IAS Transfers: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ... పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా ప్రసన్న వెంకటేష్
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా ప్రసన్న వెంకటేష్ ను నియమించింది. కార్తికేయ మిశ్రాను కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్ గా బదిలీ చేసింది.
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌ను పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఐటీ శాఖ కార్యదర్శి కె.సునీతను మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడుని సాంఘీక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి నియమించారు. ఇక పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాను కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్ గా బదిలీ చేసింది ప్రభుత్వం. ఆ శాఖ కమిషనర్ రేఖారాణిని కాపు కార్పొరేషన్ ఎండీగా నియమించింది. పురపాలక శాఖలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రంజిత్ బాషాను విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు. ఇక ఎన్వీ రమణరెడ్డిని ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ సీఈవోగా బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. హిమాన్షు శుక్లాను ఏపీ భవన్ స్పెషల్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్.పవన్ మూర్తిని సాంఘీక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ కార్యదర్శిగా బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు ఇచ్చారు.
Also Read: ఏపీలో మరో 13 కొత్త జిల్లాలు... ఉగాదిలోపు అమల్లోకి వచ్చే అవకాశం... నేడో, రేపో నోటిఫికేషన్ విడుదల..!
సివిల్ సర్వీస్ రూల్స్ మార్పు
సివిల్ సర్వీస్ అధికారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎవరినైనా ఢిల్లీకి పిలిపించుకునేలా క్యాడర్ రూల్స్‌ను కేంద్రం మార్చాలని నిర్ణయించుకుంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. కానీ ఇతర రాష్ట్రాలు మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. తాము నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధానేమంత్రి మోడీకిలేఖ రాశారు. నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. అసలు ఆలిండియా సర్వీస్ రూల్స్ ఎందుకు మారుస్తున్నారు..? రాష్ట్రాలకు ఇబ్బందేంటి ?
సివిల్ సర్వీస్ కేడర్ రూల్స్‌లో కేంద్రం నాలుగు మార్పులు ప్రతిపాదించింది. కావాల్సిన అధికారిని స్వయంగా వెనక్కి పిలిపించుకోవడం, ఎంత మందినైనా తీసుకోవడం.. అధికారుల విషయంలో కేంద్రం మాటే ఫైనల్ కావడం .. కేంద్రం అడిగితే మరో మాట లేకుండా అధికారిని పంపాల్సిందే అన్న నాలుగు సవరణలు చేశారు. ఇప్పటి వరకూ రాష్ట్ర కేడర్‌కు చెందిన సివిల్ సర్వీస్ అధికారినికేంద్రానికి పంపాలంటే రాష్ట్రం నిరభ్యంతరపత్రం ఇవ్వాలి. ఒక రాష్ట్రం నుంచి 40శాతం మందికి మించి కేంద్రానికి డెప్యుటేషన్ మీద వెళ్లకూడదనే నిబంధన ఇప్పటి వరకూ ఉంది. ఇక ముందు ఉండదు. కొత్త రూల్స్ అమల్లోకి వస్తే రాష్ట్రాలు ఆమోదం తెలపడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది.
Also Read: సివిల్ సర్వీస్ కేడర్ రూల్స్‌లో మార్పులకు కేంద్రం సిద్దం - వ్యతిరేకిస్తూ కేసీఆర్ లేఖ !