Minister Kannababu: కుప్పం పర్యటనను హైలెట్ చేసుకునేందుకు చంద్రబాబు డ్రామాలు... రాళ్ల దాడులని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి కన్నబాబు ఆరోపణ
కుప్పం టూర్ ను హైలెట్ చేసుకునేందుకు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మంత్రి కన్నబాబు విమర్శలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఒక ప్లాన్ ప్రకారం బాంబులు, రాళ్ల దాడులని ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు.
కుప్పం పర్యటనను మీడియాలో హైలెట్ చేయించుకోవడం కోసం బాంబులు, రాళ్ల దాడులు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు పర్యటనలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడి చేశారని చెప్పుకోవడానికి ఆయనే సిగ్గుపడాలన్నారు. కుప్పంలోనూ అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు ఘోర పరాజయం పొందారని, టీడీపీ పునాదులు కదిలిపోతున్నాయని విమర్శించారు. ఎప్పుడూ లేనిది ఇవాళ వంగి వంగి నమస్కారాలు, రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిన్నటి వరకు గంజాయి, హెరాయిన్ అని, ఆ తర్వాత దాడులని, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని చెప్పేందుకే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని కన్నబాబు దుయ్యబట్టారు. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే ఒక ప్లాన్ ప్రకారం బాంబులు, రాళ్ల దాడులని ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు సభలో ఉద్రిక్తత
ఎవరైనా అభివృద్ధిపైనో, సంక్షేమంపైనో చర్చకు రమ్మంటారని, కానీ టీడీపీ నేతలు బూతులపై చర్చకు రమ్మని సవాళ్లు విసురుతున్నారని మంత్రి కన్నబాబు ఆరోపించారు. చర్చకు ఎక్కడికి రావాలో, మంత్రులు రావాలో, మరెవరైనా రావాలో చంద్రబాబు చెబితే తాము సిద్ధం అన్నారు. చంద్రబాబు కుప్పం సభలో ఉద్రిక్తత నెలకొంది. కుప్పం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తున్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తి బహిరంగసభ వద్దకు చేరుకుని కలకలం రేపాడు. టీడీపీ కార్యకర్తలు అతన్ని పట్టుకుని దాడిచేశారు. బాంబు తెచ్చాడంటూ అనుమానం వ్యక్తం చేయడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. చంద్రబాబు భద్రతా సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు తెరిచి ఆయనకు రక్షణగా నిలబడ్డారు. వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు.
వైసీపీ రైతు పక్షపాతి ప్రభుత్వం
వైసీపీ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, సంక్షేమానికి పెద్ద పీట వేసి సీఎం జగన్ పాలన పరిపాలిస్తున్నారన్నారు. చెప్పిన హామీలే కాకుండా చెప్పని పథకాలు కూడా రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్నామన్నారు. వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం, వైఎస్సార్ వడ్డీలేని రుణాలు, వైఎస్సార్ జలకళ వరకూ వివిధ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అధికారంలో వచ్చిన వెంటనే తొలి కేబినేట్ లోనే రైతులు మరణిస్తే వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.7 లక్షలు పరిహారం ఇస్తామని ప్రకటించి అమలు చేస్తున్నామని మంత్రి కన్నబాబు అన్నారు. రైతు ఆత్మహత్య సంఘటన జరిగిన వెంటనే ఆ జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎమ్మెల్యే, మంత్రులు ఆ కుటుంబాన్ని పరామర్శించి వెంటనే పరిహారం అందించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ల వద్ద అత్యవసర నిధి కోసం కోటి రూపాయలు జమ చేస్తున్నామన్నారు. వ్యవసాయ సంబంధ కారణాల వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారికి సాయం అందించాలని సీఎం ఆదేశించారు. అందుకు సంబంధించిన డేటాను పరిశీలించి, 450 కుటుంబాలను గుర్తించి ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల పరిహారం అందించామన్నారు.