AP Formation Day 2023: రాష్ట్ర పండుగగా ఏపీ అవతరణ దినోత్సవం, క్యాంప్ ఆఫీసులో వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్
AP Formation Day 2023: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఏపీ ముస్తాబవుతోంది. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం, విజయవాడలోని రాజ్ భవన్‌లో వేడుకలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
AP Formation Day 2023: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఏపీ ముస్తాబవుతోంది. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం, విజయవాడలోని రాజ్ భవన్, అన్ని జిల్లాల కేంద్రాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే వేడుకలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ ఒకటో తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరపాలని జగన్ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అవతరణ వేడుకలను రాష్ట్ర ఉత్సవంగా అత్యంత వైభవంగా జరపాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లకు, ఎస్పీలకు సాధారణ పరిపాలన శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అత్యంత ఘనంగా జరపాలని జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో పాటుగా ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కూడా రాష్ట్ర అవతరణ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం రోజున సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఉ.10 గంటలకు ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు.
రాజ్‌భవన్‌లో జరిగే వేడుకల్లో గవర్నర్ పాల్గొంటారు. ఇందుకోసం ఏర్పాట్లుచేయాల్సిందిగా సంబంధిత శాఖలను సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) ముఖ్యకార్యదర్శి ముత్యాలరాజు ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్, ముఖ్యమంత్రి తమ సందేశాలను అందజేయనున్నారు. ముఖ్యమంత్రి, గవర్నర్ ప్రసంగాలకు సంబంధించి ప్రొటోకాల్ విభాగం, సమాచార పౌర సంబంధాల శాఖ సమన్వయంతో పనిచేయాలని అందులో పేర్కొన్నారు. తెలుగు సంస్కృతిని ప్రతిబింభించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాష్ట్ర విభజన తరువాత ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదు. రాష్ట్ర విభజన అమల్లోకి వచ్చిన అపాయింట్ డే అయిన జూన్ 2 ను రాష్ట్ర అవతరణ దినోత్సవం కాకుండా నవ నిర్మాణ దీక్ష చేపట్టేవారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా విజయవాడ బెంజి సర్కిల్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం నవ నిర్మాణ దీక్షలు చేపట్టింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ ఏపీలో కలవక ముందు ఉన్నప్పటి అవతరణ దినోత్సవం రోజు.. నవంబర్ ఒకటో తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.