Breaking News Live Updates: తిరుపతిలో ఈదురుగాలుల బీభత్సం, రేణిగుంటలో విమాన రాకపోకలకు అంతరాయం
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఓవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు అల్పపీడనం ప్రభావంతో తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న అల్పపీడన ద్రోణి ప్రభావం తగ్గింది. ప్రస్తుతం వాయువ్య మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమోరిన్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉంది. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాలలో ఉపరిత ఆవర్తనం మద్య ట్రోపో ఆవరణం వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో నేడు (మే 6న) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. తదుపరి 48 గంటలలో వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాం..
ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలైన ఉమ్మడి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో, యానాం ప్రాంతాల్లో నేటి నుంచి మరో మూడు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవనున్నాయి. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఒకట్రెండు చోట్ల గాలులు వీచే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తాంధ్రలో ఇలా..
ఈ ప్రాంతంలోనూ మూడు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని సూచించారు. రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈదురుగాలులు గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి.
రాయలసీమలో తేలికపాటి జల్లులు..
రాయలసీమ జిల్లాలైన ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుంటాయి. గడిచిన 24 గంటల్లో రాయలసీమలోని కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత 41.6 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. అత్యధిక వర్షపాతం తిరుపతిలో 38.5 మిల్లీమీటర్లుగా నమోదైందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు తెలిపారు.
నిప్పుల కొలిమిలా తెలంగాణ..
దక్షిణ అండమాన్‌లో నేడు ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మే 7 వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీలు నమోదైంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఒకట్రెండు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
తిరుపతిలో ఈదురుగాలుల బీభత్సం, రేణిగుంటలో విమాన రాకపోకలకు అంతరాయం
తిరుపతిలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఇవాళ సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ ఈదురు గాలుల వీస్తున్నాయి. దీంతో నగర వాసులు, యాత్రికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీగా వీస్తున్న ఈదురు గాలులు, ఉరుములకు నగర వాసులు ఇండ్లల్లో నుంచి బయటకు రావడం లేదు. ఈదురు గాలులకు సాయంత్రం నుంచి నగరంలో పూర్తిగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది.
విమాన రాకపోకలకు అంతరాయం
తిరుపతిలో వాతావరణ అనుకూలించక విమానాలు గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్ నుంచి సాయంత్రం 7:20 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోవాల్సిన ఇండిగో విమానం వర్షం కారణంగా వాతావరణం అనుకూలించక చెన్నై విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. మరొక ఇండిగో విమానం విజయవాడ నుంచి తిరుపతికి 8:10 నిమిషాలకు రావాల్సి ఉన్నా భారీ వర్షం కారణంగా వాతావరణం అనుకూలించక గాల్లోనే చక్కర్లు కొడుతోంది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు
Congress Warangal Meeting: ఓరుగల్లులో రైతు డిక్లరేషన్ ప్రటించిన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
వరంగల్‌లో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వరంగల్ మీటింగ్‌లో రైతు డిక్లరేషన్ ప్రటించింది. ఈ డిక్లరేషన్‌ను రేవంత్ రెడ్డి ప్రకటించారు.
1. అధికారంలోకి రాగానే రైతులందరికీ రెండు లక్షల రుణ మాఫీ
2. ఎకరానికి 15వేల రూపాయల పెట్టుబడి సాయం
3. రైతులు పండించిన పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వమే మొత్తం కొనుగోలు చేస్తాం.
4. తెలంగాణలో మూతబడిన చెరకు కర్మాగారాలను తెరిపిస్తాం. చెరకు, పసుపు రైతులను ఆదుకుంటాం.
5. రైతులపై భారం లేకుండే మెరుగైన పంటల బీమా తీసుకొస్తాం. వీలైనంత త్వరగా నష్టం అంచనా వేస్తాం.
6. భూమి లేని రైతు కూలీలకు రైతు బీమ వర్తింపు
7. వ్యవసాయంతో ఉపాధి హామీ పథకం అనుసంధానం చేస్తాం.
8. ధరణీ పోర్టల్ రద్దు చేసి సులభతరమైన విధానం తీసుకొస్తాం.
9. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందులపై ఉక్కపాదం మోపేందుకు కఠిన చట్టం తీసుకొస్తాం.
10. అవినీతి లేకుండా రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.
11. రైతుల సమస్యల శాశ్వత పరిరక్షణ కోసం చట్టపరమైన హక్కులతో రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాం.
12. తెలంగాణ భూములకు అనుగుణంగా కాలానుగుణంగా వ్యవసాయ విధానాలు తీసుకొచ్చి వ్యవసాయాన్ని పండగలా మారుస్తాం.
13. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏ పంట ఏ ధర ఇస్తుందో చెప్పారు. వరి- రూ. 2500 మొక్కజొన్న- రూ. 2200 కందులు- రూ. 6700 పత్తి - రూ. 6500 మిర్చి క్వింట రూ. 15000 పసుపు క్వింటా- రూ. 12000 ఎర్రజొన్న రూ. 3500
హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ, ప్రత్యేక హెలికాఫ్టర్ లో వరంగల్ కు పయనం
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ దిల్లీ నుంచి విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో రాహుల్ గాంధీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్, ప్రోటోకాల్ ఇంఛార్జీలు హర్కర వేణుగోపాల్, సంగిశెట్టి జగదీష్ తదితరులు స్వాగతం పలికారు. రాహుల్ గాంధీ ప్రత్యేక హెలికాఫ్టర్ లో శంషాబాద్ నుంచి వరంగల్ బయలు దేరారు. రాహుల్ గాంధీ వెంట హెలికాప్టర్ లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉన్నారు. వరంగల్ లో సెయింట్ గాబ్రియల్ స్కూల్ గ్రౌండ్ కు చేరుకుని , అక్కడ నుంచి ప్రత్యేక వాహనంలో ఓపెన్ టాప్ లో ఆర్ట్స్ అండ్ సైన్సు గ్రౌండ్ కు రాహుల్ చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు రాహుల్ గాంధీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
Bojjala Gopala Krishna Reddy: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు. 1949 ఏప్రిల్ 15న జన్మించిన బొజ్జల... మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో పని చేశారు. చంద్రబాబు హయాంలో అటవీ శాఖ మంత్రిగా సేవలు అందించారు.
Governor Tamilisai: సరూర్‌నగర్‌లో జరిగిన హత్యపై నివేదిక కోరిన గవర్నర్ తమిళిసై
Governor Tamilisai: సరూర్‌నగర్‌లో జరిగిన హత్యపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. నాగరాజు దారుణ హత్యపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా మతాంతర వివాహం కాబట్టి ప్రభుత్వం నుండి హత్యపై వివరణాత్మక నివేదికను కోరారు గవర్నర్ తమిళి సై.