Disha law : "దిశ" బిల్లుపై ఏపీదే ఆలస్యమన్న కేంద్రం..!
దిశ బిల్లు విషయంలో తమ ఆలస్యం లేదని కేంద్రం స్పష్టం చేసింది. తాము అడిగిన వివరణలు ఏపీ సర్కార్ ఇవ్వలేదని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మహిళల భద్రతపై ప్రత్యేకమైన శ్రద్ద ఉంది. అందుకే ఆయన ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే.. పొరుగు రాష్ట్రం తెలంగాణలో దిశ ఘటన జరిగితే... తమ రాష్ట్రంలో "దిశ" పేరుతో ఏకంగా చట్టాన్నే తీసుకువచ్చారు. అయితే ఆయన ప్రయత్నాలు ఇంత వరకూ పూర్తి స్థాయిలో ఫలించలేదు. ఆ చట్టం ఇంకా అధికారికంగా చట్టంగా రూపొందలేదు. కేంద్రం దగ్గరే పెండింగ్‌లో ఉంది. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్... లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కూడా లిఖిత పూర్వకంగా సమాధానం పంపారు. దిశ చట్టంపై కేంద్రానికి వచ్చిన అభ్యంతరాలు.. అనుమానాలను నివృతి చేయామని ఏపీ సర్కార్‌కు సమాచారం పంపామని ఇంకా వివరణ రాలేదని స్పష్టం చేశారు. దీంతో ఏపీ సర్కార్ కారణంగానే ఆలస్యం అవుతోందని కేంద్రం చెప్పినట్లు అవుతోంది.
ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని రెండు సార్లు వెనక్కి పంపింది. దీంతో దాన్ని ఉపసంహరించుకుని కొత్త బిల్లును మళ్లీ ప్రవేశ పెట్టింది . . కొత్త బిల్లులో చట్టం అనే పదం కూడా తీసేశారు. దిశ బిల్లు లక్ష్యం...మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడమే. 21 రోజుల్లోనే శిక్షలు వేయడం..ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడం వంటివి చేస్తారు. ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంటుంది. ఉపసంహరించుకునన బిల్లులో 14 రోజుల్లో కోర్టుల్లో విచారణ.. 21 రోజుల్లో శిక్ష ఖరారు అని ఉంది. అలాగే వివిధ చట్టాల్లోని సెక్షన్లను మార్చారు. కొత్త చట్టంలో .. నిర్భయ చట్టం-2012, పోక్సో చట్టం, ఐపీసీ-1860, సీపీసీ-1973ల పరిధిలోనే కేసుల నమోదు చేయాలని సూచించారు. ఆ తర్వాత న్యాయమూర్తుల నియామకానికి వారికి సౌకర్యాల గురించి ప్రస్తావించారు. అయినా కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది. వాటిని ఏపీ సర్కార్ క్లియర్ చేయడం లేదు.
దిశ గురించి సీఎం జగన్ తరచూ సమావేశాలు ఏర్పాటు చేస్తూంటారు. ఇటీవల దిశ అవగాహన కోసం పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు. దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలని పోలీసుల్ని ఇంటింటికి పంపి.. మహిలళను చైతన్యవంతులను చేస్తున్నారు. అయితే ఇంత జరిగినా... ఇంత వరకూ దిశ చట్టం అమల్లోకి రాలేదు. ప్రభుత్వం ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడం లేదు. నేడో రేపో ఆమోదం వస్తుందన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. అయితే దిశ బిల్లు చట్టంగా మారడం చాలా కష్టమని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రశ్న ద్వారా మరోసారి స్పష్టమయిందని భావిస్తున్నారు.