Minister Peddireddy: చంద్రబాబు 14 ఏళ్లు సీఎం, కుప్పంలో గుర్తుండిపోయే పని ఒక్కటైనా చేశారా?: పల్లెబాటలో మంత్రి పెద్దిరెడ్డి
కుప్పం నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేపట్టిన పల్లెబాట కార్యక్రమం ముగిసింది. కొద్ది రోజులుగా నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లో మంత్రి పెద్దిరెడ్డి పర్యటిస్తున్నారు.
AP Minister Peddireddy: కుప్పం నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేపట్టిన పల్లెబాట కార్యక్రమం ముగిసింది. కొద్ది రోజులుగా నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లో మంత్రి పెద్దిరెడ్డి పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన మంచిని వివరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. కుప్పం రూరల్ మండలంలో పల్లెబాట ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
కుప్పానికి చంద్రబాబు ఏం చేశారు?
ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే చంద్రబాబు కుప్పంకు ఏం చేశారని ప్రశ్నించారు. కనీసం కుప్పం ఓటర్లను కలవలేదని, ఓట్లు కూడా అడగలేదన్నారు. రాజశేఖర్ రెడ్డి 5 ఏళ్లలో అద్భుతమైన పాలన అందించారని, చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా గుర్తుండిపోయే పని ఒక్కటైనా చేశారా అంటూ నిలదీశారు. కుప్పంలో 38 వేల దొంగ ఓట్లు ఉన్నాయని అందుకే చంద్రబాబు 30 వేల ఓట్ల తో గెలిచారని ఆరోపించారు. ఇప్పటికే 12 వేలు దొంగ ఓట్లు తొలగించామని, ఇంకా 26 వేలు ఉన్నాయన్నారు. ఇప్పుడు దొంగ ఓట్ల తొలగింపు పనులు చేపట్టినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారని, దొంగ ఓట్లు తొలగించాలనే తాము కోరుతున్నట్లు చెప్పారు.
ప్రజా బలంతో గెలవలేక టీడీపీ దొంగ ఓట్లను నమ్ముకుందని, ప్రజా బలాన్ని నమ్ముకుని సీఎం వైఎస్ జగన్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. పేదరికాన్ని కొలమానంగా తీసుకుని అర్హులు అందరికీ పథకాలు అందించారని అన్నారు. గతంలో లాగా జన్మభూమి కమిటీలు పెట్టీ ప్రజలను దొచుకొలేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు పాలనను పోలిచి చూస్తే.. ఎవరు జగన్‌ను కాదని వేరే వారికి ఓటు వేయరని అన్నారు. కుప్పంలో భరత్‌ను ఎమ్మెల్యేగా, రెడ్డప్పను ఎంపీగా గెలిపించి సీఎంకు అండగా నిలవాలని కోరారు.
కుప్పంలో అవకాశం ఇవ్వండి
రాష్ట్రంలో 175 స్థానాల్లో 151 స్థానాలు వైసీపీ గెలిస్తే కుప్పంలో గెలవలేదన్నారు. ఇప్పుడు కుప్పంలో ప్రతి గ్రామంలో పర్యటించామని వైఎస్ జగన్ చేసిన మంచిని వివరించామన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ మేలు చేస్తున్నామని, కరోనా సమయంలో ఇతర రాష్ట్రాలు, దేశాలు అతలాకుతలం అయ్యాయని, సీఎం జగన్ మాత్రం ప్రతి రోజు సమీక్ష నిర్వహించి ప్రజల కోసం పని చేశారని అన్నారు. ఇచ్చిన ఎన్నికల హామీలు అన్ని సంక్షేమ క్యాలండర్ ప్రకారం అందించారని గుర్తు చేశారు. కరోనా సమయంలో కూడా ఇక్కడ పథకాలు ఆపలేదన్నారు.
ప్రతి పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు, 24 లక్షల ఇళ్లు మంజూరు చేశారని, ఇంత గొప్పగా పేదల గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి ఎవరు లేరని పెద్దిరెడ్డి అన్నారు. నాడు - నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి చేసి, స్కూల్ విద్యార్థులకు గోరు ముద్ద లాంటి అనేక పథకాలు ప్రవేశ పెట్టారని, కార్పొరేట్ స్కూల్స్ తరహాలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు.
ఆరోగ్యశ్రీని సీఎం జగన్ పటిష్ట పరిచారని, సుమారు 40 వేల మంది వైద్య సిబ్బందిని నియమించారని అన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించడంతో పాటుగా... వారు ఇంటికి వెళ్లాక కూడా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. 35 సంవత్సరాలు కుప్పం ప్రజలు చంద్రబాబును ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని కానీ కుప్పాన్ని అభివృద్ధి చేయలేదదని విమర్శించారు. కానీ 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని, కడపను రాజశేఖర్ రెడ్డి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారని అన్నారు.
చంద్రబాబు ఎక్కడ సభ పెట్టిన తిట్ల పురాణం పెడుతారని, కొడుకుకి కూడా చంద్రబాబు ఆ తిట్ల పురాణం నేర్పించారని విమర్శించారు. అధికారంలోకి రాగానే 2.5 లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించిన చరిత్ర చంద్రబాబుకే దక్కిందన్నారు. అధికారంలోకి రాగానే 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన గొప్ప నేత సీఎం జగన్ అని కొనియాడారు. భరత్‌ను గెలిపిస్తే మనకు అందుబాటులో ఉంటారని, చంద్రబాబు లాగా ఇక్కడ పీఏలతో పాలన సాగించరని అన్నారు. ఎంపీ రెడ్డెప్ప ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి సేవ చేస్తున్నారని కొనియాడారు. భరత్ గెలిస్తే మంత్రిని చేస్తానని సీఎం మాటిచ్చారని గుర్తు చేశారు. అదేవిధంగా హంద్రీనీవా ద్వారా కుప్పానికి త్వరలో నీరు అందిస్తామన్నారు.