బ్యానర్లు అన్నీ వైసీపీ బ్లాక్ చేయడం కవ్వింపు చర్యలే, అంతా ఎంపీ పని - అచ్చెన్నాయుడు ఆగ్రహం
రాజమహేంద్రవరం శివారు వేమగిరిలో జాతీయ రహదారి పక్కన మహానాడు వేదిక నిర్మాణానికి భూమిపూజ చేశారు.
తెలుగు దేశం మహానాడు నిర్వహిస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని తెలగు దేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. బ్యానర్లు కట్టుకునేందుకు హోర్డింగ్ లు కూడా ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
మహానాడుకు భూమి పూజ
రాజమహేంద్రవరం శివారు వేమగిరిలో జాతీయ రహదారి పక్కన మహానాడు వేదిక నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు హజరయ్యారు. తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు భూమి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు నభూతో నభవిష్యత్ అన్న చందంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. 27వ తేదీన 15 వేల మంది ప్రతినిధులతో తెలుగుదేశం మహానాడు నిర్వహిస్తామని, 28వ తేదీన తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల ముగింపు 15 లక్షల మందితో ఘనంగా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ శత జయంతి 100 సభలు నిర్వహించామని తెలిపారు.
తొలిరోజు ప్రతినిధుల సభలో వైసీపీ పాలనకు వ్యతిరేకంగా 15 తీర్మానాలు ప్రవేశపెడతామని తెలిపారు. జగన్ అరాచక పాలన, అవినీతి, మైన్స్, శాండ్, ప్రకృతి వనరుల దోపిడీకి వ్యతిరేకంగా తీర్మానాలు చేస్తామని ప్రకటించారు. తెలుగుదేశం మహానాడు ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమవుతుంటే, వైసీపీ కవ్వింపు చర్యలకు దిగుతోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ఈ నెలాఖరు వరకు రాజమండ్రి సిటీతో పాటు పరిసర ప్రాంతాల హోర్డింగులన్నీ బ్లాక్ చేసి, టీడీపీ వారికి బోర్డులు ఇవ్వరాదని అడ్వర్టయిజ్మెంట్ ఏజెన్సీలకు హుకుం జారీ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. వైసీపీ కవ్వింపు చర్యలు ఆపకపోతే ప్రజలలో తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు. మహానాడు విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర కమిటీలు వేశామని, జిల్లా స్థాయిలో కూడాా కమిటీలు వేసి అందరి సహకారం తీసుకుంటామని చెప్పారు.
జగన్ పాలన పోవాలి, చంద్రబాబు రావాలి - కళా వెంకటరావు
రాష్ట్ర టీడీపీ మాజీ అధ్యక్షులు కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ తెలుగుదేశం అధినేత ఎన్టీఆర్ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి చాటిచెబితే, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పెద్దల కాళ్ళ మీద పడి తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ పాలన పోవాలి.. మళ్ళీ చంద్రబాబు పాలన రావాలి.. అని ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. దళిత, బలహీన వర్గాల సంక్షేమం కోసం చంద్రబాబు పాలన రావాలన్నారు. జగన్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకు ఈ మహానాడు నాంది పలుకుతుందన్నారు.
మహానాడు అపూర్వ అద్యాయం - గోరంట్ల
రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. భారతదేశ చరిత్రలోనే మహానాడు ఒక అపూర్వ అధ్యాయం అని అభివర్ణించారు. అన్న ఎన్టీఆర్ జన్మదినాన్ని మహానాడు పండుగగా జరుపుకోవడం తెలుగు ప్రజలందరికీ ఆనందదాయకమని అన్నారు. మహానాడు ఆతిథ్యానికి సిద్ధంగా ఉన్నామని, గోదావరి పుష్కరాలకు వచ్చిన అతిధులను ఆదరించిన తరహాలో అందరినీ ఆదరిస్తామని తెలిపారు. రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాల పరిధిలో కూడాా మహానాడు కమిటీలు వేస్తామని, అందరూ ఈ పండుగ విజయవంతంలో భాగస్వాములు కావాలని కోరారు.
జగన్ ను తరిమి కొడతాం - నిమ్మకాయల
పెద్దాపురం ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ మహానాడు కార్యక్మర్తల పండుగ అని, మహానాడు, ఎన్టీఆర్ వందో పుట్టిన రోజు వైభవంగా నిర్వహించేందుకు ఉభయగోదావరి జిల్లాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జగన్ ను తరిమికొట్టి, చంద్రబాబును సిఎం చేస్తామని ప్రజలే చెబుతున్నారని అన్నారు. జగన్ ఓటమే ధ్యేయంగా విపక్షాలు పని చేస్తున్నాయని, జనసేనాని పవన్ కళ్యాణ్ కూడాా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామని ప్రకటించారని చెప్పారు.