Casino Case : ఈడీ ఎదుటకు వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, బుట్టా రేణుక సోదరుడు - కేసినో కేసులో ఏపీలోనూ కలకలం !
కేసినో కేసులో ఏపీ రాజకీయ నేతలూ ఉన్నారు. వారికి ఈడీ నోటీసులు జారీ చేసింది. మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు ఈడీ ఎదుట హాజరయ్యారు.
Casino Case : కేసినో కింగ్ చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ వంద మందికి నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ గురువారం ఈడీ ఎదుట హాజరయ్యారు. బుధవారమే మంత్లి తలసాని సోదరులు విచారణకు హాజరయ్యారు. చీకోటి ప్రవీణ్ కేసినో ఖాతాదారుల్లో తెలంగాణ నుంచే కాదు.. ఏపీ నుంచి కూడా ప్రముఖులు ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయన కూడా విచారణకు హాజరయ్యారు. అనంతపురం అర్బన్ నుుంచి గతంలో కాంగ్రెస్, వైఎస్ఆర్‌సీపీ తరపున ఎమ్మెల్యేలగా గెలిచారు గుర్నాథ్ రెడ్డి. ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీలోనే ఉన్నారు.
ఈడీ ఎదుటకు మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు
అనూహ్యంగా గుర్నాథ్ రెడ్డితో పాటు యుగంధర్ అనే వ్యక్తి కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయన వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు అని తెలుస్తోంది. వీరిద్దరూ చీకోటి ప్రవీణ్ నిర్వహించిన కేసినోల్లో పాల్గొనడానికి ఇతర దేశాలకు వెళ్లారని.. హవాలా మార్గం ద్వారా డబ్బులు చెల్లించారన్న ఆరోపణలపై ఈడీ ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఇప్పటి వరకూ వంద మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. కేసినో అంటే.. లక్షల్లో ఉండే వ్యవహారం కావడం.. ఎక్కువగా బ్లాక్ మనీతోనే లావాదేవీలు నిర్వహిస్తారు కానీ.. రాజకీయ నేతలు.. వారితో సంబంధాలున్నవారే ఈ కేసుల్లో ఉన్నారు. దీంతో నోటీసులు అందుకున్న వారి పేర్లు బయటకు వచ్చే కొద్దీ సంచలనం అవుతున్నాయి.
చీకోటి ప్రవీణ్ దగ్గర లభించిన ఆధారాలతో ఈడీ నోటీసులు
విదేశాల్లో క్యాసినో నిర్వహణ, ఆర్థిక లావాదేవీల వంటి అంశాలపై ఆరా తీశారు. ఫెమా యాక్ట్ నిబంధనలు, మనీలాండరింగ్‌పై ఈడీ కూపీ లాగుతోంది. చీకోటి ప్రవీణ్, మాధవ్‌రెడ్డి కాల్‌డేటా ఆధారంగా వివరాలు సేకరించారు. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ఫ్లైట్ బుకింగ్స్ వివరాలు సేకరించిన ఈడీ వాటి ఆధారంగా అనుమానితులను విచారణకు పిలుస్తున్నారు. గతంలో చీకోటి ప్రవీణ్‌ను ఈడీ నాలుగు రోజుల పాటు ప్రశ్నించింది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారాలు అనేక మంది క్యాసినోలకు వెళ్లినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. దీనిపై కూడా ప్రవీణ్ బృందాన్ని లోతుగా ప్రశ్నించింది. క్యాసినోలో జూదం ఆడాలంటే విదేశీ మారక ద్రవ్యం కావాలి. పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం తీసుకు వెళ్లడం సాధ్య పడదు. ఈ క్రమంలోనే తమకు కావాల్సిన విలువకు తగ్గట్టు నగదు చెల్లిస్తే ప్రవీణ్, అతని అనుచరులు ఇక్కడే టోకెన్లు ఇచ్చే వారని, వాటితోనే విదేశాల్లో జూదం ఆడేవారని తెలుస్తోంది. ఫెమా నిబంధనల ప్రకారం ఇది చట్ట విరుద్ధం. దీనిపైనే ప్రస్తుతం ఈడీ విచారిస్తోంది.
అక్రమంగా డబ్బులు తరలించిన కోణంలోనే విచారణ
హవాలా మార్గంలో ద్రవ్య మారకం జరిగనట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో దాని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారని ఈడీ లోతుగా విచారిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలులోని ప్రజాప్రతినిధులు, ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించి వీరి ప్రమేయం ఉన్నట్లు బయట పడితే... రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనం అయ్యే అవకాశం ఉంది.