Janasena Brand Cycles : మార్కెట్లో జనసేన బ్రాండ్ సైకిల్స్ - భీమవరంలో యువత హల్ చల్ !
జనసేన బ్రాండ్ సైకిళ్లతో భీమవరం యువత సందడి చేస్తోంది. ఈ సైకిళ్లు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.
Janasena Brand Cycles : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లో తిరుగుతున్నా ఆయనకు ఫాలోయింగ్ తగ్గడం లేదు. ఇంకా పెరుగుతోంది. జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడం కాదు.. స్వయంగా జనసేన ను బ్రాండ్ గా మార్చడానికి కొంత మంది యువత తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. భీమవరంలో ఓ సంస్థ జనసేన బ్రాండ్ మీద సైకిళ్లను తయారు చేస్తోంది. జనసేన రంగులు, స్టిక్కర్లతో చూస్తేనే జనసేన రంగులు గుర్తు వచ్చేలా మార్కెట్లో ప్రవేశ పెట్టింది. పవన్‌కల్యాణ్ మూడు రోజులుగా భీమవరంలో బస చేశారు. దీంతో భీమవరంలో కొందరు యువత ఈ సైకిళ్లపై ర్యాలీ నిర్వహిస్తూ సందడి చేస్తున్నారు.
పవన్ కల్యాణ్‌పై గౌరవం, జనసేన పార్టీపై అభిమానంతో పలువురు పెద్ద మొత్తంలో ఖర్చ పెట్టి అయినా ఇలాంటి సైకిళ్లు తయారు చేయించుకుంటున్నారు. గతంలో నెల్లూరు అభిమాని ఒకరు సుధాకర్ మాధవ్ రూ. 40 లక్షలు పెట్టుబడి పెట్టి జనసేన సైకిళ్లు అందుబాటులోకి తెచ్చారు. ఓవైపు పవన్ కల్యాణ్ ఫోటో, మరోవైపు జనసేన పేరు మధ్యలో ఆ పార్టీ సింబల్ అయిన గాజు గుర్తుతో సుధాకర్ మాధవ్ అనే సైకిల్ షాపు యాజమాని సైకిళ్లను డిజైన్ చేయించి విక్రయిస్తున్నారు. సైకిళ్ల కంపెనీ వారితో మాట్లాడి వీటిని తయారు చేయిస్తున్నారు సుధాకర్ మాధవ్. పంజాబ్‌లోని లూథియానా నుంచి ఈ సైకిళ్లను దిగుమతి చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముతున్నారు. మంచి డిమాండ్ ఉండటంతో ఇతరులు కూడా కొంత మంది జనసేన సైకిళ్ల తయారీకి ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.
మరో వైపు పవన్ కల్యాణ్ వారాహి యాత్ర తొలి విడత నేటితో ముగియనుంది. భీమవరం సభలో పవన్ పాల్గొంటున్నారు. గత ఎన్నికల్లో బీమవరం నుంచి పవన్ పోటీ చేశారు. మరోసారి అక్కడి నుంచే పోటీ చేసి ప్రజల ఆదరణ పొందాలని అనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై శుక్రవారం సభలో ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే సమయంలో వైసీపీకి ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఒక్క సీటు కూడా దక్కకుండా చూస్తామని చెబుతున్న పవన్..ఇక్కడే పోటీకి సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసారు. రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. ఈ సారి పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది. తిరిగి గోదావరి జిల్లాల్లోని ఒక స్థానంతో పాటుగా తిరుపతి నుంచి పోటీకి దిగుతారనే అంచనాలు ఉన్నాయి. గతంలో భీమవరం నుంచి పోటీ చేయటంతో ఈ సారి తూర్పు గోదావరి పిఠాపురం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తిరిగి భీమవరం నుంచే పోటీ చేయాలనే ఆలోచనతో పవన్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎక్కడ ఓడారో...తిరిగి అక్కడే తిరిగి గెలవాలనే పట్టుదలతో పవన్ ఉన్నట్లుగా పార్టీ నేతల సమాచారం. ఈ మేరకు ఈ రోజు భీమవరంలో జరిగే వారాహి తొలి విడత ముగింపు సభలో పవన్ కల్యాణ్ ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.
అయితే పొత్తుల వ్యహహారాలు కొలిక్కి వచ్చే వరకూ ఎలాంటి ప్రకటనా ఉండదని జనసేనలోని మరో వర్గం చెబుతోంది.