Vijayawada Floods: విపత్తు వేళ అమానవీయం - వరదల్లో బోట్ల యజమానుల దందా, తరలించేందుకు అధిక డబ్బులు వసూలు!
Vijayawada News: వర్ష బీభత్సంతో విజయవాడ నగరం పూర్తిగా నీట మునిగింది. ఇదే అదునుగా పలువురు ప్రైవేట్ బోటు యజమానులు దందాకు తెరలేపారు. సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
Boats Owners Demanding Money In Vijayawada: ఏపీలో భారీ వర్షాలతో జన జీవనం స్తంభించింది. విజయవాడ (Vijayawada) పూర్తిగా నీట మునిగింది. ఇళ్లు నీట మునిగిపోగా బాధితులు పునరావాస కేంద్రాలకు తరలివెళ్తున్నారు. అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ బాధితులకు సహాయం అందిస్తున్నారు. బోట్ల ద్వారా బాధితులకు ఆహారం అందించడం సహా పూర్తిగా నీరు ఉన్న చోట బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు, ఇదే అదనుగా కొందరు ప్రైవేట్ బోటు యజమానులు అమానవీయంగా ప్రవరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు రూ.1500 నుంచి రూ.4000 వరకూ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆపద సమయంలో ఇలా డబ్బులు డిమాండ్ చేయడం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. బోట్ల యజమానుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విజయవాడకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
మరోవైపు, భారీ వరదల నేపథ్యంలో సహాయక చర్యలు మరింత విస్తృతం చేసేందుకు విజయవాడకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. తమిళనాడు నుంచి 3, పంజాబ్ నుంచి 4, ఒడిశా నుంచి 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నగరానికి చేరుకున్నాయి. పవర్ బోట్లు, రెస్క్యూ పరికరాలతో వారు సహాయక బృందాలు విజయవాడకు చేరాయి. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో 8 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. నేవీ బృందాలు హెలికాఫ్టర్ల ద్వారా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. మరో 4 హెలికాఫ్టర్లు త్వరలోనే నగరానికి చేరుకోనున్నాయి. ప్రజలు భయాందోళనకు గురి కావొద్దని.. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉంటాయని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. వాగులు, వంకలు, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు.
సీఎం పర్యటన
అటు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నిరంతరం పర్యటిస్తున్నారు. ఆదివారం నుంచి ఆయన విజయవాడలోనే ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులకు తగు ఆదేశాలిస్తున్నారు. ఇప్పటికే వరద పరిస్థితిపై రెండుసార్లు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సోమవారం ఉదయం మరోసారి సమీక్ష అనంతరం విజయవాడ సింగ్ నగర్ ప్రాంతానికి బోటులో వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించారు. మరోసారి కలెక్టరేట్‌కు వచ్చి అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరోసారి కృష్ణలంక, జక్కంపూడి తదితర ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడి.. పునరావాసం, ఆహార పంపిణీపై ఆరా తీశారు.
ముంపు ప్రాంతాల్లో బాధితులను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బోట్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మ్యాపింగ్ చేయాలన్నారు. ఒకే ప్రాంతంలో కాకుండా మారుమూల ప్రాంతాలకు వెళ్లి సహాయం అందేలా చూడాలన్నారు. తాగునీరు, ఆహారం అందుబాటులో ఉంచాలని సూచించారు. తనతో పాటు వచ్చిన వారిని బృందాలుగా ఏర్పడి సహాయక చర్యలు పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు. తన వెంట ఉన్న మంత్రులను ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు. అక్షయపాత్ర ద్వారా ఆహారం తయారుచేయాలని.. స్థానిక హోటళ్ల యజమానులతోనూ మాట్లాడి ఆహారం, తాగునీరు అందుబాటులోకి ఉంచాలని సూచించారు.