AP Spinning Mills : టెక్స్ టైల్ రంగంలో తీవ్ర సంక్షోభం, రేపటి నుంచి స్పిన్నింగ్ మిల్లులు బంద్!
AP Spinning Mills : ఏపీలో స్పి్న్నింగ్ మిల్లులు 15 రోజుల పాటు మూతపడనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బకాయిలపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ యాజమాన్యాలు ఆందోళనకు దిగుతున్నాయి.
AP Spinning Mills : ఆంధ్రప్రదేశ్ లో స్పిన్నింగ్ మిల్లుల పరిశ్రమ ఆర్థిక మాంద్యంతో ఇబ్బందులు ఎదుర్కోంటుంది. దీంతో రేపటి నుంచి 15 రోజుల పాటు స్పిన్నింగ్ మిల్లులు మూసివేయాలని ఏపీ టెక్స్ టైల్ మిల్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి,పెండింగ్ బకాయిల విడుదలపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని ఏపీ టెక్స్ టైల్ మిల్స్ అసోసియేషన్ వెల్లడించింది. యాజమాన్యాలు మిల్లులు మూసివేసే పరిస్థితి నెలకొందని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రత్యక్ష, పరోక్షంగా రెండు లక్షల యాభై వేల మంది కార్మికులు స్పిన్నింగ్ పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చోరవ తీసుకొని న్యాయం చేయాలని అసోసియేషన్ నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్రం పత్తిని కమొడిటీస్ ఎంసీఎక్స్ ఆన్ లైన్ ట్రేడింగ్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వడ్డీ, విద్యుత్ రాయితీ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం రూ.237 కోట్లు చెల్లించిందని, ఇంకా రూ.1400 కోట్ల బకాయిలు ఉన్నాయని అసోసియేషన్ నేతలు తెలిపారు.
రేపటి నుంచి మిల్లుల మూసివేత
ప్రస్తుతం యాభై శాతం సామర్థ్యంతో మిల్లులు పని చేస్తున్నాయని, పూర్తిగా మిల్లులు మూసివేసేందుకు సిద్ధమయ్యామని స్పిన్నింగ్ యాజమాన్యాలు వెల్లడించారు. కరోనాకు ముందు నుంచే స్పిన్నింగ్ మిల్లులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అంతంత మాత్రంగానే ఉందని, కరోనా తరువాత పరిస్థితులు మరింత దుర్భరంగా మారాయని అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కాలంలో స్పిన్నింగ్ మిల్లులు పూర్తిగా మూడపడ్డాయని, ఆ తరువాత అన్ని రంగాలు ఎంతో కొంత కోలుకున్నప్పటికీ, తమ రంగంలో ఉన్న పూర్వపు సంక్షోభం కారణంగా ఇప్పటికి బయటపడలేకపోతున్నామని వారు అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను పూర్తిగా ఆదుకోవాలని కోరుతున్నారు. తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలిపేందుకు రేపటి నుండి పదిహేను రోజుల పాటు స్పిన్నింగ్ మిల్లులు మూసి వేయాలని నిర్ణయానికి వచ్చామని తెలిపారు.
అయోమయంలో కార్మికులు,రైతులు
టెక్స్ టైల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం 35 లక్షల spindies సామర్థ్యంతో 125 టెక్స్ టైల్ మిల్లులు ఉన్నాయి. ఒక నూలు పరిశ్రమతో ఎన్నో వేల మంది కార్మికులు ఉపాధి పొందటమే కాకుండా పత్తి పండించే రైతులకి కూడా గిట్టుబాటు ధర వస్తుంది. మన రాష్ట్రంలో ఉన్న ఇలాంటి నూలు పరిశ్రమలు అన్నీ ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం వాతావరణం కారణంగా మూతపడడానికి సిద్ధంగా ఉన్నాయి. మాములుగా పూర్తి 100 శాతం సామర్థ్యంతో నడిచే ఈ మిల్లులు , కేవలం 40 శాతం కెపాసిటీతో నడుస్తున్నాయి. మాంద్యంతో పాటు వివిధ కారణాల వల్ల పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్ర స్పిన్నింగ్, టెక్స్ టైల్ పరిశ్రమల అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో అప్పటి పరిస్థితులను దృష్టి లో పెట్టుకుని వారి ఉత్పత్తిలో 50 శాతం నిలిపివేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు మరింత క్షీణించిన పరిస్థితుల దృష్ట్యా మొత్తం అన్ని పరిశ్రమలు పూర్తిగా మూసివేసి, నష్టాల బారి నుంచి బయటపడాలని లేదంటే, పరిశ్రమ తీవ్ర సంక్షోభానికి గురవుతుందనే అభిప్రాయానికి వచ్చారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ విధానాన్ని పాటించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మూసివేత నిర్ణయంపై కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రాష్ట్రంలో లక్ష మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని కార్మికులు రోడ్డున పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా నూలు మిల్లుల వద్ద సీజన్ ప్రారంభంలో పంట చేతికి వచ్చే సమయానికి 9 వేలు ఉన్న క్వింటా పత్తి ధర రూ.6,900కు పడిపోయింది. దీంతో రైతులు పరిస్థితి కూడా ఆగమ్యగోచరంగా మారింది.
విడుదల కాని రాయితీలు
రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిశ్రమకి కావాల్సిన వడ్డీ రాయితీలు, 2014 నుంచి పెండింగ్ లో ఉన్న విద్యుత్ రాయితీలను వెంటనే విడుదల చేసి పరిశ్రమను ఆదుకోవాలని అసోసియేషన్ ఛైర్మన్ రఘురామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం కరోనా కష్ట కాలంలో రూ.237 కోట్లను 2021 సెప్టెంబర్ లో విడుదుల చేసింది. అదే విధంగా ప్రస్తుత విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పెండింగ్ లో ఉన్న అన్ని రాయితీలను విడుదల చేయాలని కోరారు. ఇప్పటి వరకు అన్ని రకాల రాయితీలు కలిపి సుమారు 1400 కోట్ల రూపాయలు స్పిన్నింగ్ మిల్లులకు ఇవ్వాల్సి ఉంది. రాయితీలు కూడా రాకపోతే, పరిశ్రమ తీవ్ర సంక్షోభానికి గురై, మిల్లులకు పూర్తిగా మూసివేయవలసి ఉంటుందని, బ్యాంకులకు కట్టాల్సిన రుణ వాయిదాలను కూడా కట్టలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రాయితీ బకాయిలను వెంటనే విడుదల చేసి స్పిన్నింగ్ పరిశ్రమను ఆదుకోవలసినదిగా ఆయన కోరారు.