(Source: ECI/ABP News/ABP Majha)
AP Ministers on Chandrababu: చంద్రబాబుపై మంత్రుల మూకుమ్మడి దాడి- పాపాలు పండాయంటూ కామెంట్స్
AP Ministers on Chandrababu: చంద్రబాబు చేసిన అక్రమాల పాపాలు పండయాని, అందుకే ఆయన అరెస్ట్ అయ్యారని ఏపీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు.
AP Ministers on Chandrababu: రాష్ట్రంలో జరిగిన పరిణామాలు అన్నీ ప్రజల దృష్టిలో ఉన్నాయని.. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబును విజయవాడ తరలిస్తున్నారని, సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించారని చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబు అరెస్ట్ తప్పు అంటూ వాదనలు చేస్తున్నాయని తెలిపారు. 90 శాతం సిమెన్స్, 10 శాతం ప్రభుత్వం ఖర్చు చేయాలని.. 3,356 కోట్ల ప్రాజక్టుల్లో 371 కోట్లు ప్రభుత్వం ఇవ్వాలని వివరించారు. ఏ కారణం లేకుండా ఒక కంపెనీ ప్రభుత్వం తరపున 3000 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తుందని ప్రశ్నించారు. అలాగే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, ఈడీ అరెస్టులు చేశాయన్నారు. సిమెన్స్, డిజిటెక్, స్కిల్లెర్ కంపెనీల ప్రతినిధులను ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ చేశారని స్పష్టం చేశారు. వారంతా ఈ కుట్రలో పాత్రధారులు అని... సిమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని చెప్పుకొచ్చారు.
కేవలం ప్రభుత్వం 10 శాతం కింద ఇచ్చిన 371 కోట్ల రూపాయలను మింగేశారని ఆరోపించారు. షెల్ కంపెనీల ద్వారా డబ్బులు బదలాయించారని వివరించారు. ఆ డబ్బులు అన్నీ చంద్రబాబుకు, ఆ పార్టీ వారి చేతుల్లోకి చేరాయని పేర్కొన్నారు. ఇది చంద్రబాబు నాయుడు స్వయంగా చేసిన స్కాం కాబట్టే... అయన ఈ విషయంపై ఏమి మాట్లాడ లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. అయన పార్టీ వారిని పెట్టుకుని అడ్డగోలుగా వాదిస్తుంటే... చంద్రబాబు సీఐడీని నిలదీశారని ఎల్లో మీడియా ప్రచారం చేసుకుంటుందన్నారు. ఐటి నోటీసులు ఇస్తే... ఆ సర్కిల్ నోటీసు ఇవ్వకూడదని అడ్డోగొలు వాదనలు చేశారన్నారు. ప్రభుత్వ ధనాన్ని దోచేయలనే కుట్రతో ఈ మొత్తం వ్యవహారం జరిగిందన్నారు. అన్ని ఆధారాలతోనే చంద్రబాబు నాయుడిని సీఐడీ అరెస్ట్ చేసిందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు బంధువు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి, దత్త పుత్రుడు పవన్ కల్యాణ్, సీపీఐ నారాయణ, రామకృష్ణ ఎవ్వరూ నోరు మెదపడం లేదన్నారు. ఓటుకు నోటు కేసులోనే అడ్డగోలుగా వాదించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు.
ఆనాడు కూడా మీడియా చంద్రబాబుకు మద్దతు తెలిపిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ ఘటన సమయంలో, ఇప్పుడు కూడా కొన్ని మీడియా సంస్థలు అదే పని చేస్తున్నాయన్నారు. రాజకీయ లబ్ది కోసం ఆయనను కుట్ర పూరితంగా అరెస్ట్ చేశారని మాట్లాడుతున్నారని తెలిపారు. సీఐడీ ఈ కేసును పూర్తి స్థాయిలో వెలికితీసి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ను ఆరెస్ట్ చేశారన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్, ఏపీ ఫైబర్ నెట్ లో కూడా అవకతవకలు జరిగాయని.. అవికూడా విచారిస్తున్నట్టు అధికారులు వెల్లడించారని పేర్కొన్నారు. ఈ 371 కోట్లు చంద్రబాబు తిన్నారా లేదా అనేది పురంధేశ్వరి చెప్పాలన్నారు. పుంగనూరు అల్లర్ల సమయంలో ఒక్క వైసీపీ కార్యకర్త కూడా లేరని అన్నారు. రూట్ మ్యాప్ మార్చి పుంగనూరు లోకి ప్రవేశించాలని నాడు చంద్రబాబు చూస్తే..... పోలీసులు అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఆరోజు టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘటన జరిగిందని వెల్లడించారు. అప్పుడున్న సీపీఐ నారాయణ , ఇప్పుడు ఉన్న నారాయణ వేరని.. అప్పటి నారాయణ కమ్యునిస్ట్ భావజాలం కలిగిన వారు... ఇప్పుడు చంద్రబాబు మన్నన కోసం పని చేస్తున్నారని తెలిపారు.
ఎన్టీఆర్ క్షోభ, చేసిన అక్రమాలు పాపాలు పండాయి..
చంద్రబాబు చేసిన అక్రమాల పాపాలు పండాయని ఏపీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఉదయం తిరుమల స్వామి వారి నైవేద్య విరామ సమయంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పాపాలు పండిన వారికి ఎలాంటి శిక్ష వేయాలో ఆ భగవంతునికి తెలుసునని, ఎన్టీఆర్ క్షోభ, బాధ విని చంద్రబాబు చేసిన అక్రమాల పాపాలు పండాయన్నారు. ఏలేటి స్కాం, లిక్కర్ స్కాములలో స్టేలు తెచ్చుకున్న స్టేలు తెచ్చుకొని పాపాలు బద్దలు అయ్యి నేడు చంద్రబాబు అరెస్ట్ అయ్యాడని ఏపి మంత్రి కారుమూరి వెంటక నాగేశ్వరరావు అన్నారు.
చంద్రబాబు ఆర్ధిక నేరస్తుడు, నిరుద్యోగ యువతకు నైపుణ్యం అందిస్తానని ఆశ చూపి వారి డబ్బును లూటి చేయటంలో నైపుణ్యం చూపించాడని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అమరావతి నిర్మాణం, పేదలకు ఇళ్ల నిర్మాణం, నిరుద్యోగ యువతకు నైపుణ్యం ముసుగులో ప్రజా ధనాన్ని లూటీ చేశారని చెప్పారు.