Chandrababu: అవి కచ్చితంగా ప్రభుత్వ హత్యలే... అప్పులతో ఏపీ బ్రాండ్ దెబ్బతీశారు... ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్
వరదల్లో చనిపోయిన వారివి కచ్చితంగా ప్రభుత్వ హత్యలే అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. సోమవారం పార్టీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రజాసమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు.
వరదల వల్ల ముంపు ప్రాంతాల ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోయారని, వరదలతో చనిపోయిన వారివి కచ్చితంగా ప్రభుత్వ హత్యలేనని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ముంపు ప్రాంతాలకు వెళ్తే సహాయక కార్యక్రమాలకు ఆటంకమని సీఎం జగన్ వ్యాఖ్యానించడం చేతగానితనమని విమర్శించారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ విపత్తుల్లో క్షేత్రస్థాయిలో ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. వరదల నివారణలో ఘోరంగా విఫలయ్యారన్నారు. దీనిపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. బాధితులకు ఇంతవరకు నష్ట పరిహారం అందలేదన్న చంద్రబాబు.. ఆయా పంటలకు టీడీపీ హయాంలో చెల్లించిన ఇన్ పుట్ సబ్సీడీని తగ్గించారని తెలిపారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ నిధులు రూ.1,100 కోట్లు బాధితులకు ఇవ్వకుండా దారి మళ్లించారని చంద్రబాబు ఆరోపించారు. సీఎం జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడాలని సమావేశంలో చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు.
Also Read: కండలేరు రిజర్వాయర్‌కు గండీ పడనుందా? అసలు నిజం ఏంటంటే..
పంట బీమా ప్రీమియం కట్టలేదు
పంట బీమా ప్రీమియం కట్టకుండా సీఎం జగన్ రైతులను మోసం చేశారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్ర వాటా చెల్లించకపోవడంతో కేంద్ర సాయం కూడా అందని పరిస్థితి నెలకొందన్నారు. 2020లోనూ పంట బీమా ప్రీమియం కట్టకుండా అసెంబ్లీలో కట్టామని అబద్ధం చెప్పారని చంద్రబాబు ఆరోపించారు. క్రాప్ ఇన్సూరెన్స్ చెల్లించకుండా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని తీర్మానించారు. ఓటీఎస్ పథకం పేరుతో రూ.14,261 కోట్లు పేదల నుంచి వసూలు చేయడాన్ని విరమించుకోవాలని ఈ సమావేశంలో టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. 1983 నుంచి 2017 వరకు ప్రభుత్వాలు నిర్మించిన ఇళ్లకు సంబంధించి డబ్బులు కట్టాలనడం దారుణమన్నారు. దశాబ్దాలుగా నివసిస్తున్న ఇళ్లకు డబ్బులు కట్టాలని పేదలను వేధిస్తున్నారన్నారు. స్వచ్చందమని చెబుతూ స్థానిక అధికారుల్ని ఇళ్ల వద్దకు సంక్షేమ కార్యక్రమాలు నిలిపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం కేటాయించిన ఇళ్లకు ఏ ఒక్కరూ కూడా రూపాయి కట్టాల్సిన అవసరం లేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తామని సమావేశంలో నేతలు పేర్కొన్నారు.
Also Read: మరో అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీని ముంచెత్తుతున్న వర్షాలు.. మరో రెండు రోజులు దంచికొట్టనున్న వానలు
యూనివర్సిటీల నిధులు మళ్లింపు
ప్రజా సమస్యలు చర్చించే అసెంబ్లీని సీఎం జగన్ కౌరవ సభగా మార్చారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలు, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహించి మహిళల పట్ల వైసీపీ వైఖరితో పాటు క్షేత్రస్థాయి సమస్యలు, ప్రజా సమస్యలు చర్చించాలని సమావేశంలో తీర్మానించారు. సీఎఫ్ఎంఎస్ ను దుర్వినియోగం చేస్తున్నారని, టీడీపీ హయాంలో ప్రతి పంచాయతీకి అకౌంట్ ఓపెన్ చేసి వాటి అభివృద్ధికి కృషి చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ ఖాతాల్లో జమచేయకుండా నిధులను పక్కదారి పట్టించి 73వ రాజ్యాంగ సవరణను ధిక్కరిస్తుందని ఆరోపంచారు. తక్షణమే ఆ నిధులను పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీతో పాటు ఇతర యూనివర్సిటీల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పోరేషన్ లిమిటెడ్ లో డిపాజిట్ చేయాలని ఒత్తిడి తీసుకురావడాన్ని చంద్రబాబు ఖండించారు. చట్ట వ్యతిరేకమైన నిధుల బదిలీ ప్రక్రియను తక్షణమే విరమించుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. స్వయం ప్రతిపత్తి కలిగిన యూనివర్సిటీల నిధుల మళ్లింపు విద్యావ్యవస్థ ప్రమాణాల్ని దిగజార్చుతుందని అభిప్రాయపడ్డారు.
Also Read: భారీ వర్షాల ఎఫెక్ట్.. నెల్లూరు-చెన్నై హైవేపై రాకపోకలకు అంతరాయం.. కి.మీ మేర నిలిచిన వాహనాలు
దొంగ ఓట్లు సృష్టించేందుకు కుట్ర
ప్రభుత్వ ఉద్యోగుల పోరాటానికి టీడీపీ సంఘీభావం ప్రకటించింది. వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు. పీఆర్సీ, డీఏ, పెన్షన్, సీపీఎస్ సమస్యలను పరిష్కరించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అభిప్రాయపడ్డారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా తెలుగుదేశానికి ఓట్లు, సీట్లు గణనీయంగా పెరిగాయని నేతలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలపై రివ్యూ చేయడంతో పాటు ఆయా ఎన్నికల్లో సమర్థంగా పనిచేసిన నేతలకు భవిష్యత్ లో తగిన ప్రాధాన్యత ఇస్తామని, వారికి అన్ని విధాల పార్టీ అండగా ఉంటుందని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ప్రతి నియోజకవర్గంలో 10 వేల నుంచి 20 వేల వరకు దొంగ ఓట్లు సృష్టించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు. దీనిని సమర్థంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, గ్రామ కమిటీలు, బీఎల్ఏల నియామకాలు పూర్తి చేయాలని, డిసెంబర్ చివరి వరకూ ఓటర్ల నమోదు, ఫేక్ ఓట్లు తొలగింపుపై పార్టీ నేతలు కృషి చేయాలని సమావేశంలో తీర్మానించారు. రాష్ట్రం అప్పులతో దెబ్బతిందని, భవిష్యత్ లో రాష్ట్ర ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. 20 ఏళ్లయినా ఈ సమస్యల నుంచి బయటపడే పరిస్థితి లేదన్నారు. వైసీపీ భూతులతో టీడీపీ పోటీ పడదని, అమ్మఒడికి రూ.14 వేలు ఇచ్చి, నాన్న బుడ్డి ద్వారా రూ.40 వేలు లాక్కుంటున్న కపటాన్ని ప్రజలకు వివరించాలని చంద్రబాబు అన్నారు.
Also Read: విపత్తు నిర్వహణలో బాగా పని చేశారు.. సీఎం జగన్‌కు కేంద్ర బృందం అభినందన !