదారిపై వంతెన కొట్టుకుపోగా రాకపోకలు బంద్ అయ్యాయి.
Bridge Collapsed At Paleru Reservoir: ఏపీలో భారీ వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రిజర్వాయర్లన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల వర్షం తగ్గినా వరదలతో ఇళ్లలోకి నీరు చేరి జనజీవనం స్తంభించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. సీఎం ఆదేశాలతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి ఆహారం, పాలు, తాగునీరు అందించారు. అటు, గత రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలతో ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన గరికపాడు గ్రామానికి పడమర సరిహద్దుగా ప్రవహిస్తోన్న పాలేరు నదికి (Paleru River) వరద పోటెత్తింది. దీంతో జాతీయ రహదారిపై నిర్మించిన వంతెన కోతకు గురై ఇరు రాష్ట్రాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ క్రమంలో ఇరువైపులా అధికారులు వాహనాలు రాకపోకలను నియంత్రించారు. స్థానిక అధికారులు, పోలీసులు అక్కడ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వంతెనకు ఇరువైపులా వాహనాలను అడ్డుగా పెట్టారు.
ధ్వంసమైన జాతీయ రహదారి
పాలేరు జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. నది ఉద్ధృతికి కూసుమంచి వద్ద జాతీయ రహదారి ధ్వంసం కాగా.. ఖమ్మం - హైదరాబాద్ జాతీయ రహదారి కొట్టుకుపోయింది. పాలేరు జలాశయం ప్రస్తుత నీటిమట్టం 26.5 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 23 అడుగులు కాగా ఆ స్థాయిని దాటి వరద ప్రవహిస్తోంది. దాదాపు 65 వేల క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతోంది. అటు, విజయవాడ ప్రకాశం బ్యారేజీకి సైతం వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఈ క్రమంలో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నుంచి 11.36 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. కాల్వలకు 500 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. బ్యారేజీ వద్ద 24.2 అడుగుల మేర నీటిమట్టం కొనసాగుతోంది.
వరద తీవ్రత పెరుగుతుండంతో కృష్ణా నది లంక గ్రామాల పరిధిలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని లంక గ్రామాలు ఇప్పటికే పూర్తిగా నీట మునిగాయి. అప్రమత్తమైన అధికారులు ప్రభావిత ప్రాంతాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. పులిగడ్డ, దక్షిణ చిరువొల్లంక, కె.కొత్తపాలెం, బొబ్బర్లంక, ఆముదార్లంక, ఎడ్లంక తదితర గ్రామాల బాధితులను పునవారాస కేంద్రాలకు తరలించారు. వీరికి అవసరమైన ఆహారం, మంచి నీటిని అందిస్తున్నారు. వైద్య శిబిరాలను అక్కడ నిర్వహిస్తున్నారు.
కొనసాగుతోన్న సహాయక చర్యలు
మరోవైపు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం నుంచి విజయవాడలోనే ఉన్న సీఎం చంద్రబాబు వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత కూడా ఆయన బోటులో వరద బాధితులను పరామర్శిస్తూ.. వారికి ఆహారం, తాగునీరు అందించేలా చర్యలు చేపట్టారు. సీఎం ఆదేశాలతో యంత్రాంగం పరుగులు పెట్టారు. బాధితులకు సమీప కల్యాణ మండపాలు, స్కూళ్లలో పునరావాసం కల్పించారు. వారికి పాలు, తాగునీరు, ఆహారం అందేలా చర్యలు చేపట్టారు. సింగ్ నగర్ అర్ధరాత్రి, తెల్లవారుజామున సైతం సీఎం పర్యటించి పర్యవేక్షించారు. బాధితులు ధైర్యంగా ఉండాలని.. అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
Also Read: Vijayawada Flood: బెజవాడ దుఃఖదాయని బుడమేరు వరదలకు కారణమేంటీ? మానవ తప్పిదమా? ప్రభుత్వ నిర్లక్ష్యమా?