Nimmala Ramanaidu: అదంతా ఫేక్ న్యూస్, నమ్మకండి- అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదు: మంత్రి నిమ్మల
AP Heavy Rains :అమరావతిపై ఫేక్ న్యూస్ ఎవరూ నమ్మవద్దని, రాజధాని అమరావతికి ఎలాంటి ముప్పు లేదని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. వైసీపీ నేతలు విమర్శలు చేసినా పట్టించుకోవద్దన్నారు.
Nimmala Ramanaidu: విజయవాడ వరదల నేపథ్యంలో ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. వైసీపీ నేతలు విమర్శలు చేసినా పట్టించుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ దృష్టి వరద బాధితులను ఆదుకోవడంపైనే ఉందన్నారు. కృష్ణా నదిలో ఇంత వరద ఎప్పుడూ చూడలేదన్నారు. 1998, 2009 కంటే ఎక్కువగా ఇప్పుడు వరద నీరు వచ్చిందని చెప్పారు. విజయవాడలో మీడియాతో మాట్లాడారు.. అమరావతిని ముంపు ప్రాంతంగా ముద్ర వేయాలన్నది జగన్ కల అని, ఆ కలను సాకారం చేసేందుకు కొందరు కృషి చేస్తున్నారని నిమ్మల మండి పడ్డారు. ఈ దిశగా కొన్ని పేటీఎం బ్యాచ్‌లు, పెయిడ్ ఛానెల్స్ తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బొట్లు కొట్టుకు రావడం వెనుక వైసీపీ కుట్ర
11.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా అమరావతి చెక్కుచెదరకుండా ఉందని ఆయన నొక్కి చెప్పారు. అమరావతిపై ఫేక్ న్యూస్ ఎవరూ నమ్మవద్దని, రాజధాని అమరావతికి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు. అమరావతిపై విషం చిమ్మడం వైసీపీకి మొదటి నుంచి అలవాటేనన్నారు. కృష్ణానది ఒడ్డున ఉన్న మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద ఔట్ శ్లైస్ 75 శాతం సరిచేశామని తెలిపారు. అక్కడ ఆ గేట్లకు ఐదేళ్లుగా కనీసం గ్రీజ్ పెట్టకపోవడం వల్ల ఆ గేట్లు కొట్టుకుపోయాయని అన్నారు. 69 నెంబరు గేట్ వద్ద కౌంటర్ వెయిట్ డ్యామేజ్ అయిందని చెప్పారు. 2,3 నెలల్లో కురవాల్సిన వర్షం 24 గంటల్లో కురవడం వల్ల ప్రమాదం సంభవించిందని వివరించారు. ప్రకాశం బ్యారేజీలో నాలుగు బోట్లు కొట్టుకు రావడం వెనుక వైసీపీ కుట్ర దాగి ఉండొచ్చని నిమ్మల వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలే ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్నారని, ఆశ్చర్యపోనవసరం లేదన్నారు.
ఏం చేయాలో బాబుకు తెలుసు
కృష్ణానదిలో ఇంత వరద నీటిని తాను ఎన్నడూ చూడలేదని నిమ్మల వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సమర్ధవంతంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇలాంటి సంక్షోభ సమయంలో ఎలా పని చేయాలో చంద్రబాబుకు తెలుసునని ఆయన స్పష్టం చేశారు. వరద ప్రాంతాల్లోనే సీఎం ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని వివరించారు. రాత్రి కూడా ముంపు ప్రాంతాల్లోనే ఉండి అధికారులను అప్రమత్తం చేశామన్నారు. గత ప్రభుత్వ వైఫల్యానికి బుడమేరుకు గండ్లు నిదర్శనమని విమర్శించారు. గత ఐదేళ్లుగా బుడమేరులో లైనింగ్, విస్తరణ పనులు చేపట్టలేదని ఆరోపించారు. ప్రాజెక్టు గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడిని ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్దకు తీసుకెళ్తున్నామని, గేట్లకు అడ్డుగా ఉన్న బోట్లను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ రాత్రికి ప్రకాశం బ్యారేజీ వద్ద మరమ్మతు పనులు చేపడతామని వెల్లడించారు. బుడమేరులో పడిన మూడు గుంతలను నేటి రాత్రి పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
పిలిస్తే పలికే విధంగా చంద్రబాబు
ప్రజలు పిలిస్తే పలికే విధంగా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని నిమ్మల తెలిపారు. రాజధానిపై వైసీపీది విషప్రచారమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయన ప్రతిపక్షంలో ఓకే అని... అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ముక్కలట ఆడారని అన్నారు. హైదరాబాద్, చైన్నె చిన్న వర్షానికి మునిగిపోతున్నాయన్నారు. అమరావతి ముంపు లేని ప్రాంతమని స్పష్టం చేశారు. నిత్యం వైసీపీ అబద్ధాలు, అసత్యాలు చెబుతోందని విమర్శలు చేశారు. ప్రకాశం బ్యారేజి విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చామని.. లక్షలాది మంది నుంచి ఫోన్లు వస్తాయన్నారు. పులిచింతల, ప్రకాశం బ్యారేజికి మధ్య లోకల్ క్యాచ్ మెంట్ నుంచి ఐదు లక్షల క్యూసిక్లు వచ్చాయన్నారు. ఫ్యూచర్లో ఇలాంటి వరద వచ్చినప్పుడు బుడమేరుకు శాశ్వత పరిష్కారం చూడాలని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.