Home Minister Sucharitha: అయ్యన్న వ్యాఖ్యలపై హోంమంత్రి సుచరిత స్ట్రాంగ్ రిప్లై... తనను రాజీనామాను చేయమనడానికి అయ్యన్న ఎవరని ప్రశ్న
తన రాజీనామా కోరడానికి అయ్యన్నపాత్రుడు ఎవరని హోంమంత్రి సుచరిత ప్రశ్నించారు. చంద్రబాబుకు మహిళలపై గౌరవం ఉంటే అయ్యన్నపాత్రుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజాతీర్పును టీడీపీ నేతలు గౌరవించట్లేదని ఏపీ హోంమంత్రి సుచరిత అన్నారు. సీఎం జగన్‌పై అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. తాడేపల్లిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తన రాజీనామా కోరడానికి అయ్యన్న పాత్రుడు ఎవరని సుచరిత ప్రశ్నించారు. టీడీపీ హయాంలోనే వంగవీటి రంగాను హత్య జరిగినప్పుడు శాంతిభద్రతలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. జగన్‌పై కోడి కత్తితో హత్యాయత్నం చేస్తే ఎగతాళి చేశారని ఆరోపించారు. దళిత మహిళనైన తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు.
అయ్యన్నపై చర్యలు తీసుకోండి
అయ్యన్న పాత్రుడు తనపై చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి సుచరిత ఘాటుగా స్పందించారు. అయ్యన్న ఉపయోగించిన భాషను తాను వాడలేనన్నారు. వైసీపీకి ఉన్న ప్రజా మద్దతు చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. జోగి రమేశ్ కారు దిగకముందే దాడి జరిగిందని ఆమె తెలిపారు. చంద్రబాబుకు విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వెళ్లారని సుచరిత తెలిపారు. దళిత మహిళను హోంమంత్రిని చేస్తే టీడీపీ నేతలకు ఎందుకంత కడుపు మంట అని ప్రశ్నించారు. దిశ చట్టంపై అభ్యంతరాలు ఉంటే ప్రశ్నించాలన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం మహిళలకు ఏం న్యాయం చేసిందని ప్రశ్నించారు. చంద్రబాబుకు మహిళలపై గౌరవం ఉంటే అయ్యన్నపాత్రుడిపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి సుచరిత డిమాండ్ చేశారు. హోంమంత్రిపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మహిళలంటే ఎలాంటి భావం ఉందో అర్థం అవుతోందన్నారు. ప్రజలు ప్రతి ఒక్కటి ఆలోచించి చేస్తారని సుచరిత అన్నారు.
Also Read: KTR: డ్రగ్స్ టెస్టుకు సిద్ధం.. రక్తం, వెంట్రుకలు ఇస్తా.. రాహుల్ గాంధీ సిద్ధమా మంత్రి కేటీఆర్ సవాల్!
అయ్యన్నపాత్రుడి ఇళ్లు ముట్టడి
టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఇంటిని ముట్టడికి ఎమ్మెల్యే ఉమాశంకర్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు భారీ ర్యాలీగా బయలుదేరారు. అయ్యన్న పాత్రుడి ఇంటిని ముట్టడించేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వైసీపీ నేతలను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనచేపట్టారు.