(Source: ECI/ABP News/ABP Majha)
Budameru: బుడమేరు గండ్లు పూడ్చివేత - విజయవాడకు తప్పిన వరద ముప్పు
Vijayawada Floods: బుడమేరు గండ్ల పూడ్చివేత ప్రక్రియ పూర్తైంది. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయగా సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారులను ప్రశంసించారు.
Budameru Gandi Burial Completed: బుడమేరు (Budameru) గండ్ల పూడ్చివేత పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఈ క్రమంలో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోయి విజయవాడకు (Vijayawada) ముప్పు తప్పినట్లయింది. ఇప్పటికే రెండు గండ్లు పూడ్చివేయగా.. తాజాగా మైలవరం నియోజకవర్గం కొండపల్లి కవులూరు వద్ద తాజాగా మూడో గండిని పూడ్చేశారు. అంతకుముందు మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పనులను పరిశీలించారు. వరద ఉద్ధృతి పెరిగిన క్రమంలో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేశారు. ప్రవాహం ఉద్ధృతంగా ఉన్న సమయంలోనే రెండు గండ్లను పూడ్చేశారు. ఇటీవల భారీ వర్షాలకు ఒక్కసారిగా 60 వేల క్యూసెక్కుల వరద రావడంతో బుడమేరు డైవర్షన్ ఛానల్‌కు గండ్లు పడ్డాయి. కాగా, మూడో గండి మాత్రం పెద్దది కావడంతో దాన్ని పూడ్చడానికి పలు ఏజెన్సీలతో పాటు భారత సైన్యం రంగంలోకి దిగింది. చెన్నైకు చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్‌కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు దాదాపు 120 మంది ఇక్కడకు వచ్చి పనులు చేపట్టారు.
గేబియన్ బుట్టల ద్వారా..
బుడమేరు (Budameru) గండ్లను గేబియాన్ బుట్టల (ఇనుప చువ్వలతో బుట్టలా చేసి దానిని పెద్ద రాళ్లు, ఇసుక బస్తాలతో నింపే ప్రక్రియ) ద్వారా పూడ్చారు. మూడో గండి 80 నుంచి 100 మీటర్లు ఉండగా.. బుట్టల ద్వారా పూడ్చినట్లు సైన్యం వెల్లడించింది. వీటిని పటిష్టంగా ఉంచేలా 4 మీటర్ల వరకూ రక్షిత కట్ట నిర్మిస్తామని తెలిపింది. కాగా, గత కొద్ది రోజులుగా జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) బుడమేరు గండ్ల వద్దే ఉండి రాత్రనక, పగలనకు గండ్ల పూడ్చివేత పనులను పర్యవేక్షించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అధికారులు, సిబ్బందిని పరుగులు పెట్టించారు. ముంపు నుంచి నగరం తేరుకునే వరకూ వెళ్లేది లేదంటూ అక్కడే కాల్వ గట్లపై ఉండి పని చేశారు. ప్రస్తుతం గండ్ల పూడ్చివేతతో వరద ప్రవాహం తగ్గి భారీ ఉపశమనం లభించినట్లయింది. మరోవైపు, బుడమేరు గండ్ల పనులను విజయవంతంగా పూర్తి చేసిన మంత్రులు, అధికారులను సీఎం చంద్రబాబు (CM Chandrababu) అభినందించారు. అతి పెద్ద సవాల్‌ను ఎదుర్కొని పని చేశారని ప్రశంసించారు.
'మళ్లీ సమస్య రాకుండా..'
సీఎం చంద్రబాబు గత కొద్ది రోజులుగా 24 గంటలూ కలెక్టరేట్‌లోనే ఉండి పనులు పర్యవేక్షించారని మంత్రి నిమ్మల తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నిరంతరం కష్టపడ్డామని.. గండ్ల పూడ్చివేతతో ముప్పు తప్పినట్లయిందని అన్నారు. వర్షం పడితే మళ్లీ సమస్య రాకుండా కట్ట ఎత్తు పెంచుతామని.. ఈ పనులు వెంటనే చేపడతామని చెప్పారు. విజయవాడలో ఉన్న నీరు క్రమంగా తగ్గుతోందని.. అవసరమైతే మోటార్లు పెట్టి నీటిని తోడిపోస్తామని పేర్కొన్నారు.
విజయవాడ నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో బురదను ఫైరింజన్ల సాయంతో తొలగిస్తున్నారు. అనంతరం చెత్తా చెదారాన్ని క్లీన్ చేస్తున్నారు. అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నారు. డ్రోన్ల ద్వారా బ్లీచింగ్ స్ప్రే చేస్తున్నారు. అటు, ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ప్రభుత్వం నిత్యావసరాల కిట్ అందిస్తోంది. ఇంకా వరద తగ్గని కొన్ని చోట్ల పునరావాస కేంద్రాలు కొనసాగుతున్నాయి. అక్కడి బాధితులకు ఆహారం, తాగునీరు అందిస్తున్నారు. నగరంలోని చాలా ప్రాంతాలు ఇప్పుడిప్పుడే పూర్తిగా వరద నుంచి కోలుకుంటున్నాయి.
Also Read: Nellore News: విజయవాడ వరద బాధితులకు నెల్లూరోళ్ల చిరు సాయం