Tadipatri Mews : డీఎస్పీ వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి - తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో డీఎస్పీ, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వాదోపవాదాలు చోటు చేసుకుంటున్నాయి. సేవ్ తాడిపత్రి పేరుతో నిరసనలకు ప్రభాకర్ రెడ్డి రెడీ అయ్యారు.
Tadipatri Mews : అనంతపురం జిల్లా తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య వ్యవహారశైలిపై మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి పోరుబాట పట్టారు. ఆయన ప్రోద్భలంతోనే టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని..దళిత నేతల్ని టార్గెట్ చేశారని ఆయనపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఎలాంటి కేసుకైనా రూ. లక్ష తీసుకుంటారని డీఎస్పీపై మండిపడ్డారు. డీఎస్పీ చైతన్య కూడా రాజకీయ పరమైన ఆరోపణలు చేయడంతో పరిస్థితి జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ డీఎస్పీ చైతన్య అన్నట్లుగా మారింది. తనపై నిరాధార ఆరోపణలు చేశారని ఉన్నతాధికారుల అనుమతితో తాను కోర్టును ఆశ్రయిస్తనని డీఎస్పీ ప్రకటించారు. ఈ మాటల మంటలు ఇలా ఉండగానే ..పోలీసుల తీరుకు నిరసనగా జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్లతో కలిసి సేవ్ తాడిపత్రి నినాదంతో నిరసనకు సిద్ధమయ్యారు.
రాజకీయంగా ఎప్పుడూ ఉద్రిక్తంగానే తాడిపత్రి
రాజకీయంగా ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉండే నియోజకవర్గం తాడిపత్రి. ఇటీవల తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు దళిత కౌన్సిలర్లపై దాడులు జరిగాయి. ఆ దాడుల్లో డీఎస్పీ చైతన్య ప్రమేయం ఉందని ఆ కౌన్సిలర్లు ఆరోపించారు. ఇటీవలి కాలంలో డీఎస్పీ చైతన్య ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెప్పినట్లుగా చేస్తున్నారని.. టీడీపీ నేతల్ని రాజకీయంగా వేధిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రెండు రోజుల కిందట భారీ ర్యాలీ నిర్వహించి స్టేషన్ ముందు ధర్నాకు దిగడంతో కొన్ని గంటలపాటు హైటెన్షన్ సిట్యువేషన్ కొనసాగింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ ఘటన జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు.
ఎమ్మెల్యే , మున్సిపల్ చైర్మన్ మధ్య నలిగిపోతున్న అధికారులు
తాడిపత్రి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి పెద్దారెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత జరగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున కౌన్సిలర్‌గా పోటీ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. కౌన్సిలర్లు కూడా టీడీపీ వారే ఎక్కువగా ఉండటంతో ఆయనే మున్సిపల్ చైర్మన్ అయ్యారు. అప్పట్నుంచి ఎమ్మెల్యే వర్సెస్ మున్సిపల్ చైర్మన్ వర్గాల మధ్య పోరు బహిరంగం అయింది. ఇద్దరికీ అధికార పదవులు ఉండటంతో వారి మధ్య యంత్రాంగం నలిగిపోతోంది. అభివృద్ధి పనుల విషయంలో ఒకరి అభిప్రాయానికి మరొకరికి పొంతన ఉండటం లేదు. అధికారులందరూ ఎమ్మెల్యే సిఫార్సులతో వచ్చి చేరిన వారే కావడంతో ఎక్కువ మంది ఆయన చెప్పినట్లే వింటున్నారు.
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జేసీ వర్గం ఆరోపణలు
పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారిపై దాడులు చేస్తున్నా చలనం ఉండటం లేదని కానీ ఏదైనా జరిగితే ముందుగా టీడీపీ వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. పాత కేసుల విషయంలోనూ ఇదే పద్దతి పాటిస్తున్నారని మండిపడుతున్నారు. డీఎస్పీ చైతన్య.. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మల్యే టిక్కెట్ కోసం ఇలా చేస్తున్నారని ఆయన అంటున్నారు. డీఎస్పీ చైతన్య కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితి రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతోంది.