AP MLC Election Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హుషార్, జనసేనకు చిగురించిన ఆశలు! ఎలాగంటే
ముసుగు తీసేయండి, కలసి పోటీ చేస్తామని ధైర్యంగా చెప్పండి అంటూ వైసీపీ నేతలు ఇటీవల సవాళ్లు విసిరారు. ఇప్పుడు జనసేనకు టైమ్ వచ్చింది. కలిసే వస్తామని జనసేనాని ధైర్యంగా చెబుతారా,వేచి చూస్తారా అనేది తేలాలి.
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ప్రభావం భవిష్యత్ రాజకీయాలపై స్పష్టంగా కనపడే అవకాశముంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకంగా మూడు స్థానాలు గెలిచిన టీడీపీ హుషారుగా ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, ఆ వ్యతిరేకతను చీలిపోకుండా చేయగలిగితే ప్రతిపక్షాలకు స్కోప్ ఉందనే నమ్మకం జనసేనకు వచ్చింది. పొత్తులపై అటు ఇటు ఆలోచిస్తున్న ఈ రెండు పార్టీలు ఇప్పుడు హుషారుగా జతకలిసే సమయం వచ్చింది.
ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే టైమ్ ఉన్నా.. పొత్తులు ఇంకా ఖరారు కాలేదు. వైసీపీ సింగిల్ గా పోటీ చేస్తామని ఇదివరకే చాలాసార్లు చెప్పింది. దమ్ముంటే ఒంటరిగా రండి 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పండి అంటూ సవాళ్లు విసురుతున్నారు వైసీపీ నేతలు. వారు రెచ్చగొట్టినా టీడీపీ, జనసేన, బీజేపీ మాత్రం విడివిడిగా ఎన్నిసీట్లలో పోటీ చేస్తామనే విషయాన్ని చెప్పలేకపోతున్నాయి. బీజేపీ ఇంకా జనసేనతో పొత్తులోనే ఉన్నామనుకుంటోంది. జనసేనతో కలిపి అన్ని స్థానాల్ల పోటీ చేస్తాం, విజయం సాధిస్తాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. వారి సత్తా ఏంటో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేలిపోయింది. ఉత్తరాంధ్రలో సీనియర్ నేత మాధవ్ చిత్తు చిత్తుగా ఓడిపోయారు. సో ఇక మిగిలింది టీడీపీ, జనసేన. జనసేనకు ఇప్పటికే బీజేపీ సత్తా ఏంటో ఓ క్లారిటీ వచ్చింది. గతంలో ప్రతి ఉప ఎన్నిక విషయంలో కూడా బీజేపీ తమ పంతమే నెగ్గించుకుంది కానీ పవన్ మాట వినలేదు. హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేద్దామన్నా కూడా వద్దని వారించారు బీజేపీ నేతలు. ఇటీవల ఆవిర్భావ సభలో కూడా ఇవే విషయాలు చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు పవన్. సో.. ఆయనకు టీడీపీతో కలిసేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలు మంచి అవకాశమనే చెప్పాలి.
జనసేనానికి టీడీపీతో కలవాలని ఉన్నా.. జనసైనికులకు మాత్రం ఎక్కడో కాస్త సంశయం ఉంది. టీడీపీతో కలసి వెళ్తే లాభమా, టీడీపీతో ఉంటే పోటీచేసే సీట్ల విషయంలో కోతపడుతుందేమోననే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ పవన్ మాత్రం మొదటినుంచీ ఒకేమాట చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తే విజయం మనదేనంటున్నారు. జనసేనకు నష్టం లేకుండా పొత్తుల గురించి ఆలోచిస్తామంటున్నారు. ఇప్పుడు టీడీపీ విజయం జనసేనలో కూడా హుషారుని తెప్పించింది.
పొత్తులపై తేల్చేస్తారా..?
ముసుగు తీసేయండి, కలసి పోటీ చేస్తామని ధైర్యంగా చెప్పండి అంటూ వైసీపీ నేతలు ఇటీవల టీడీపీ, జనసేనకు సవాళ్లు విసిరారు. ఇప్పుడు జనసేనకు టైమ్ వచ్చింది. కలిసే వస్తామని జనసేనాని ధైర్యంగా చెబుతారా, మరికొన్నిరోజులు వేచి చూస్తారా అనేది మాత్రం తేలాల్సి ఉంది.
లెక్కలు తేలతాయా..?
ఒకవేళ పొత్తులు ఖరారు అయినా ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది తేలాల్సి ఉంది. మరోవైపు వైసీపీనుంచి ఇప్పటికే ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలు టీడీపీవైపు చూస్తున్నారు. వారిద్దరితో ఆ వ్యవహారం ఆగిపోతుందా, మరికొంతమంది అసంతృప్తులు, చివరి నిమిషంలో టికెట్ రానివాళ్లు టీడీపీవైపు వచ్చే అవకాశముందా అనేది కూడా తేలాల్సి ఉంది. ఈ లెక్కలన్నీ వేసుకుని టీడీపీ, జనసేన టికెట్ల కేటాయింపులు చూసుకోవాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు పార్టీల కూటమిపై ఆయన సానుకూలంగా స్పందించారు. 2024 నాటికి ఏపీలో కూటములు ఎలా ఉంటాయో తెలియదు కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆ వైపుగా అడుగులు వేయిస్తాయనేది మాత్రం ఖాయమనే చెప్పాలి.