Breaking News Live Telugu Updates: ఇండోర్ లో రామనవమి ఆలయంలో ప్రమాదం- బావిలో పడ్డ 25 మందికి భక్తులు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
Todays Weather News: ద్రోణి నేడు ఉత్తర మధ్యప్రదేశ్ మధ్య భాగాల నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతూ ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
నేడు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. వచ్చే 5 రోజులు కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందని తెలిపారు. నిన్న సిద్దిపేటలో అక్కడక్కడ వడగళ్ల వాన కురిసింది. వచ్చే నెల 2 వరకూ ఎల్లో అలర్ట్ అమల్లో ఉంటుందని చెప్పారు.
హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశల నుంచి గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.6 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 78 శాతం నమోదైంది.
ఏపీలో వర్షాలు ఇలా
ఏపీలో నేడు ఎక్కడా వర్షాలు పడే అవకాశం లేదని అమరావతిలోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉరుములు, మెరుపులు లాంటి వాతావరణంతో పాటు బలమైన గాలులు దాదాపు 30 నుంచి 40 కిలో మీటర్ల వరకూ వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఉత్తర కోస్తా, యానం, దక్షిణ కోస్తాలోని అన్ని జిల్లాల్లో ఈ రకమైన వాతావరణం ఉంటుందని తెలిపారు. వచ్చే 5 రోజుల పాటు ఇదే రకం వాతావరణ పరిస్థితి ఉంటుందని తెలిపారు.
ఢిల్లీలో వాతావరణం ఇలా..
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షాల కారణంగా గురువారం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలో గురువారం ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎండ తీవ్రత నుంచి ప్రజలు ఉపశమనం పొందుతారని భావిస్తున్నారు.
తాజాగా వెస్ట్రర్న్ డిస్ట్రర్బెన్స్ ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి వర్షం, మేఘావృతమైన వాతావరణాన్ని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. IMD ప్రకారం, నేటి కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది. బుధవారం కనిష్ట ఉష్ణోగ్రత 16.2 డిగ్రీలు, 33.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. IMD ప్రకారం, వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ కారణంగా, ఢిల్లీతో సహా మొత్తం ఉత్తర భారతదేశంలో వాతావరణంలో మార్పులు ఉన్నాయి. రానున్న మూడు రోజుల పాటు ఢిల్లీలో మేఘావృతమై ఉంటుందని అంచనా. మార్చి 30న ఢిల్లీలో మేఘాలు కమ్ముకోవడం వల్ల పగటి ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలాగే రాత్రిపూట చినుకులు పడే అవకాశం ఉంది.
ఇండోర్ లో రామనవమి ఆలయంలో అపశృతి- పైకప్పు కూలి 25 మందికిపైగా దుర్మరణం
బేలేశ్వర్ మహదేవ్ జులేలాల్ ఆలయం పైకప్పు కూలి 25 మందికిపైగా బావిలో పడిపోయారు. శ్రీరామనవమి రోజున ఇండోర్లో ఘోర ప్రమాదం జరిగింది. స్నేహ్ నగర్ సమీపంలోని పటేల్ నగర్ లోని శ్రీ బెలేశ్వర్ మహదేవ్ జులేలాల్ ఆలయం పైకప్పు కూలడంతో 25 మందికి పైగా బావిలో పడిపోయారు. బావిలో పడిన వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.
Sriramanavami: పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీరామనవమి వేడుకల్లో అపశ్రుతి
పశ్చిమగోదావరి జిల్లాలో జరుగుతున్న శ్రీరామనవమి వేడుకల్లో భారీ అపశ్రుతి చోటు చేసుకుంది. దువ్వలోని స్థానిక వేణుగోపాల స్వామి ఆలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన చలువ పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. మంటలను ముందుగానే గమనించి భక్తులు అప్రమత్తమై బయటకు వచ్చేశారు. దీంతో పెద్ద ప్రాణ నష్టం తప్పింది.
Kadapa: కడప ఒంటిమిట్ట కోదండరాముణ్ణి దర్శించుకున్న ప్రముఖులు
కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీ కోదండరాముణ్ణి మంత్రి అంబటి రాంబాబు, రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి ఇతర ముఖ్య నేతలు దర్శించుకున్నారు. పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
Bhadradri Kalyanam: వైభోగంగా సీతారామ కల్యాణం
భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారి కల్యాణోత్సవం వైభవోపేతంగా సాగుతుంది. వేదమంత్రోచ్ఛారణలతో వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా స్టేడియం వద్దకు తీసుకొచ్చారు. అభిజిత్ లగ్నంలో సీతమ్మ మెడలో శ్రీరాముడు మాంగళ్యధారణ చేయనున్నారు. సీతారాముడి కల్యాణాన్ని వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
స్వామివారి కల్యాణ వేడుకకు హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హైకోర్టు న్యాయమూర్తి నవీన్ రావు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు హాజరయ్యారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు కల్యాణ ఘట్టం జరగనుంది.
Suryapet District: రాజధాని ఏసీ బస్సులో మంటలు, నడిరోడ్డుపై తగలబడ్డ బస్సు
సూర్యాపేట జిల్లాలో టీఎస్ ఆర్టీసీకి చెందిన రాజధాని ఏసీ బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో ప్రయాణికులు బస్సులో నుంచి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల ప్రకారం.. సూర్యాపేటలోని మొద్దుల చెరువులోని ఇందిరా నగర్ వద్ద రాజధాని ఏసీ బస్సులో మంటలు చెలరేగాయి. అయితే, బస్సు రోడ్డుపై వెళ్తున్న స్కూటీని ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కాగా, బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఎన్‌హెచ్-65పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.