Kotamreddy TDP : వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తా - కోటంరెడ్డి శ్రీధర్ ఆడియో లీక్ !
వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తాననని చెబుతున్న వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆడియో వైరల్ అవుతోంది.
Kotamreddy TDP : తన ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపిస్తున్న సమయంలోనే ఆయన ఫోన్ ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. వచ్చే 2024 ఎన్నికల్లో తాను నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ ఆడియోలో తన సన్నిహితులతో చెబుతున్నారు. ఈ ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభుత్వం తన ఫోన్ ను ట్యాపింగ్ చేస్తోందని ట్యాపింగ్ అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఆధారాలు బయటపెడితే ఇద్దరు ఐపీఎస్ ల ఉద్యోగాలు పోతాయన్నారు. మీ అందరి సహకారంతో వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఆ కాల్‌లో కోటంరెడ్డి చెప్పుకొచ్చారు.
గతంలో ఓసారి సీఎం జగన్, ఎమ్మెల్యే కోటంరెడ్డిని వ్యక్తిగతంగా పిలిపించుకుని మాట్లాడినప్పుడే ఈ ట్యాపింగ్ వ్యవహారంపై కోటంరెడ్డికి అనుమానం వచ్చినట్టుందని ఆయన సన్నిహితులు చెబుతున్నరా.ు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాలన్నిటినీ జగన్ ఆ భేటీలో బయటపెట్టే సరికి ఏదో జరుగుతుందనే డౌట్ కోటంరెడ్డికి వచ్చిందని అంటున్నారు. ఆ తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డికి వైసీపీ సేవాదళ్ పదవి రావడంతో అప్పటికి ఆ వివాదం సమసిపోయినట్టయింది. కోటంరెడ్డి కుటుంబానికి జగన్ ప్రాధాన్యత ఇచ్చారని, దీంతో కోటంరెడ్డి కూడా ఇక అసంతృప్తిని పక్కనపెడతారని అనుకున్నారు. కానీ ఆయన వైసీపీలో కుదురుకోలేకపోయారు.
గత రెండు, మూడు రోజుల నుంచి కోటంరెడ్డి ప్రభుత్వంపై ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారు. తాజా ఫోన్ కాల్ వ్యవహారం వెలుగులోకి రావడంతో కోటంరెడ్డి దాదాపుగా పార్టీని వీడిపోతున్నారనే వార్తలకు బలం చేకూరుతోంది. కోటంరెడ్డి రూరల్ నాయకులతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. పార్టీలో అవమానాలు పడ్డామని వారి వద్ద కోటంరెడ్డి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇంకా అవమానాలు పడాలా అని అనుచరుల వద్ద ఆయన ప్రశ్నించారని సమాచారం. ఈ దశలో పార్టీ మారడం ఒక్కటే ఆయన ముందున్న ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. అందుకే కోటంరెడ్డి కీలక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.
మంత్రి పదవి విషయంలోనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురికి మంత్రి పదవులు వచ్చాయి. తొలి విడత అనిల్ కుమార్ యాదవ్, గౌతమ్ రెడ్డికి మంత్రి పదవులిచ్చారు. మలి విడత కేవలం కాకాణి గోవర్దన్ రెడ్డికి పదవులిచ్చారు. కోటంరెడ్డి కూడా పదవి ఆశించి భంగపడ్డారు. కానీ పార్టీలోనే కొనసాగారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అయిఉండి కూడా కొన్ని పనుల్ని కోటంరెడ్డి చేయించుకోలేకపోయారని అంటున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా కూడా పనులు చేయించుకోలేకపోతే ఇక తన పదవికి అర్హత ఏముందని ఆయన భావించారు. అందుకే అధికారులతో పలు సందర్భాల్లో గొడవపడ్డారు. వారిపై ఆరోపణలు కూడా చేశారు. కానీ అధిష్టానం ఈ ఆరోపణల్ని వ్యతిరేకంగా అర్థం చేసుకుంది. ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారనే కోణంలో కోటంరెడ్డినే టార్గెట్ చేసిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.