Constable Recruitment: ఏపీలో కానిస్టేబుళ్ల నియామకంపై ముందడుగు - హోంమంత్రి అనిత కీలక ప్రకటన
Andhra News: ఏపీలో అర్ధంతరంగా నిలిచిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియ తిరిగి ప్రారంభిస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. slprb.ap.gov.in సైట్‌లో వివరాలు పొందుపరిచినట్లు వెల్లడించారు.
Home Minister Anitha Comments On Constable Recruitment: కానిస్టేబుల్ నియామకాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అర్ధంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియను వెంటనే తిరిగి ప్రారంభిస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం వెల్లడించారు. 6,100 ఉద్యోగాల భర్తీకి సంబంధించి శారీరక సామర్థ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలను 5 నెలల్లోపు పూర్తి చేస్తామని తెలిపారు. slprb.ap.gov.in వెబ్ సైట్‌లో పూర్తి వివరాలు పొందుపరిచినట్లు చెప్పారు.
ఎమ్మెల్సీ ఎన్నికల క్రమంలో..
కాగా, గత 2022లో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 4,59,182 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 95,209 మంది అభ్యర్థులు తదుపరి దశకు ఎంపికయ్యారు. అయితే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సహా ఇతర కారణాలతో నియామక ప్రక్రియ వాయిదా పడింది. ప్రిలిమినరీ పరీక్షకు మొత్తం 3,622 మంది హోంగార్డులు హాజరు కాగా అందులో 382 మంది మాత్రమే అర్హత సాధించారు. అర్హత సాధించని వారిలో 100 మంది అభ్యర్థులు 14 రిట్ పిటిషన్లను హైకోర్టులో వేశారు. హోంగార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించడం ద్వారా హోంగార్డుల కోటాలో ప్రత్యేక మెరిట్ జాబితాను ప్రకటించాలని వారు కోర్టును కోరగా.. ఆ 100 మందిని తదుపరి దశకు అనుమతించాలని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిందని హోంమంత్రి తెలిపారు. అప్పటి నుంచి గత ప్రభుత్వం నియామక ప్రక్రియపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిలిపేసింది.
కూటమి ప్రభుత్వ హయాంలో దీనిపై న్యాయ సలహా తీసుకుని.. నియామక ప్రక్రియలో రెండో దశ PMT/PET పరీక్షలను వెంటనే కొనసాగించాలని నిర్ణయించామని మంత్రి అనిత తెలిపారు. దీనికి సంబంధించి దరఖాస్తు ఫారం, పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. రెండో దశలో ఉత్తీర్ణులైన వారికి మూడో దశ ప్రధాన పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు.
Also Read: Andhra News: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర