Bandaru Issue : అరెస్ట్ చేయరు - వదిలి పెట్టరు - వేధిస్తున్నారని పోలీసులపై ఫిర్యాదు చేసిన బండారు సతీమణి !
పోలీసులు నిర్బంధించి వేధిస్తున్నారని పోలీసు స్టేషన్‌లో బండారు సత్యనారాయణ మూర్తి సతీమణి ఫిర్యాదు చేశారు. నోటీసు కూడా ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Bandaru Issue : మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అరెస్ట్ చేస్తామని విశాఖ జిల్లా పరవాడలోని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేసే ప్రయత్నం చేయలేదు. అలాగని ఆయనను బయటకూ వెళ్లనీయలేదు. ఓ రకంగా నిర్బంధించారు. ఇంటికి వచ్చే వారిని రానివ్వలేదు. దీంతో బండారు సత్యనారాయణ మూర్తి సతీమణి పోలీసులుక ఫిర్యాదు చేశారు. ఏ నోటీసూ ఇవ్వకుండా రాత్రి నుంచి పోలీసులు తమను నిర్బంధించారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డీఎస్పీ సత్యనారాయణ, పోలీసులు తమను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. ఫిర్యాదు పత్రాన్ని స్వయంగా వెళ్లి స్టేషన్ లో అందించారు .
మానసికంగా వేధిస్తున్నారని ఆరోపణలు
మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనను అరెస్ట్ చేయాలని మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ డీజీపీకిలేఖ రాశారు. అదే సమయంలో పలువురు వైసీపీ నేతలు గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బండారు సత్యనారాయణపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయన ఇంటిని ఆదివారం సాయంత్రం పోలీసులు చుట్టుముట్టారు. రాత్రంగా ఆ ఇంటిలోని నిర్బంధించారు. సోమవారం కూడా ఆ నిర్బంధం కొనసాగింది. టీడీపీ నేతలు కొంత మంది వచ్చినా వారిని ఇంట్లోకి అనుమతించలేదు. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు ప్రారంభమ్యాయి. అరెస్ట్ చేస్తే చేయవచ్చు కానీ ఇలా ఇంటిని చుట్టుముట్టి నిర్బంధంలో ఉంచి వేధించడమేమిటన్న విమర్శలు టీడీపీ వర్గాల నుంచి వస్తున్నాయి.
బండారు ఇంటి వద్ద భారీగా పోలీసులు
బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొని ఉంది. పోలీసులు - టీడీపీ నేతల మధ్య బాగా తోపులాట జరిగింది. బండారు ఇంటిని పోలీసులు చుట్టుముట్టడంతో ఆ ప్రదేశానికి టీడీపీ కార్యకర్తలు, నేతలు భారీగా చేరుకున్నారు. బండారు ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటూ పోలీసులను కార్యకర్తలు అడ్డుకున్నారు. బీపీ, షుగర్ లేవెల్స్ పెరగడంతో ఆర్కే హాస్పిటల్ కు తరలించాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. అరెస్ట్ చేస్తారా లేదా అన్నది చెప్పడం లేదు. 65 ఏళ్ల వయసు ఉన్న బండారు సత్యనారాయణకు 41ఏ నోటీస్ ఇస్తామని అంటున్నారు.
రోజా బ్లూ ఫిల్మ్‌లు ఉన్నాయన్న బండారు
నందమూరి, నారా కుటుంబాలపై వైసీపీ మంత్రి రోజా చేసిన అమర్యాద వ్యాఖ్యలను ఖండిస్తూ రెండు రోజుల కిందట మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మీడియా సమావేశం ఏర్పాటు చేసి రోజాపై ఘాటు విమర్శలు చేశారు. ‘ఎన్టీఆర్ కుటుంబంపై, భువనేశ్వరి, బ్రాహ్మనీలపై మాట్లాడే అర్హత నీకు లేదు. రోజా... నువ్వు సినిమాల్లో ఎలా నటించావో నాకు తెలుసు. నీ చరిత్ర ఎవరికి తెలియదు. నీ బాగోతం బయటపెడితే నీ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటారు.ఇవాళ నీతి సూత్రాలు, పతివ్రత కామెంట్స్ చేస్తోందని మండిపడ్డారు. తమ వద్ద నీ పూర్తి బండారం ఉందన్నారు. రోజా గతంలో బ్లూ ఫిల్ములలో నటించిందని, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ఆనాడు మిర్యాలగూడలో జరిగిన ఎన్నికల ప్రచారానికి వచ్చిన సంగతి మరిచి పోయావా అని ప్రశ్నించారు. ఎలక్షన్స్ కోసం వచ్చి ఎవరి వద్ద పడుకున్నావో, ఎన్ని లాడ్జీలు తిరిగావో తమకు తెలుసని, అన్ని వివరాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే. ఈ కామెంట్లు వైరల్‌గా మారడంతో.. మహిళా కమిషన్ స్పందించింది.