Weather Updates: మరో అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీని ముంచెత్తుతున్న వర్షాలు.. మరో రెండు రోజులు దంచికొట్టనున్న వానలు
కోమరిన్ ప్రాంతం దానిని అనుకుని ఉన్న శ్రీలంక తీర ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది.
మరికొన్ని గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడురోజుల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కోమరిన్ ప్రాంతం దానిని అనుకుని ఉన్న శ్రీలంక తీర ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. మరో అల్పపీడనం దక్షిణ అండమాన్ సముద్రంలో నవంబర్ 30 తేదీలోగా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
నేడు, లేదా రేపటిలోగా ఏర్పడనున్న ఈ అల్పపీడనం మరింత బలపడి మరో 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో ప్రయాణించే అవకాశం ఉంది. వరుసగా రెండు అల్పపీడనాలు ఏర్పడటంతో ఏపీ ప్రజల్లో ఆందోళన నెలకొంది. అల్పపీడనాల నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రెండు అల్పపీడనాల ప్రభావంతో ఏపీలో నేడు, రేపు ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. ఆ మరుసటి రోజు సైతం పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ముఖ్యంగా దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు.
దక్షిణ కోస్తాంధ్రలో నేడు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురవనుడగా, ఉరుములతో కూడిన జల్లులు మరికొన్ని ప్రాంతాల్లో పడతాయని అంచనా వేశారు. ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురనున్నాయని.. మత్స్యాకారులు డిసెంబర్ 1 వరకు వేటకు వెళ్లకపోవడం ఉత్తమమని సూచించింది.
Also Read: కడప, చిత్తూరు జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు... చిత్తూరు జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
ఇటీవల వర్షాలతో అతలాకుతలమైన రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, అనంతపురం, కడపతో పాటు నెల్లూరు జిల్లాల్లో వర్షాలు మళ్లీ కురుస్తున్నాయి. ఈ జిల్లాల్లో 7 నుంచి 20 సెంటీమీటర్ల వరకు ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో గరిష్టంగా 7 నుంచి 11 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదు కానుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
తెలంగాణలోనూ వాతావరణం..
దక్షిణ అండమాన్‌లో నేడు, లేదా రేపటిలోగా మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో వాతావరణం చల్లగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు హైదరాబాద్‌తో పాటు కొన్ని జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. వాతావరణ కేంద్రం రాష్ట్రంలో వర్షానికి సంబంధించి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
Also Read: ప్రభుత్వ వైఫల్యంపై న్యాయవిచారణ చేపట్టాలి.... ప్రకృతి వైపరీత్యాల నిధులు మళ్లించారు... సీఎస్ కు చంద్రబాబు లేఖ