AP Rains: కడప, చిత్తూరు జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు... చిత్తూరు జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
రాయలసీమ జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కడప జిల్లాలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటుచేశారు. చిత్తూరు జిల్లాలో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. మరికొన్ని రోజులు వర్షాలు కురుస్తాయని హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. కడప జిల్లాలో అత్యవసర సమాచారం కోసం కంట్రోల్ రూముల ఏర్పాటు చేశామని కలెక్టర్ వి.విజయరామ రాజు తెలిపారు. తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లా ప్రజల అత్యవసర సహాయ సమాచారం కోసం జిల్లా కలెక్టరేట్ తో పాటు మూడు రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూములను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆదివారం పేర్కొన్నారు.
ప్రజలు అధిక నీటి ప్రవాహం ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, వాగులు, వంకలు, నదులు దాటడానికి ప్రయత్నం చేయొద్దని కలెకర్ట్ సూచించారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు, నదీ పరివాహ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలన్నారు.
కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు:
- కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు - 08562 - 246344, 08562-244437
- కడప రెవిన్యూ డివిజనల్ కార్యాలయం కంట్రోల్ రూము ఫోన్ నెంబర్ : 08562-295990
- రాజంపేట రెవిన్యూ డివిజనల్ కార్యాలయం కంట్రోల్ రూము ఫోన్ నెంబర్ : 08565 -240066
- జమ్మలమడుగు రెవిన్యూ డివిజనల్ కార్యాలయం కంట్రోల్ రూము ఫోన్ నెంబర్ : 9966225191
అంతేకాకుండా మండల స్థాయిలో తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవో, పోలీసులకు ఫోన్ చేసి సహాయం కోరవచ్చని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సచివాలయ సిబ్బంది కూడా తుపాను సహాయక చర్యలు అందించేందుకు అందుబాటులో ఉండాలన్నారు. కడప జిల్లా రైల్వేకోడూరు మండలం గుంజననది ఆనుకొని ఉన్న నరసరావుపేటలో ఇల్లు కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న యాజమానులు ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ఇంటితో పాటు సర్వం కోల్పోయామని బాధితులు వాపోతున్నారు. నిరాశ్రయులైన కుటుంబీకులను ఆదుకుంటామని తహశీల్దార్ రామ్మోహన్ హామీఇచ్చారు.
చిత్తూరు జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సోమవారం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ సెలవు ప్రకటించారు. అలాగే సోమవారం కలెక్టరేట్ లో జరిగే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేశారు. చెరువులన్నీ నీటితో నిండుగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల వలన ఇబ్బందుల ఎదుర్కొంటుంటే జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూము ఫోన్ నెం. 08572-242777, 08572-242753, 9849907389, 104 నెంబర్లకు కాల్ చేసి తమ సమస్యలు తెలియజేయవచ్చని కలెక్టర్ తెలిపారు.
Also Read: నెల్లూరు జిల్లాకు చేరిన సోనూ సూద్ సాయం..
తిరుపతి నగరంలో లోతట్టు ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి అర్బన్ ఎమ్మార్వో వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రజలు దగ్గరలోని పునరావాస కేంద్రాలలో ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ పరిధిలోని సచివాలయ వాలంటీర్లు, రెవెన్యూ వీఆర్వోలు సూచించిన సురక్షిత ప్రాంతాలలో ఉండాలని తెలిపారు.
చిత్తూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన
వరద నష్టం అంచనా వేసేందుకు రెండు రోజుల పాటు కేంద్రం బృందం చిత్తూరు జిల్లాలో పర్యటించింది. రెండు రోజుల పర్యటనలో తిరుపతి, చిత్తూరులోని వరద ప్రభావిత ప్రాంతాలను కేంద్ర బృందం పరిశీలించింది. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వరద తీవ్రత తెలిపే ఫోటోలను పరిశీలించారు. కేంద్ర బృందానికి వరద పరిస్థితులను కలెక్టర్ హరి నారాయణ్, తిరుపతి కమిషనర్ గిరీషా వివరించారు. ఎమ్మార్ పల్లి, గొల్లవాని గుంట, శ్రీకృష్ణ నగర్, జీవకోన ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించి పలు చోట్ల ఫొటోలు తీసుకుంది. గొల్లవాని గుంట వద్ద కొందరు స్థానికులు తమ సమస్యలను కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం చిత్తూరు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం పర్యటించింది. ముఖ్యంగా జిల్లాలోని 66 మండల్లోని 489 గ్రామాలు పాక్షికంగా దెబ్బతినగా అందులో 126 గ్రామాలు పూర్తిగా ముంపునకు గురైనట్లు కేంద్ర బృందం గుర్తించింది.
Also Read: వేదికపై పాదాభివందనం చేసిన రేవంత్ రెడ్డి.. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా?